బిల్లులు పాస్ చేయించుకునేందుకు మోదీ ప్లాన్ ఇదేనా ?
x

బిల్లులు పాస్ చేయించుకునేందుకు మోదీ ప్లాన్ ఇదేనా ?

మూడు బిల్లుల్లో ఏది ఆమోదం పొందాలన్నా 362 మంది ఎంపీల బలం అవసరం తప్పదు


ఇపుడు యావత్ దేశంలోని జనాల దృష్టంతా పార్లమెంటు మీదే ఉన్నాయి. ఎందుకంటే మూడురోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఈమూడురోజుల పార్లమెంట్ సమావేశాలు ఎందుకంటే మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు. ఆమూడుబిల్లులు ఏవంటే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశించిన డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులు. మూడు బిల్లులను ఎలాగైనా పాస్‌చేయించుకోవాలని మోదీ ప్రభుత్వ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇదేసమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్న ప్రతిపక్షాలు మిగిలిన రెండు డీలిమిటేషేన్, జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇపుడు విషయం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపొందేందుకు ఎలాంటి ఇబ్బందులు కనబడటంలేదు. సమస్యల్లా డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికే. ఇంత అర్జంటుగా డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటి అని ప్రతిపక్షాలు మోదీని నిలదీస్తున్నాయి. డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లుల రూపంలో మోదీ కుట్రచేస్తున్నారంటు ఇండియా కూటమితో పాటు నాన్ ఎన్డీయే ప్రభుత్వాలు, పార్టీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకిస్తున్నా మూడు బిల్లులను మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. బిల్లులు పాస్ అవ్వాలంటే ఓటింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ ఓటింగ్ ను చూస్తే బిల్లులను ఆమోదింపచేసుకునేంత బలం ఎన్డీయే ప్రభుత్వానికి లేదు. మద్దతు కూడగట్టకపోతే బిల్లులు వీగిపోతాయి. అపుడు మోదీ ప్రభుత్వానికి తీరని అవమానం.

అందుబాటులోని సమాచారం ప్రకారం లోక్ సభలో ఎన్డీయేకు 293 ఎంపీల బలముంది. రాజ్యాంగాన్ని సవరించాల్సిన బిల్లుల ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రభుత్వం ఇపుడు ప్రవేశపెట్టబోతున్న మూడు బిల్లుల ఆమోదానికి రాజ్యాంగ సవరణ అవసరమే. కాబట్టి మూడు బిల్లుల్లో ఏది ఆమోదం పొందాలన్నా 362 మంది ఎంపీల బలం అవసరం తప్పదు. మామూలుగా రెగ్యులర్ గా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు మెజారిటి ఎంపీల మద్దతుంటే సరిపోతుంది అన్నట్లు కాదు. సభకు హాజరైన వారిలో రెండింట మూడోవంతు ఎంపీల మద్దతు అవసరం.

పైనచెప్పిన అంకెల ప్రకారం చూసినా 69మంది ఎంపీల బలం ప్రభుత్వానికి మైనస్ లో ఉంది. అలాగే రెండింట మూడొంతుల ఎంపీల మద్దతు అవసరం అంటే 439 మంది సభకు హాజరవ్వాల్సిందే. ఇక మెజారిటి చూసుకుంటే తమకు ఇపుడున్న బలానికి మరో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. లేదా 100 మంది ఎంపీలను సభకు గైర్హాజరయ్యేట్లుగా చూడాలి. లేకపోతే సభకు హాజరైనా ఓటింగులో పాల్గొనకుండా చూసుకోవాలి. అందుకనే ప్రతిపక్షాల ఎంపీల్లో ఎంతమందిని తమవైపుకు తిప్పుకోవచ్చనే విషయమై మోదీ తీవ్రస్ధాయిలో కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కసారిగా ప్రతిపక్షాలకు చెందిన 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోవాలంటే ఒకటే మార్గం. అదేమిటంటే కేసులున్న, వివాదాల్లో ఇరుక్కున్న ఎంపీలను టార్గెట్ చేయటమే.

కేసుల్లో ఇరికించి తమఎంపీలను లోబరుచుకుంటోందనే ఆరోపణలను ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ఎప్పటినుండో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల్లో టార్గెట్‌చేసిన ఎంపీలపైకి సీబీఐ, ఈడీలను మోదీ ప్రభుత్వం ఉసిగొల్పుతోందనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నాయి. కాబట్టి ఇపుడు కూడా అదేపద్దతిలో ఎంపీలను లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు గోలచేస్తున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story