క్రికెట్ నుంచి కేబినెట్ దాకా: అజహరుద్దీన్ ఆధిపత్యం పీక్‌లో
x
సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ : ఎమ్మెల్సీ ఖరారుతో మంత్రిగా లైన్ క్లియర్

క్రికెట్ నుంచి కేబినెట్ దాకా: అజహరుద్దీన్ ఆధిపత్యం పీక్‌లో

కాంగ్రెస్ మైనారిటీ విభాగంలో శక్తి సమీకరణాల మార్పు…ఎమ్మెల్సీ ముద్రతో అజహర్ బలోపేతం...


భారత క్రికెట్ మైదానాల్లో రికార్డులు సృష్టించిన మహ్మద్ అజహరుద్దీన్… ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్సీగా అధికారిక గుర్తింపు దక్కడంతో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన స్థానం మరింత బలపడింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటూ, అజహర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.


భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పరుగుల వరద పారించిన మహమ్మద్ అజహరుద్దీన్‌ తాజాగా రాజకీయాల్లోనూ రాణించడంతోపాటు ఎమ్మెల్సీ కావడంతో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రెజెస్ శాఖ మంత్రిగా నిలదొక్కుకున్నారు. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అజహరుద్దీన్ ఏకంగా ఎమ్మెల్సీ అయి మంత్రి కావడంతో ఆయన హవా అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. గతంలో మాజీమంత్రి షబ్బీర్ అలీ కేంద్రంగా మైనారిటీ రాజకీయాలు కొనసాగేవి. అజహరుద్దీన్ మంత్రిగా మైనారిటీ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తుండటంతో సలహాదారుతోపాటు ఇతర మైనారిటీ నేతల ఆధిపత్యానికి తెర పడినట్లయింది.

మొరాదాబాద్ ఎంపీ నుంచి ఎమ్మెల్సీ దాకా...

భారత క్రికెట్ జట్టులో 99 టెస్టు మ్యాచ్ లు, 334 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల అజహరుద్దీన్ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్ మెన్ లలో ఒకరిగా నిలిచారు. క్రికెట్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా 2009 లోక్ సభ ఎన్నికల్లో మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.2014 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కిగ్ ప్రెసిడెంట్ అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2022లో గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఉభయసభల్లోనూ సభ్యుడు కానప్పటికీ అజహరుద్దీన్ గత ఏడాది అక్టోబరు 31వతేదన మైనారిటీ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలల గడువు ముగియనుండగా, తాజాగా ఏప్రిల్ 26వతేదీన గవర్నర్ అజహరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవికి ఆమోదముద్ర వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శిపప్రతాప్ శుక్లాను కలిసి అజహరుద్దీన్ కు ఎమ్మెల్సీగా ఆమోదం తెలపాలని కోరడంతో గవర్నర్ ఎట్టకేలకు సంతకం చేశారు. దీంతో మంత్రిగా అజహరుద్దీన్ కు లైన్ క్లియర్ అయింది.



అధికారిక సమీక్షల్లో మంత్రి హవా

అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో మంత్రిగా ఆయనకు ఢోకా లేకుండా పోయింది. అజహరుద్దీన్ మంత్రి అయ్యాక షబ్బీర్ అలీ ఆధిపత్యానికి తెర పడింది. గతంలో అన్ని మైనారిటీ మ్యాటర్ సమీక్షల్లో షబ్బీర్ అలీ కీలక పాత్ర పోషించేది. కానీ మంత్రి అయ్యాక అజహరుద్దీన్ మాత్రం తానే షబ్బీర్ అలీ లేకుండా సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి తాజాగా ఆమోదముద్ర పడటంతో అజహరుద్దీన్ మైనారిటీ మంత్రిగా తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. తాజాగా జరిగిన హజ్ కమిటీ అధికారుల సమీక్షలో మంత్రి ఒక్కరే పాల్గొన్నారు.కీలకమైన హజ్ యాత్ర ప్రారంభం సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశానికి ప్రభుత్వ సలహాదారు అయిన షబ్బీర్ అలీకి ఆహ్వానం లేదు. ఒక వైపు హైదరాబాద్ హజ్ హౌస్ లో హజ్ సమీక్ష జరుగుతుండగా సలహాదారైన షబ్బీర్ అలీ మాత్రం ముఖం చాటేసి కామారెడ్డి పర్యటనకు వెళ్లారని ఓ మైనారిటీ నాయకుడు వ్యాఖ్యానించారు.
హజ్, తెలంగాణ మైనారిటీ ఆర్థిక సహాయ సంస్థ, మైనారిటీ డైరెక్టరేట్, ఉర్దూ అకాడమీ ఇలా అన్నీ విభాగాలను మంత్రి అజహరుద్దీన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

