
క్యాబినెట్‌నే టెన్షన్ పెట్టిన ఆర్టీసీ సమ్మె
గతంలో ఇంతమంది మంత్రులు క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అంశాన్ని మీడియాకు చెప్పటానికి ప్రత్యేకంగా సమావేశం పెట్టిందిలేదు
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మెతో ప్రభుత్వం బెంబేలు పడుతోందని అర్ధమైంది. ఎందుకంటే గురువారం క్యాబినెట్ సమావేశంలో సమ్మె విషయంపైనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశం మీద చర్చముగియగానే మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెకంటరెడ్డి ప్రత్యేకంగా మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. గతంలో ఇంతమంది మంత్రులు క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అంశాన్ని మీడియాకు చెప్పటానికి ప్రత్యేకంగా సమావేశం పెట్టిందిలేదు. ఈ ఘటనతోనే సమ్మె విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్ధమవుతోంది.
సమ్మెకు ప్రభుత్వం భయపడటానికి ప్రధాన కారణం ఏమిటంటే వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. పెట్రోలు పోసుకుని గౌడ్ నిప్పంటించుకోవటం సంచలనంగా మారింది. అలాగే నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ డిపోలో వెంకన్న, నర్సంపేట కూడా శంకర్ కూడా డీజల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ మూడు ఘటనల సమాచారం తెలియగానే రేవంత్ తో పాటు మంత్రుల్లో కలవరం మొదలైంది. ఈ ఘటనలు చివరకు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన మంత్రుల్లో స్పష్టంగా కనబడింది. అందుకనే క్యాబినెట్ అజెండాను పక్కనపెట్టి ముందు ఆర్టీసీ సమ్మె గురించే ప్రత్యేకంగా చర్చించటమే కాకుండా మీడియాకు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు.
ఆర్టీసీ యూనియన్ల డిమాండ్ల పరిష్కారంపై శుక్రవారం సచివాలయంలో డిప్యుటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రకటించారు. యూనియన్ నేతలు సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది కాబట్టి కార్మికులు ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని మంత్రులు విజ్ఞప్తిచేశారు. మరి రేపటి సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాలి.

