మరో సంచలనం ‘E 20 జనతాపార్టీ’ ఏర్పాటు
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ఉపయోగించుకోవాలా వద్దా అనే ఆప్షన్ వాహనాల యజమానులకు ఉండాలి అన్నదే E 20 జనతాపార్టీ ప్రధాన డిమాండ్
కాక్రోచ్ జనతాపార్టీ సంచలనాన్ని మరచిపోకముందే సోషల్ మీడియా వేదికగా ‘E 20 జనతాపార్టీ’ ఏర్పాటైంది. కొత్తగా పుట్టిన పార్టీ పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ఉపయోగించుకోవాలా వద్దా అనే ఆప్షన్ వాహనాల యజమానులకు ఉండాలి అన్నదే E 20 జనతాపార్టీ ప్రధాన డిమాండ్. పెట్రోల్ లో ఇథనాల్ కలపటంవల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని యజమానులు నానా గోలచేస్తున్నారు. అయితే కేంద్రప్రభుత్వం వాహనాల యజమానుల గోలను ఏమాత్రం పట్టించుకోవటంలేదు.
పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపితే వాహనాలు పాడవుతాయని శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని కేంద్రప్రభుత్వం, వాహనాల తయారీ పరిశ్రమలు పదేపదే చెబుతున్నాయి. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం మోతాదు పెరిగితే వాహనాల ఇంజన్లు చెడిపోతాయని వాహన రంగంలోని నిపుణులు, మెకానిక్కులు చాలామంది హెచ్చరిస్తున్నారు. పరస్పర విరుద్ధమైన వాదనలమధ్య కేంద్రప్రభుత్వం మాత్రం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కలపటాన్ని సమర్ధించుకుంటోంది. దీనివల్ల ఏమవుతోంది అంటే వాహనాల యజమానులకు ఆప్షన్ లేకుండా పోతోంది.
సరిగ్గా ఈ పాయింట్ మీదే E 20 జనతాపార్టీ సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ 20 పెట్రోల్ వాడకంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొడుకుకు ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఉందని, అక్కడ తయారయ్యే ఇథనాల్ ను మార్కెటింగ్ చేయటం కోసమే కేంద్రప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతోందనే ఆరోపణలు, ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ఈ 20 పెట్రోల్ వాడకంపై జనాల్లో వ్యతిరేకత కూడా పెరుగుతోంది.
తమ వాహనంలో అచ్చంగా పెట్రోల్ మాత్రమే ఉపయోగించుకోవాలా ? ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను కూడా పోయించుకోవాలా అనే ఆప్షన్ జనాలకు ఉండాలనేది ఈ 20 జనతాపార్టీ ప్రధాన డిమాండ్. ఈ 20 జనతాపార్టీని ఎవరు ఏర్పాటుచేశారు అనే వివరాలు సరిగా లేవుకాని దీన్ని మలేషియా నుండి ఆపరేట్ చేస్తున్నారని సమాచారం. మరి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 20 జనతాపార్టీ ఏమి చేయబోతోందనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే ఇన్ స్టా ఖాతాలో సుమారు 35 వేలమంది సభ్యులుగా చేరారు. చివరకు కొత్త పార్టీ ఎలాంటి సంచలనం చేస్తుందో చూడాల్సిందే.

