
జగిత్యాలలో మొదలైన ‘క్రాస్ బ్రీడ్’ రాజకీయం
నువ్వు క్రాస్ బ్రీడ్ అంటే కాదు కాదు నువ్వే క్రాస్ బ్రీడ్..నీదే క్రాస్ బ్రీడ్ పార్టీ అని ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు
తెలంగాణలో అన్నీరకాలైన రాజకీయాలు అయిపోయి చివరకు ఇపుడు ‘క్రాస్ బ్రీడ్ రాజకీయాలు’ మొదలయ్యాయి. నువ్వు క్రాస్ బ్రీడ్ అంటే కాదు కాదు నువ్వే క్రాస్ బ్రీడ్..నీదే క్రాస్ బ్రీడ్ పార్టీ అని ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. సాయంత్రం మొదలయ్యే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఈసభ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. జీవన్ చేరిక సందర్భంగా బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణ జిల్లానేతల్లో జోష్ నింపేందుకు సభ నిర్వహణను అవకాశంగా తీసుకున్నది.
పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించుకోవటంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదు. అయితే బహిరంగసభ జరుగుతన్నది జగిత్యాలలో. జగిత్యాలకు ఉన్న ప్రధాన్యత ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా డాక్టర్ సంజయ్ కుమార్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద గెలిచారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచినా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. దాంతో మారిపోయిన రాజకీయ సమీకరణల్లో భాగంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ కు దగ్గరయ్యారు. ఎప్పుడైతే సంజయ్ సీఎంకు దగ్గరయ్యారో అప్పటినుండి జీవన్ కు సమస్యలు మొదలయ్యాయి.
42 ఏళ్ళుగా పార్టీ తరపున జగిత్యాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న జీవన్ మాట చెల్లుబాటు కావటం ఆగిపోయింది. నియోజకవర్గంలో ఎక్కడచసినా సంజయ్ మాటే చెల్లుతోంది. దీంతో బాగా సఫొకేటింగ్ ఫీలైన జీవన్ సంజయ్ తో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. జీవన్ ఒకవైపు సంజయ్ ను వ్యతిరేకిస్తునే మరోవైపు రేవంత్ మీద పరోక్షంగా ఆరోపణలు మొదలుపెట్టారు. జీవన్ ఆరోపణలు, విమర్శలను రేవంత్ పట్టించుకోవటం మానేశారు. తనను రేవంత్ పట్టించుకోవటంలేదన్న మంట జీవన్లో బాగా పెరిగిపోయి చివరకు పార్టీకి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ లో జీవన్ చేరుతున్న సందర్భంగా ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ పైన ఆరోపణలతో రెచ్చిపోయారు. బీఆర్ఎస్ లో గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో తిరుగుతున్న సంజయ్ ను క్రాస్ బ్రీడ్ ఎంఎల్ఏగా అభివర్ణించారు. ఇలాంటి క్రాస్ బ్రీడ్ ఎంఎల్ఏలు మొత్తం పదిమంది ఉన్నారనే అర్ధం వచ్చేట్లుగా కేటీఆర్ ఎద్దేవాచేశారు. సంజయ్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి సంజయ్ ఉపఎన్నికల్లో గెలవాలని చాలెంజ్ చేశారు.
తనను కేటీఆర్ క్రాస్ బ్రీడ్ అన్నాక సంజయ్ ఊరుకుంటారా ? వెంటనే మీడియా సమావేశం పెట్టి కడిగిపారేశారు. కేటీఆరే క్రాస్ బ్రీడ్ అని ఎదురుదాడి మొదలుపెట్టారు. ‘‘నేను రాజకీయ వ్యభిచారిని అయితే..నువ్వు వ్యభిచార కొంప నిడిపావా’’? అంటు ఘాటుగా స్పందించారు. ‘‘గతంలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న నీదా క్రాస్ బ్రీడ్ ? నాదా’’ ? అంటు ఓ రేంజిలో రెచ్చిపోయారు. ‘‘గతంలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున చంద్రశేఖర్ గౌడ్ ను నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన జీవన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ చేయించిన క్రాస్ బ్రీడ్ నాయకుడు కేటీఆర్’’ అంటు మండిపోయారు. అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని డాక్టర్ సంజయ్ రెచ్చిపోయారు. కల్లకుంట్ల కుటుంబ అహంకారపూరిత వ్యాఖ్యలతోనే రాష్ట్రంలో వెలమజాతి గౌరవం తగ్గుతోంది అని కూడా హెచ్చరించారు. మొత్తానికి ఇటు కేటీఆర్ అటు సంజయ్ ఒకరిపై మరొకరు చేసుకున్న క్రాస్ బ్రీడ్ రాజకీయ ఆరోపణలతో జగిత్యాల ఒక్కసారిగా వేడెక్కిపోయింది.
ఫిరాయింపులు కేసీఆర్ తోనే మొదలు
సరే, ఈ క్రాస్ బ్రీడ్ రాజకీయాల ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతిని వదిలేస్తే అసలు ఫిరాయింపుల గురించి కేటీఆర్ మాట్లాడటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు ఫిరాయింపులు మొదలుపెట్టిందే కేసీఆర్. 2014-23 మధ్య 18 మంది ఎంఎల్ఏలు, 23 మంది ఎంఎల్సీలను, నలుగురు ఎంపీలను టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నుండి బీఆర్ఎస్ లోకి లాక్కున్నదే కేసీఆర్. అప్పట్లో ఫిరాయింపుల్లో కొందరికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. అప్పుడెప్పుడూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేటీఆర్ నోరెత్తలేదు. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాల దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతుంటే కేటీఆర్ తదితరులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అలాంటిది 2023 ఎన్నికల్లో తాము ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అవే ఫిరాయింపులు మొదలుపెట్టారు. రేవంత్ దెబ్బకు ఇపుడు బీఆర్ఎస్ విలవిల్లాడుతోంది. ఆ నొప్పిన తట్టుకోలేకే కేటీఆర్ పదేపదే ఫిరాయింపులంటు నానా గోలచేస్తున్నారు.

