
విజయ్ కు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ.. కానీ!
తెరవెనక చర్చలు జరుపుతున్న అన్నాడీఎంకే
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము మద్దతు ఇస్తామని గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రకటించింది.
మొన్న వెలువడిన అసెంబ్లీ ఫలితాలో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించింది. అయితే అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర చిన్న పార్టీలతో టీవీకే సంప్రదింపులు ప్రారంభించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలు మాత్రమే సాధించిన నేపథ్యంలో మరో ఐదు స్థానాలు ప్రభుత్వ ఏర్పాటుకు తక్కువగా ఉన్నాయి.
అన్నాడీఎంకే..
టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్నాడీఎంకే పార్టీ సైతం రంగంలోకి దిగినట్లు తెలిసింది. టీవీకే తో పార్టీ ప్రధాన కార్యదర్శి కే. పళని స్వామి చర్చలు జరుపుతున్నట్లు అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమరోజ్ మార్టిన్ తెలిపారు.
లాటరీ వ్యాపారీ అయిన శాంటియాగో మార్టిన్ భార్యే లీమరోజ్. ఆమె తిరుచ్చి జిల్లాలోని లాల్ గుడి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆమె అల్లుడే టీవీకే పార్టీ ప్రధాన నాయకుడు, విల్లింబాక్కం ఎమ్మెల్యే అదవా అర్జునా. ఈయన నేతృత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.
2024 లో తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రారంభించిన విజయ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాడు. 234 స్థానాలలో పోటీ చేసిన టీవీకే 108 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగి రెండు చోట్ల విజయం సాధించారు. దీనితో సాంకేతికంగా ఆయన పార్టీ 107 స్థానాలు మాత్రమే గెలిచినట్లు అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం.
షరతులతో కాంగ్రెస్..
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన మద్దతును బీజేపీ లాంటి మిత్రపక్షం నుంచి కాకుండా భావసారూప్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్, డీఎండీకే నుంచి తీసుకోవాలని షరతు విధించినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీనికి విజయ్ అంగీకరించినట్లు అయితే ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Next Story

