అడవి బిడ్డల అండతో రాజ్యాధికారం దిశగా టీఆర్‌పీ: తీన్మార్ మల్లన్న
x

అడవి బిడ్డల అండతో రాజ్యాధికారం దిశగా టీఆర్‌పీ: తీన్మార్ మల్లన్న

పార్టీ భవిష్యత్ కార్యాచరణ, మహిళా రిజర్వేషన్, పాదయాత్రపై నిర్ణయాలు.


తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఈ చేరికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికే పరిణామం చోటుచేసుకుంది. మాజీ మావోయిస్టుల భారీ చేరికలతో టీఆర్‌పీ పార్టీ ఇప్పుడు చర్చలోకి వచ్చింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశం ఈ పరిణామానికి వేదికైంది. అంతకుముందు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య మార్గంలో పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మావోయిస్టు నాయకురాలు పటేల్ వనజక్క ఆధ్వర్యంలో వందలాది మంది అడవి ప్రాంతాల ప్రజలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

అనంతరం తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని టీఆర్‌పీలో చేరారు. ఈ సందర్భంగా పటేల్ వనజను రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించారు. సమావేశంలో తీన్మార్ మల్లన్న ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజకీయ పార్టీలు గతంలో ఉద్యమకారులను ఉపయోగించుకుని వదిలేశాయని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రజల పార్టీగా ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అడవుల్లో సాధించాలనుకున్న లక్ష్యాలను ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో సాధిద్దామని పిలుపునిచ్చారు.

పార్టీ భవిష్యత్ ప్రణాళికలను కూడా ఆయన వివరించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని, 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మాజీ మావోయిస్టుల సలహాలతోనే మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. భువనగిరిలో భారీ సభ నిర్వహించాలని కూడా ప్రకటించారు. మాజీ మావోయిస్టు నాయకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అడవుల్లో సంవత్సరాల పాటు పీడిత వర్గాల కోసం పోరాటం చేసినా లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని వారు భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రజాస్వామ్య మార్గంలో తమ లక్ష్యాలను సాధించేందుకు ఇది ఒక అవకాశమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం గతంలో అనేక మహానుభావులు పోరాడారని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ వర్గాలకు పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. అమరుల ఆశయాలను నెరవేర్చడానికి ఈ పార్టీ ద్వారా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read More
Next Story