
సింగరేణికి మంచి రోజులు వచ్చినట్టేనా?
పార్టీల రాజకీయాల మధ్య నలిగిపోతున్న సింగరేణికి మంచి రోజులు వస్తున్నాయా?అన్న ప్రశ్నకి సమాధానం అవుననే అనిపిస్తుంది. తాజాగా సింగరేణికి పీకేఓసీ-2 బ్లాక్ వేలంపాటలో దక్కింది. పీకేఓసీ-2 అంటే ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్-2. ఈ బ్లాక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలో ఉంది. ఈ బ్లాక్ లో దొరికే జి-8 క్వాలిటీ బొగ్గు వల్ల 43,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.అంతే కాకుండా 2,000 మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఈ మధ్యే సింగరేణికి నైని కోల్ బ్లాక్,తాడిచర్ల -2 బ్లాక్ దక్కిన విషయం తెలిసిందే. నైని బ్లాక్ ఒడిశా రాష్ట్రంలోని అనుగుల్ జిల్లాలో ఉంది. సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు దాదాపు రూ. 75,000 కోట్ల రాబడి వస్తుంది.స్థానికంగా సుమారు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మరొకటైన తాడిచర్ల-2 కోల్ బ్లాక్ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉంది. 182 మిలియన్ టన్నుల గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్న ఈ మైన్ ద్వారా సింగరేణికి రూ. 64,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. . అలాగే దాదాపు 1,200 నుండి 2,000 మంది వరకు ఉద్యోగాలు వస్తాయి.ఈ తరహాలోనే సింగరేణి పరిధిలో ఉన్న మిగిలిన బ్లాక్స్ కూడా సింగరేణికె దక్కాలని సింగరేణి కార్మికులు,యాజమాన్యం కోరుకుంటున్నాయి.
దీని గురించి తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం,అధ్యక్షుడు రాజిరెడ్డి ఫెడరల్ తో మాట్లాడుతూ:
సింగరేణికి పికెఓసి-2 బ్లాక్ రావడం హర్షనియమే కానీ అది ఆక్షన్ ద్వారా తీసుకోవడంతో మాత్రం తాము సంతృప్తిగా లేమని అన్నారు. ఇప్పుడు సింగరేణికి పికెఓసి-2 బ్లాక్ రావడానికి గత అనుభవ పాఠాల నుండి ప్రభుత్వం నేర్చుకోవడమే కారణం అని కూడా అన్నారు. గతంలో కోయగూడెం-3, సత్తుపల్లి-3 వంటి బ్లాక్స్ ఆక్షన్ లో ప్రైవేట్ కంపెనీల పరమైనా,ఆ రెండు బ్లాక్స్ కి సరిహద్దుల్లో సింగరేణి ఉండటంతో, మట్టి తవ్వడం,బొగ్గు తీయడం వంటి వాటికి పెరిగిపోయే ఖర్చులు,శ్రమని దృష్టిలో ఉంచుకుని ఆ బ్లాక్స్ వచ్చినా అక్కడ పని సాగడం లేదని గుర్తు చేసారు.అందుకనే ఇప్పుడు పికెఓసి-2 బ్లాక్ వేలంలో ప్రైవేట్ కంపెనీలు బిడ్ వేయలేదని అన్నారు.,’ఎండిఆర్ యాక్ట్ -2015’ ప్రకారం వేలం ద్వారానే కేటాయింపులు జరగాలి గనుక ఈ వేలంపాట నామమాత్రంగా జరిపించారని కూడా చెప్పారు.గతంలో కోయగూడెం,సత్తుపల్లి వల్ల సింగరేణి వ్యతిరేకత వచ్చిన క్రమంలో మళ్ళి ఆ వ్యతిరేకత రాకూడదనే ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.