మైనారిటీ గురుకులాల ఛైర్మన్ గా ఫహియుద్దీన్

సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ముహమ్మద్ ఫహియుద్దీన్ మైనారిటీ గురుకుల పాఠశాలల ఛైర్మన్ గా చక్రం తిప్పుతున్నారు. ఫహియుద్దీన్ మైనారిటీ గురుకులాల వ్యవహారాలను పర్యవేక్షిస్తూ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ మైనారిటీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే మంత్రిగా అజారుద్దీన్ ఆధిపత్యం ప్రస్థుతం కొనసాగుతుండటంతో పలువురు మైనారిటీ నేతలు ఆయన అుగుజాడల్లోనే నడుస్తున్నారు. గతంలో ఇతర నేతల అనుచరులుగా ఉన్న కాంగ్రెస్ మైనారిటీ నేతలు కూడా అజహరుద్దీన్ వైపు వచ్చారు. కాంగ్రెస్ మైనారిటీ పార్టీ విభాగంలో అజహరుద్దీన్ మంత్రి కావడంతో మైనారిటీ రాజకీయాలు వేడెక్కాయి.



షబ్బీర్ అలీ అధిపత్యానికి తెర

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ మంత్రి కావడంతో మాజీమంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధిపత్యానికి తెర పడినట్లయింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలోకి దిగడంతో ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. అప్పట్లో కామారెడ్డిని వదిలి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీ అభ్యర్థులెవరూ ఎన్నికల్లో విజయం సాధించక పోవడంతో ఆ వర్గానికి అమాత్య పదవి దక్కలేదు. దీంతో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీని సీఎం నియమించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగంతో పాటు ప్రభుత్వంలోనూ గతంలో షబ్బీర్ అలీ ప్రాభవం కొనసాగేది. సీఎంకు ఆప్తుడిగా షబ్బీర్ అలీ మైనారిటీ విభాగం సలహాదారుడిగా ఉన్నారు.గతంలో రమజాన్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు. మైనారిటీ విభాగంలో ఏ సమీక్షా సమావేశం అయినా షబ్బీర్ అలీ ప్రత్యక్షమయ్యేవారు. మైనారిటీ వ్యవహారాలన్నీ షబ్బీర్ అలీ చేతుల మీదుగానే సాగేవి. అయితే అనూహ్యంగా మంత్రి పదవి అజహరుద్దీన్ కు దక్కడంతో సలహాదారు షబ్బీర్ అలీ ఆధిపత్యానికి తెరపినట్లయింది.

అసంతృప్తిలో షబ్బీర్ అలీ

45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన షబ్బీర్ అలీ గతంలో మంత్రిగా, కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. సీనియర్ నాయకుడైనా తనకు మంత్రి పదవి ఇవ్వక పోవడంపై షబ్బీర్ అలీ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. షబ్బీర్ అలీ అనుచరులు దీనిపై సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెట్టారు.

ఎమ్మెల్సీగా అజహరుద్దీన్

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా మోహమ్మద్ అజహరుద్దీన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్న డి రాజేశ్వరరావు,ఫారూఖ్ హుసేన్ ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం కోదండ రాంరెడ్డిలను కొత్త ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 156, 157 ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకంపై జీఓఎంఎస్ నంబరు 71 ప్రకారం ఆదివారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శనరెడ్డి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

మొత్తానికి, ఎమ్మెల్సీ హోదా అజహరుద్దీన్‌కు రాజకీయంగా మరింత బలం చేకూర్చింది. ఒకప్పుడు షబ్బీర్ అలీ ఆధిపత్యంలో నడిచిన మైనారిటీ రాజకీయాలు ఇప్పుడు అజహర్ చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంతర్గత శక్తి సమీకరణాలు ఎలా మారతాయో… కాంగ్రెస్ మైనారిటీ విభాగంలో ఎవరి పట్టు నిలుస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.


Read More
Next Story