చెన్నై పీఠం ఎవరి చేతికి చిక్కేనో?
x

చెన్నై పీఠం ఎవరి చేతికి చిక్కేనో?

నేటీతో ముగిసిన ప్రచారం, హోరాహోరీగా తలపడ్డ డీఎంకే, అన్నాడీఎంకే కూటమి, విజయ్ చీల్చే ఓట్లపైనే అందరి దృష్టి


Click the Play button to hear this message in audio format

దేశంలో మిడ్ టర్మ్ ఎన్నికలుగా అందరూ భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా, పశ్చిమ బెంగాల్ మొదటి దశకు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు గత 30 రోజులుగా అన్ని రాజకీయా పార్టీలు తమ సర్వశక్తులన్నీ కేంద్రీకరించి ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి.

తమిళనాడులో అధికార డీఎంకే, విపక్ష ఎన్డీఏ కూటమి, కొత్తగా పార్టీ స్థాపించిన టీవీకే మధ్య త్రిముఖ పోటీ ఉంది. ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారానికి చివరి రోజైన మంగళవారం అన్ని పార్టీల అధినేతలు రోడ్ షోలు నిర్వహించారు.
దాదాపు నెలరోజుల పాటు నిర్వహించిన ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, అభివృద్ధి, కేంద్ర నిధులు, కుంభకోణాలు, కుటుంబపాలన, సర్ వంటి అంశాల చుట్టూ ప్రచారం జరిగింది. చివర్లలో ఎక్కువగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు వీగిపోవడం వైపు నడిచింది.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, అందులో అధికార డీఎంకే సొంతంగా 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షాలు అన్ని కలిపి 70 కి పైగా స్థానాలలో పోటీ పడుతున్నాయి. మరో వైపు విపక్ష అన్నాడీఎంకే 169 స్థానాలలో బరిలోకి దిగగా, మిత్రపక్షాలకు 65 సీట్లు కేటాయించింది.
అయితే అందరి చూపు టీవీకే అధినేత విజయ్ పైనే ఉంది. ఆయన నిర్వహిస్తున్న సభలకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికీ వాటిని ఓట్లుగా, సీట్లుగా మల్చుకునే శక్తి ఉందా అని ఎన్నికల ఫలితాల తరువాతే తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మొత్తం 234 సీట్లలో ఒంటరిగా బరిలోకి దిగారు. మరోవైపు దర్శకుడు సీమాన్ కు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ కూడా మొత్తం స్థానాలలో ఒంటరిగా పోటీలో నిలిచింది.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. విజయ్ కు కొంగునాడు ప్రాంతం నుంచి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

డీఎంకే కూటమిదే..

తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ఆమె ఈసారి పోటీ ఢిల్లీ- తమిళనాడు మధ్య జరుగుతున్నాయని అభివర్ణించారు. తాము కచ్చితంగా 200 సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాము ఇచ్చే రూ. 8000 కూపన్లు ఓట్లను తెచ్చిపెడతాయని, అలాగే ఇంతకుముందు తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఇచ్చిన ఎన్నికల వాగ్థానాలు తమ గెలుపుకు ఉపయోగపడతాయని అంచనా వేశారు.

ఎన్డీఏదే గెలుపు..

క్షేత్రస్థాయిలో ఎన్డీఏకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తమదే గెలుపు అని బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ప్రచార సరళిలో మార్పులు కనిపిస్తున్నాయని, తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఆయన ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. డీఎంకే హాయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. కొంగునాడులో తమ పట్టు కొనసాగుతుందని చెప్పారు. విజయ్ ప్రభావం కనిపిస్తుందని కానీ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కోయంబత్తూర్ లో మంత్రి సెంథిల్ బాలాజీకి ఓటమి తప్పదని చెప్పారు.
అయితే తమిళనాడులో జాతీయ పార్టీల ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ లు అక్కడ ప్రధాన పార్టీల వలే కాకుండా అక్కడ స్థానిక పార్టీలతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి.

వరుస వివాదాల్లో ఖర్గే...

కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారాలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ ప్రజలు నిరక్ష్యరాస్యులుగా అభివర్ణించడం తీవ్రకలకలం రేపింది. ఈ రోజు చెన్నైలో మాట్లాడుతూ.. మోదీని ఉగ్రవాది అని అనడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. వీటిపై ఆయన రెండుసార్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

చంద్రబాబు నాయుడు ప్రచారం..




తమిళానాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు చెన్నైలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆయన తెలుగు ఓటర్లే లక్ష్యంగా తన ప్రచారం ఉధృతంగా సాగించారు.

బెంగాల్ లో పరిస్థితి ఎలా ఉంది..

పశ్చిమ బెంగాల్ లో మొదటి దశ పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఇక్కడ మే 23 తో పాటు 29 న రెండు దశలలో పోలింగ్ జరగనుంది. మొదటి దశ ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొదటి దశలో 152 స్థానాలలో ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ సీట్లలో పార్టీ దాదాపు 291 స్థానాలలో బరిలోకి దిగింది. మరో మూడు స్థానాలు బీజీపీఎం పార్టీకి కేటాయించింది. మరో వైపు ప్రతిపక్ష బీజేపీ కూడా సొంతంగానే 294 సీట్లలో పోటీకి దిగింది. ఈ సారి ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉంది.
ఈ ఎన్నికలు ఎక్కువగా ‘సర్’ వివాదంతో పాటు, బంగ్లాదేశీ చొరబాట్లు, ఐ ప్యాక్ కార్యాలయంపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, మమతా బెనర్జీ ధర్నాలు, ఆర్జీ కర్ ఆస్పత్రి వివాదం, టీచర్ల కుంభకోణాలు, ఓటర్ల తొలగింపులో సుప్రీంకోర్టులో కేసులు, యూసీసీ, సీఏఏ అమలు వంటి ప్రధాన అంశాల చుట్టూ తిరిగాయి. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. 34 సంవత్సరాల పాటు బెంగాల్ ను అప్రహతీతంగా ఏలిన కమ్యూనిస్టులు అసలు సోదీలో లేకుండా పోయారు. ఎక్కడా అగ్ర నాయకులు ప్రచారానికి రాలేదు.
తొలి దశ పోలింగ్ ముగియడానికి ముందు బెంగాల్ లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తాము అధికారంలోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని హమీ ఇచ్చారు. మమతా బెనర్జీ బెంగాల్ ను పారిశ్రామికంగా నాశనం చేసిందని మండిపడ్డారు.


బెంగాల్ యువత పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి కారణం టీఎంసీ పాలనే అని దుయ్యబట్టారు. ‘‘ బెంగాల్ లోని కుల్టీ ఒకప్పుడు ఇనుప ఖనిజ ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు దాన్ని అధ్వాన్నస్థితికి తీసుకొచ్చింది. దానికి కారణం మమతా బెనర్జీనే’’ అని ఆయన నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే కుల్టీకి పూర్వ వైభవం తెస్తామని హమీ ఇచ్చారు. అలాగే ఉద్యోగాల కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని హమీ ఇచ్చారు.
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4 న వెలువడనున్నాయి.
Read More
Next Story