x

బీఆర్ఎస్ ఓటమిలో ఉద్యోగులదే కీలకపాత్ర

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వీరిని బాగా ఉపయోగించుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా దూరంపెట్టేశారు


ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జూలైలో తీసుకున్న నిర్ణయాలతో చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే మొదటిది ఉద్యోగులతో పాటు వాళ్ళ కుటుంబాలకు ఉచిత వైద్య పథకం అమల్లోకి తీసుకురావటం. రెండో నిర్ణయం ఏమిటంటే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయటం. అలాగే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పీఎఫ్, జీపీఎఫ్, ఈఎస్ఐ జమచేయటం కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 50 లక్షలమందికి లబ్ది జరుగుతుంది. మొదటి నిర్ణయంలో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబసభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు ఖర్చులగురించి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు సుమారుగా 4 లక్షలమంది ఉన్నారు. ప్రతి కుటుంబంలోను కనీసం ముగ్గురు ఉంటారని అనుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య 12 లక్షలవుతుంది. అలాగే పెన్షనర్లు మరో 3.5 లక్షలమంది ఉంటారు. వీరి కుటుంబాల్లో కూడా ముగ్గురిని వేసుకుంటే సుమారు 11 లక్షలమంది అవుతారు.

అంటే ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబసభ్యులను కూడా వేసుకుంటే మొత్తం 23 లక్షలవుతారు. అలాగే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సుమారుగా 4.5 లక్షలమంది ఉన్నారు. సంవత్సరాలుగా పెండింగులో ఉన్న పై రెండు డిమాండ్లను రేవంత్ ప్రభుత్వం దాదాపు తీర్చింది. దాంతో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా చాలావరకు హ్యాపీ. ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిపితే సుమారుగా 13 లక్షలమంది ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కుటుంబాలతో కలిసి చూస్తే దాదాపు 50 లక్షలమంది అవుతారు. వీరంతా బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారనే చెప్పాలి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వీరిని బాగా ఉపయోగించుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా దూరంపెట్టేశారు. పై విషయాలను గమనించిన రేవంత్ ముందుజాగ్రత్తగా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఉద్యోగులను బాగా చూసుకున్న ప్రభుత్వానికే ఉద్యోగులు మద్దతుగా ఉంటారని ఉద్యోగసంఘాల నేతలు స్పష్టంగా చెప్పారు. రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే రేవంత్ వ్యూహాత్మకంగా ఉద్యోగులను కొత్త ఓటుబ్యాంకు తయారుచేసుకుంటున్నడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి

Read More
Next Story