కేంద్రం-తెలంగాణ మధ్య ‘సీబీఐ’ వివాదం తప్పదా ?
x

కేంద్రం-తెలంగాణ మధ్య ‘సీబీఐ’ వివాదం తప్పదా ?

విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి, అవకతవకల విచారణను కూడా సీబీఐకే అప్పగించటంలో రేవంత్ ఆలోచన ఏమిటి ?


బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు, థర్మల్ కేంద్రాల ఏర్పాటులో జరిగిన అవినీతి, అవకతవకలపై సీబీఐ విచారణ జరిగేట్లుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అద్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం డిసైడ్ చేసింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాల పేరుతో ఛత్తీస్‌ఘడ్ నుండి పెద్దఎత్తున విద్యుత్ కొనుగోలు జరిగింది. విద్యుత్ కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వం సుమారు రు. 1500 కోట్లను అనవసరంగా చెల్లించిన కారణంగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడిందనే ఆరోపణలున్నాయి. అలాగే భద్రాద్రి, యాద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కూడా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి.

విద్యుత్ రంగంలోని ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ తో విచారణ చేయించింది. కమిషన్ అనేకమందిని విచారించి ప్రభుత్వానికి రిపోర్టు అందించింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ కొనుగోలు పేరుతో జరిగిన వందల కోట్ల రూపాయల అక్రమాలపైన సీబీఐ విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యింది. సీబీఐ విచారణకు రాష్ట్రప్రభుత్వ సిఫారసును పరిగణలోకి తీసుకుని వెంటనే కేసును టేకప్ చేసి దర్యాప్తు మొదలుపెట్టేట్లుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మంత్రులను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే కాళేశ్వరం విచారణకు సీబీఐ విచారణ కోరినా అతీగతి లేని విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

సో, ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే రేవంత్ తో పాటు మంత్రులందరు సీబీఐ విచారణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటం ఖాయం. ఆ ఒత్తిడి మీడియా సమావేశాల్లో కేంద్రం ఆరోపణలు చేయటం ద్వారానా లేకపోతే నేరుగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవటం అదీకాకపోతే సీబీఐ డైరెక్టర్ ను కలవటం లాంటి మార్గాల్లో దేన్ని ఎంచుకుంటారనేది తెలీదు. ఇదేదీ వర్కవుట్ కాకపోతే హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని అసెంబ్లీలోనే తీర్మానం చేయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో తీర్మానంచేసి 9 నెలలు అయినా కేంద్రం నుండి సమాధానంలేదు. అందుకనే రెండునెలల క్రితం రాష్ట్రం మరోసారి కేంద్రానికి ఇదే విషయమై లేఖ రాసినా కేంద్రం పట్టించుకోవటంలేదు.

కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌తో ఒప్పందం కారణంగా బీజేపీనే కాపాడుతోందని రేవంత్ ఇప్పటికే చాలాసార్లు ఆరోపణలు చేశారు. బహిరంగసభలు, మీడియాసమావేశాల్లో కూడా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిని సీబీఐకి అప్పగించకముందు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అప్పట్లో రేవంత్ ను టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో అందరిపైనా కేసులు పెట్టి మొత్తం అందరినీ బొక్కలో తోయిస్తామని అప్పట్లో నానా గోలచేశారు. తీరా కేసును సీబీఐకి అప్పగించిన దగ్గర నుండి కేంద్రమంత్రులు ఇద్దరు అసలు కేసుగురించి నోరే విప్పటంలేదు. రేవంత్, మంత్రులు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నా కేంద్రమంత్రులిద్దరు మౌనమే సమాధానంగా ఉంటున్నారు. కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ అంశాన్ని తప్ప మిగిలిన అన్నీ విషయాలపైనా మాట్లాడుతున్నారు.

ఈనేపధ్యంలోనే విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి, అవకతవకల విచారణను కూడా సీబీఐకి అప్పగిస్తే ఏమిటి ఉపయోగం అన్నదే అర్ధంకావటంలేదు. రేవంత్ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కేంద్రప్రభుత్వం అయితే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. రాష్ట్రప్రభుత్వ సిఫారసును కేంద్రం ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. కేంద్రప్రభుత్వ వైఖరిని గమనించేవారికి బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న రేవంత్ ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే రేవంత్ ప్రభుత్వం ఎంత గోలచేసినా కేసీఆర్ కు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరగదు. ఈ నేపధ్యంలో విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి, అవకతవకల విచారణను కూడా సీబీఐకే అప్పగించటంలో రేవంత్ ఆలోచన ఏమిటి ?

రేవంత్ వ్యూహం

బీఆర్ఎస్-బీజేపీలు ఒకటే అని పదేపదే చెప్పటం ద్వారా రెండుపార్టీలను జనాల్లో మరింతగా బద్నాం చేయటమే రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. కవిత లిక్కర్ స్కామ్ సందర్భంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్దతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్, నేతలు ఇలాంటి ప్రచారమే చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాబట్టే లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ, ఈడీలు విచారించటంలేదు, అరెస్టులు చేయటంలేదని పదేపదే ఎన్నికల్లో ప్రచారం చేశారు. దాని ఫలితమో ఏమో 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు కవితను సీబీఐ అరెస్టుచేసి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంచింది. ప్రత్యర్ధిపార్టీలను జనాల్లో పలుచన చేయటంకోసం ప్రతిపార్టీ ఇలాంటి రాజకీయ వ్యూహాలనే అనుసరిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఫ్యాక్టర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా బాగా వర్కవుట్ అయ్యింది. మరిపుడు బీజేపీ,బీఆర్ఎస్ ఒకటి కాబట్టే సీబీఐ విచారణను పట్టించుకోవటంలేదనే ఆరోపణల తీవ్రతను పెంచటం అంటే తొందరలో జరగబోయే పరిషత్, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్దికేనా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story