బీజేపీ గెలుపు రహస్యమిదేనా ?
x

బీజేపీ గెలుపు రహస్యమిదేనా ?

బీజేపీకి తెలంగాణలో గెలిచేంత సీనుందా అన్న విషయమే ఇపుడు చర్చనీయాంశమవుతోంది


పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఘనవిజయంతో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని రాష్ట్రంలోని ఎంపీలు, ఎంఎల్ఏలు, నేతలు ఒకటే ఊదరగొడుతున్నారు. సరే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపటం కోసం ఏపార్టీ అయినా చేసేది ఇదే కాబట్టి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. అయితే మొన్నటి ఆదివారం రాత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగసభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తోందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వచ్చేసేంత సీన్ తెలంగాణ బీజేపీకి ఉందా అంటే లేదనే చెబుతారు ఎవరైనా. అలాంటిది మోదీ దగ్గర పార్టీ బలానికి సంబందించి సరైన సమాచారం ఉండకుఃడానే ఉంటుందా ? అన్న డౌట్ పెరిగిపోతోంది. సరే, వీళ్ళ ప్రకటనలను పక్కనపెట్టేస్తే అసలు బీజేపీకి తెలంగాణలో గెలిచేంత సీనుందా అన్న విషయమే ఇపుడు చర్చనీయాంశమవుతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 నియోజకవర్గాల్లో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. కామారెడ్డి, హుజూరాబాద్, గోషామహల్, నిర్మల్, నిజామాబాద్ అర్బన్, ధర్మపురి, ముథోల్, ఎల్లారెడ్డిలో బీజేపీ గెలిచింది. తెలంగాణలో బీజేపీ గెలుపులో రెండు అంశాలను గమనించాల్సుంటుంది. అదేమిటంటే ముఖాముఖి పోటీ లేదా త్రిముఖ పోటీ. ఈ రెండు పాయింట్లలో బీజేపీ గెలుపులో అత్యధికంగా ముఖాముఖి పోటీలో గెలిచినట్లుగానే అర్ధమవుతుంది. గెలుపుకోసం ఏదైనా నియోజకవర్గంలో బీజేపీతో పాటు మరో రెండు పార్టీలు గట్టిగా పోరాటం చేసినపుడు కమలంపార్టీ గెలుపు కష్టమవుతోంది. మిగిలిన రెండుపార్టీలు గెలుపుకు గట్టిగా పోరాడిన కొన్ని నియోజకవర్గాల్లో మద్యలో బీజేపీకి ఓట్లుపడి గెలిచినవి కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి గెలుపులు తక్కువనే చెప్పాలి.

ఉదాహరణకు 2023లో బీజేపీ గెలిచిన సీట్లను తీసుకుందాము. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్ధి కేవీ రమణారెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్ధిగా కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్దిగా ఎనుముల రేవంత్ రెడ్డి పోటీచేశారు. గెలుపుకు కేసీఆర్, రేవంత్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్ధి కేవీ రమణారెడ్డి గెలిచారు. ఎందుకంటే ఓట్లు కేసీఆర్-రేవంత్ మధ్య చీలిపోవటంతో రమణారెడ్డి గెలిచారు. కేసీఆర్-రేవంత్ లో ఎవరో ఒకరే పోటీచేసుంటే బీజేపీ గెలిచేది కాదేమో. గెలిచిన రమణారెడ్డికి 66,652 ఓట్లువస్తే, ఓడిన కేసీఆర్ కు 59,911, రేవంత్ కు 54,916 ఓట్లు వచ్చాయి.

