సురేఖ బర్తరఫ్ పై డాటర్ స్ట్రోక్
సీఎం రేవంత్ రెడ్డి మీద ఆగస్టు 18వ తేదీన నోటికొచ్చినట్లు మాట్లాడటమే కారణం.
దేవాదాయ, అటవీ శాఖలకు మంత్రిగా ఉన్న కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేశారు. మంత్రిగా రాజీనామా చేయటానికి సురేఖ అంగీకరించకపోవటంతోనే క్యాబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాల్సొచ్చింది. అసలు మంత్రివర్గం నుండి సురేఖను బర్త్ రఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఆగస్టు 18వ తేదీన నోటికొచ్చినట్లు మాట్లాడటమే కారణం.
పరకాల సిట్టింగ్ ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటితో గెలిపించాలని రేవంత్ ఇచ్చిన పిలుపుతోనే వివాదం మొదలైంది. రేవూరికి టికెట్ ప్రకటించటానికి రేవంత్ కు అర్హత ఏమిటి ? అధికారం ఏమిటి ? అని కూతురు సుస్మిత పటేల్ నిలదీసింది. సీఎం అయిన తర్వాత రేవంత్ కు కళ్ళు నెత్తికెక్కిందని చాలా చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది. కూతురు మాటలు తప్పని చెప్పాల్సిన కొండాసురేఖ పరోక్షంగా మద్దతుగా మాట్లాడారు.
రేవంత్ మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉంటూనే సీఎంపైన కూతురు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను ఖండించాల్సిన సురేఖ తనకు సంబంధంలేదని చెప్పటమే విచిత్రం. సురేఖ వ్యాఖ్యలతోనే పార్టీలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు మండిపోయి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేయటంతోనే వివాదం తారాస్ధాయికి రాజుకుంది. చివరకు ఢిల్లీలో పార్టీపెద్దలకు రాసిన మెయిల్ లో రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కూతురు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఉండకూడదు అని చెప్పాల్సిన సురేఖ పదేపదే కూతురు వ్యాఖ్యలకు, ఆరోపణలతో తనకు సంబంధంలేదనే వాదన వినిపించటమే కాకుండా రేవంత్ తదితరులపై ఎదురుదాడి చేయటమే ఆమె బర్త్ రఫ్ కు కారణమైంది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలామంది ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలతో సురేఖకు ఏమాత్రం పడటంలేదు. పార్టీలోనే కాదు సహచర మంత్రులు పొంగులేటి, గడ్డం వివేక్ తో కూడా పడదు.
పార్టీతో పాటు ప్రభుత్వంలో, మంత్రివర్గంలో కూడా చాలామందితో పడక, నిత్యం వివాదాస్పదం అయిన కొండా సురేఖ చివరకు కూతురు సుస్మితా పటేల్ నోటి దురుసు కారణంగానే మంత్రిపదవి నుండి బర్త్ రఫ్ అయ్యారు.

