
కూతురు దెబ్బకే సురేఖ మంత్రిపదవి ఊడిందా ?
పరకాల సిట్టింగ్ ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటితో గెలిపించాలని రేవంత్ ఇచ్చిన పిలుపుతోనే వివాదం మొదలైంది
దేవాదాయ, అటవీ శాఖలకు మంత్రిగా ఉన్న కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేశారు. మంత్రిగా రాజీనామా చేయటానికి సురేఖ అంగీకరించకపోవటంతోనే క్యాబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాల్సొచ్చింది. అసలు మంత్రివర్గం నుండి సురేఖను బర్త్ రఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఆగస్టు 18వ తేదీన నోటికొచ్చినట్లు మాట్లాడటమే కారణం.
పరకాల సిట్టింగ్ ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటితో గెలిపించాలని రేవంత్ ఇచ్చిన పిలుపుతోనే వివాదం మొదలైంది. రేవూరికి టికెట్ ప్రకటించటానికి రేవంత్ కు అర్హత ఏమిటి ? అధికారం ఏమిటి ? అని కూతురు సుస్మిత పటేల్ నిలదీసింది. సీఎం అయిన తర్వాత రేవంత్ కు కళ్ళు నెత్తికెక్కిందని చాలా చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది. కూతురు మాటలు తప్పని చెప్పాల్సిన కొండాసురేఖ పరోక్షంగా మద్దతుగా మాట్లాడారు.
రేవంత్ మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉంటూనే సీఎంపైన కూతురు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను ఖండించాల్సిన సురేఖ తనకు సంబంధంలేదని చెప్పటమే విచిత్రం. సురేఖ వ్యాఖ్యలతోనే పార్టీలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు మండిపోయి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేయటంతోనే వివాదం తారాస్ధాయికి రాజుకుంది. చివరకు ఢిల్లీలో పార్టీపెద్దలకు రాసిన మెయిల్ లో రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కూతురు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఉండకూడదు అని చెప్పాల్సిన సురేఖ పదేపదే కూతురు వ్యాఖ్యలకు, ఆరోపణలతో తనకు సంబంధంలేదనే వాదన వినిపించటమే కాకుండా రేవంత్ తదితరులపై ఎదురుదాడి చేయటమే ఆమె బర్త్ రఫ్ కు కారణమైంది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలామంది ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలతో సురేఖకు ఏమాత్రం పడటంలేదు. పార్టీలోనే కాదు సహచర మంత్రులు పొంగులేటి, గడ్డం వివేక్‌తో కూడా పడదు.
కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఏ పార్టీలో ఉన్నా నిత్యం వివాదాలతోనే సరిపోతోంది. మొదటినుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కొండా ఫ్యామిలీ 2009 తర్వాత డెవలప్మెంట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీలో చేరారు. తర్వాత జగన్ తో పడక పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కొంతకాలానికి పార్టీ నేతలతో పడక, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో పరకాల టికెట్ ఇవ్వకపోవటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వివాదం రేగి తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
2018లో పోటీచేసి ఓడిపోయినా 2023లో గెలిచి మంత్రయ్యారు. మంత్రి అయిన దగ్గర నుండి జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపీ, ఎంఎల్సీలు, సీనియర్ నేతలతో గొడవలు మొదలయ్యాయి. చాలాసార్లు వీళ్ళ మధ్య పీసీసీ క్రమశిక్షణా కమిటి పంచాయితీలు చేసినా ఉపయోగం కనబడలేదు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ తో గొడవలయ్యాయి. తనకు ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కొంతమంది బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. సుమంత్ ను విచారించేందుకు పోలీసులు ఎంతప్రయత్నించినా పట్టుకోలేకపోయారు.
మంత్రి ఇంట్లోనే ఓఎస్డీ ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు సురేఖ ఇంటికి వెళ్ళారు. అయితే పోలీసులను ఇంట్లోకి రానీయకుండా కూతురు సుస్మిత అడ్డుకుని నానా తిట్లుతిట్టింది. పోలీసులను తిట్టటంతో ఆగని సుస్మిత రేవంత్ పైన కూడా నోరుపారేసుకున్నది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అయితే వివాదం ముదరకుండా రేవంత్ మీద కూతురు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు సురేఖ క్షమాపణ చెప్పటంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది.
మళ్ళీ ఇపుడు రేవంత్ పై సుస్మిత చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలకు సురేఖ మద్దతుగా నిలబడటమే వివాదానికి ఆజ్యంపోసినట్లయ్యింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో, మంత్రివర్గంలో కూడా చాలామందితో పడక, నిత్యం వివాదాస్పదం అయిన కొండా సురేఖ చివరకు కూతురు సుస్మితా పటేల్ నోటి దురుసు కారణంగానే మంత్రిపదవి నుండి బర్త్ రఫ్ అయ్యారు.
తనను బర్త్ రఫ్ చేయటం అన్యాయం : సురేఖ
కూతురు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా తనను మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయటం అన్యాయం అని కొండా సురేఖ అన్నారు. బర్త్ రఫ్ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఉద్దేశించి సురేఖ 6 పేజీల లేఖను విడుదల చేశారు. అందులో రేవంత్, భట్టి, పొంగులేటి తదితరులపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. బీసీ మహిళను ఏకపక్షంగా మంత్రివర్గంలో నుండి తప్పించటం ఏమిటి ? అని ప్రశ్నించారు. వివరణ చెప్పుకోవటానికి కూడా తనకు పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వకపోవటాన్ని సురేఖ లేఖలో ప్రస్తావించారు.
భవిష్యత్తు ఏమిటి ?
భవిష్యత్ రాజకీయాలపై తన మద్దతుదారులతో తొందరలోనే కొండా దంపతులు సమావేశం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ అయిన సురేఖ ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ఆమె భవిష్యత్ వ్యూహాలు ఎలాగ ఉంటాయనే విషయంలో పార్టీ నేతలు, క్యాడర్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