గోషామహల్ విజయం ప్రత్యేకం

గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ తరపున టీ రాజాసింగ్ గెలిచారు. ఈయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి నందకిషోర్ వ్యాస్ పైన గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మొగిలి సునీత పోటీచేసిందంటే చేసిందంతే. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే జరిగింది. గెలిచిన రాజాసింగ్ కు 80,812 ఓట్లు వస్తే, ఓడిన బీఆర్ఎస్ అభ్యర్ధి నందకిషోర్ కు 58,725 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీ ముఖాముఖి జరగటంతో పాటు ఓల్డ్ సిటీలోని హిందువుల ఓట్లలో అత్యధికం రాజాసింగ్ కు పడుతోంది. గడచిన రెండు ఎన్నికల్లో కూడా రాజాసింగే గెలిచారు. గోషామహల్ లో రాజాసింగ్ గెలుపు ప్రత్యేక పరిస్ధితుల్లో జరుగుతోంది.

నిర్మల్ నియోజకవర్గిన్ని తీసుకుంటే ఇక్కడ బీజేపీ తరపున పోటీచేసిన ఏలేటి మహేశ్వరరెడ్డి గెలిచారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి ఇంద్రకరణ్ రెడ్డిపైన గెలిచారు. ఇక్కడ పోటీ ముఖాముఖిగా జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధిని ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ముఖాముఖి జరిగిన పోటీలో కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీర్ ఆలీ మీద బీజేపీ అభ్యర్ధి సత్యానారాయణ గుప్తా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ నుండి సరైన పోటీలేదనే చెప్పాలి. అప్పటికే షబ్బీర్ పైన ఉన్న వ్యతిరేకత కారణంగా ఓటర్లు బీజేపీకి ఓట్లేసి గుప్తాను గెలిపించారు. ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి రామారావు పటేల్ గెలిచారు. ఈయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి జీ విఠల్ రెడ్డి పైన గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోవటంతో బీజేపీ గెలుపు సులభమైపోయింది.

ఇక నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా పైడి రాకేష్ రెడ్డి గెలిచారు. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మీద గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ తరపున ఆసన్నగారి జీవన్ రెడ్డి పోటీచేసినా ఉపయోగంలేకపోయింది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలుపుకు తీవ్రంగా పోటీపడిన ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రాకేష్ గెలిచారు. ఏ రకంగా చూసుకన్నా త్రిముఖ పోటీలో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలు తక్కువగా ఉంటే ఓడిపోయిన నియోజకవర్గాలే ఎక్కువగా కనబడుతున్నాయి.

త్రిముఖమైతే కష్టమేనా ?

ఇవే కాకుండా 2023కి ముందు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఇలాగే సాధ్యమైంది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు బీఆర్ఎస్ అభ్యర్ధి మీద గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పోటీచేసిందంటే చేసిందంతే. ముఖాముఖి జరిగిన పోరులో బీజేపీ గెలిచింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా బీజేపీ తరుపున పోటీచేసిన మాజీ బీఆర్ఎస్ ప్రముఖనేత ఈటల రాజేందర్ ను జనాలు గెలిపించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే జరిగింది. కాంగ్రెస్ పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపించలేదు. బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన ఈటల మీద అప్పటికే బాగా సానుభూతి ఉండటంతో జనాలు బీజేపీని గెలిపించారు. మునుగోడులో త్రిముఖ పోటీలో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ పోటీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. గట్టిపోటీలో జనాలు బీఆర్ఎస్ ను గెలిపించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య మాత్రమే జరిగింది. బీజేపీ పోటీలో ఉన్నా పెద్ద ప్రభావం చూపలేకపోవటంతో రెండింటిలోను కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అయితే బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దీన్నిబట్టి ఏమి అర్దమవుతున్నదంటే ఏ నియోజకవర్గంలో అయినా గట్టిగా త్రిముఖ పోటీ తీవ్రంగా ఉందంటే అక్కడ బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని. అలాగే ముఖాముఖి పోటీ జరిగిన నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ ఎక్కువగా గెలిచిందని. మరి రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ త్రిముఖమేనా లేకపోతే చతుర్ముఖమా అన్నది చూడాల్సిందే.

Read More
Next Story