కాంగ్రెస్‌లో కార్పొరేట్ గ్రేడింగ్
x

కాంగ్రెస్‌లో 'కార్పొరేట్ గ్రేడింగ్'


తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లాఅధ్యక్షుల పనితీరుకు కొత్తపద్దతిని మొదలుపెట్టింది పార్టీ అధిష్ఠానం. ఇప్పటివరకు అనేక అంశాలమీద అధ్యక్షుల పనితీరు నడిచిపోయేది. అయితే ఇప్పటినుండి పూర్తిగా కొత్తపద్దతిని ప్రవేశపెట్టింది. అదేమిటంటే మూడునెలల క్రితం అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొన్న 33 మంది సీనియర్ నేతల పనితీరుపై సెల్ఫ్ అప్రైజల్ రిపోర్టు తీసుకుంటోంది. రెండు రోజుల సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ రెండురోజుల మదింపు కార్యక్రమం బుధవారం పార్టీ ఆఫీసు గాంధీభవన్లో మొదలైంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుల పనితీరును పార్టీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీ సెంథిల్, తెలంగాణ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమీక్షిస్తున్నారు.

అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న మూడు మాసాల నుండి ఇప్పటివరకు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలను అమలుచేసిన విధానంపైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధ్యక్షులు చెప్పిన వివరాలతో అప్పటికే తాము సేకరించిన ఫీడ్ బ్యాక్ ను సరిచూసుకుంటున్నట్లు తెలిసింది. తమ పనితీరు గురించి చెప్పుకోవటానికి ప్రతి జిల్లా అధ్యక్షుడికి కమిటి అర్ధగంట సమయం ఇస్తోంది.

ఈ సమీక్షలో సాంకేతికతను జోడించడం పై పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ వెబ్ సైట్లో తాము నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, గ్రౌండ్ లెవెల్ ఫోటోలను పార్టీ పోర్టల్‌లో అధ్యక్షులు అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను, వివరాలను పార్టీ సాంకేతిక విభాగం క్షుణ్ణంగా అధ్యయనంచేస్తోంది. ఈ ఫోటోలు, వివరాలను కేవలం లాంఛనంగా కాకుండా ‘జియో ట్యాగింగ్’ సాఫ్ట్‌వేర్ ద్వారా క్షుణ్ణంగా అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో కేడర్ ను సమన్వయం చేసుకుంటున్న విధానం, సోషల్ మీడియా యాక్టివిటీకి ఇస్తున్న ప్రాధాన్యతను కూడా కమిటి గమనిస్తోంది. అధ్యక్షులు అయిన దగ్గర నుండి ఎమ్మెల్యేలకు, ప్రజలకు ఎంతవరకూ అందుబాటులో ఉంటున్నారు అనే అంశం కూడా కీలకంగా మారింది. అధ్యక్షులు అందిస్తున్న సెల్ఫ్ అప్రైజల్, కమిటి ఇప్పటికే సేకరించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జిల్లా అధ్యక్షులకు పార్టీ ‘రేటింగ్స్’ ఇవ్వబోతున్నట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.

Read More
Next Story