x

అధిష్టానం దెబ్బకు చేతులు కలిపారా ?(వీడియో)

విభేదాలను వీడి కలిసి పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది అన్న అధిష్ఠానం వార్నింగ్ కారణంగానే ఇద్దరూ చేతులు కలిపారని పార్టీలో టాక్ వినబడుతోంది.


ఉప్పు నిప్పులాగుండే ఇద్దరు సీనియర్ నేతలు చివరకు చేతులు కలిపారు. విభేదాలను వీడి కలిసి పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది అన్న అధిష్ఠానం వార్నింగ్ కారణంగానే ఇద్దరూ చేతులు కలిపారని పార్టీలో టాక్ వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ బీజేపీలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సీనియర్ నేతలన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఏమాత్రం పడటంలేదు. చాలాకాలంగా ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగుంది. ఇద్దరు బాహాటంగానే ఒకరికి మరొకరు వార్నింగులిచ్చుకున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తిట్టుకున్నారు కూడా.

విభేదాలను మరచిపోమని, కలిసిపనిచేయమని ఇద్దరికి పార్టీ నేతలు చాలామంది చాలాకాలంగా చెబుతున్నా ఉపయోగం కనబడటంలేదు. ఒకరున్న సమావేశానికి మరొకరు గైర్హాజరవుతున్నారు. అలాంటిది ఇపుడు ఇద్దరు చేతులు కలపటమే కాకుండా హత్తుకుని మీడియాకు ఫోజులిచ్చారు. ‘‘అసలు తమ మధ్య ఎలాంటి భేదాలు లేవని..ఇద్దరం కలిసి పార్టీ కోసం పనిచేస్తాము’’ అని చెప్పుకున్నారు. సడెన్ గా ఇద్దరు ఎందుకు హత్తుకున్నారు ? ఎందుకు మీడియా ముందు ఫోజులిచ్చారు ?

ఎందుకంటే అధిష్ఠానం తెలంగాణ ఇంచార్జి అభయ్ పాటిల్ ద్వారా సీరియస్ వార్నింగ్ పంపినట్లు సమాచారం. విభేదాలను మరచిపోయి ఇద్దరు పార్టీకోసం పనిచేస్తారా ? లేకపోతే ప్రత్యామ్నాయాన్ని చూసుకోమంటారా ? అని వార్నింగ్ పంపినట్లు తెలిసింది. పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో అభయ్ పాటిల్ సమక్షంలో బండి, ఈటల భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలు జరిగిన భేటీలో ఏమి జరిగింది అన్న విషయం పూర్తిగా బయటకు పొక్కలేదు కాని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ వార్నింగ్ పంపిందని మాత్రం తెలిసింది. అందుకనే వేరేదారిలేక ఇద్దరు చేతులు కలపటమే కాకుండా హత్తుకుని మీడియాకు ఫోజులిచ్చింది. చేతులు కలపటంలో, హత్తుకుని ఫోజులివ్వటంలో నిజాయితీ ఉందా ?

Read More
Next Story