
మంత్రులకు రేవంత్ క్లాసు పీకారా ?(వీడియో)
మంత్రుల వైఖరిపై రేవంత్ తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం
క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొందరు మంత్రులకు ఫుల్లుగా క్లాసుపీకినట్లు సమాచారం. క్లాసు ఎందుకు పీకారో తెలియాలంటే దానికన్నా ముందు ఏమిజరిగిందో తెలుసుకోవాలి. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుతో పాటు గన్ పార్క్ లోని అమరవీరుల సంస్మరణ స్ధూపం దగ్గర కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య యుద్ధవాతావరణమే కనబడింది. గురుకుల స్కూళ్ళ భవనాల టెండర్లు, పిల్లల హాస్టళ్ళకు సంబంధించిన మెస్ లోని వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆరోపణలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజహరుద్దీన్ ధీటుగా స్పందించారు.
అమరవీరుల స్ధూపం దగ్గర తనతో బహిరంగచర్చకు రావాలన్న హరీష్ ఛాలెంజ్ ను మంత్రులు స్వీకరించటంతో పై ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. చెప్పిన సమయానికి హరీష్, నేతలు హాజరైనా మంత్రులు రాలేదు. ఇంతలో పోలీసులు హరీష్ తదితరులను అక్కడినుండి పంపించేందుకు ప్రయత్నించటంతో తోపులాట జరిగింది. తర్వాత అతికష్టంమీద పోలీసులు హరీష్ తదితరులను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి సమీపంలోని పోలీసుస్టేషన్ కు తరలించారు. హరీష్ తదితరులను పోలీసులు తరలించిన వెంటనే మంత్రులు అక్కడికి చేరుకున్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తానని చెప్పారు. ఎందుకంటే, బీఆర్ఎస్ హయాంలో రు. 8.30 లక్షల కోట్ల అప్పయ్యిందని రేవంత్, మంత్రులు పదేపదే చెబుతుండటాన్ని కేటీఆర్ ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అప్పును పార్టీ ఆఫీసుకు వచ్చి ఆధారాలతో సహా నిరూపిస్తానని జూపల్లి ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ స్పందించి పార్టీ ఆఫీసుకు రావాలని చెప్పి గురువారం ఉదయం తాను పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎంతసేపు కేటీఆర్ వెయిట్ చేసినా మంత్రి అడ్రస్ లేరు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వస్తానని చెప్పిన మంత్రి జూపల్లి రాకుండా ఎక్కడ ఉన్నారు ? ఎక్కడున్నారంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) ఆఫీసులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వస్తానని కేటీఆర్ తో ఛాలెంజ్ చేసిన మంత్రి సీఎల్పీలో ఎందుకు కూర్చున్నారో ఆయనకే తెలియాలి. పై రెండు అంశాలతో మంత్రుల వైఖరిపైనే నెగిటివ్ ఏర్పడింది. ఎందుకంటే హరీష్ ను ఛాలెంజ్ చేసిన ముగ్గురు మంత్రులు గన్ పార్కుకు చేరుకుని చర్చ జరపలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వస్తానని చెప్పిన మంత్రి జూపల్లి అడ్రస్ లేరు. ఈ రెండు ఘటనల్లో జనాలకు ఏమి అర్ధమైందంటే బీఆర్ఎస్ నేతలను ఛాలెంజ్ చేసిన మంత్రులు వెనక్కుతగ్గారు అని.
ఈ విషయంలోనే మంత్రుల వైఖరిపై రేవంత్ తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలను ఛాలెంజ్ చేసిన మంత్రులు సవాలుకు ఎందుకు నిలబడలేదని నిలదీసినట్లు తెలిసింది. ప్రతిపక్షాల నేతలతో బహిరంగ చర్చకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ను వేదికగా చేసుకోమని తాను చెబితే ముగ్గురు మంత్రులు గన్ పార్క్ కు ఒక మంత్రి బీఆర్ఎస్ ఆఫీసుకు వస్తానని చెప్పటం ఏమిటని మండిపడ్డారు. మంత్రుల వైఖరితో జనాలకు ఎలాంటి సమాచారం వెళ్ళిందో తెలుసా అని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆర్ధిక సమస్యలున్నా సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయటానికి తాను ఒకవైపు నానా అవస్తలు పడుతుంటే మరోవైపు కొందరు అనాలోచిత మాటలు, సవాళ్ళ వల్ల ప్రభుత్వంపైన బురదచల్లే అవకాశం మంత్రులే ప్రతిపక్షాలకు ఇవ్వటం ఏమటని క్లాసు పీకినట్లు సమాచారం. మరి రేవంత్ క్లాసు పీకిన తర్వాతయినా మంత్రులు జాగ్రత్తపడతారా ? ఏమో వెయిట్ చేసి చూడాల్సిందే.

