దసరా కూడా దాటింది! ఇంకెప్పుడు విస్తరణ? ఆశావహుల్లో నిరాశ
x

దసరా కూడా దాటింది! ఇంకెప్పుడు విస్తరణ? ఆశావహుల్లో నిరాశ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నీలినీడలు..


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రావడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత, సంక్రాంతి, ఉగాది, దసరా నాటికి విస్తరణ ఉంటుందంటూ ప్రచారం జరిగినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో నిరాశ పెరుగుతున్నది.

తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి గరిష్ఠంగా 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 14 మంది మంత్రులు ఉండటంతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను ఎవరితో భర్తీ చేస్తారు? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌కు దక్కని ప్రాతినిధ్యంమంత్రివర్గ కూర్పులో ప్రాంతీయ సమతుల్యతపైనా చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వంటి సీనియర్‌ నాయకుల పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి.

మరోవైపు, బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీకి చేసిన సేవలు మంత్రి పదవుల ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది.

మంత్రి పదవుల కోసం సీనియర్ల ఎదురుచూపులు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచందర్‌ నాయక్‌, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తదితరుల పేర్లు ఆశావహుల జాబితాలో వినిపిస్తున్నాయి.

మంత్రి పదవుల భర్తీపై జాప్యం పార్టీ అంతర్గత రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పదవీకాలంలో మరో రెండేళ్లే మిగిలి ఉన్నాయనే భావనతో ఆశావహుల్లో ఆందోళన పెరుగుతున్నది.దసరా నాటికి విస్తరణ ఉంటుందన్న ప్రచారం నిజం కాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అధిష్ఠానం నిర్ణయంపైనే ఉంది. ఖాళీగా ఉన్న మూడు స్థానాలను ఎప్పుడు భర్తీ చేస్తారు? ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? గాంధీ భ‌వ‌న్‌లో ఇవే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read More
Next Story