ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరోసారి పార్టీ మార్పుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మారిన బాపురావు తాజా నిర్ణయం ఆదిలాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక
ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత సమక్షంలో రాథోడ్ బాపురావు ఆ పార్టీలో చేరారు. కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కొత్త పార్టీలో బాపురావు చేరారు. కవిత బాపురావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు న్యాయం చేసేందుకు తెలంగాణ జాగృతిలో చేరానని బాపురావు చెప్పారు. తన అనుచరులతో కలిసి వచ్చిన బాపురావు కవితను కలిశారు. తెలంగాణ సీఎంగా కవితను తాను చూడాలనుకుంటున్నానని బాపురావు చెప్పారు. జై తెలంగాణ, జై జాగృతి నినాదాలతో సమావేశం మార్మోగింది.
తెలంగాణ పార్టీలో చేరిన బాపురావుకు కవిత స్వాగతం పలికారు. బాపురావుతో తనకు ఇరవై ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని కవిత చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాథోడ్ బాపురావు ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన బాపురావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నార్నూర్ గ్రామానికి చెందిన బాపురావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు.
హిందీ మాస్టారు బాపురావు
రాథోడ్ బాపురావు 1987 నుంచి 2009వ సంవత్సరం వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హిందీ మాస్టారుగా పనిచేశారు. ఉపాధ్యాయుడి ఉద్యోగానికి రాజీనామా చేసిన బాపురావు 2009లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయఢంకా
రాజకీయ రంగ ప్రవేశం చేసిన హిందీ మాస్టారు రాథోడ్ బాపురావు బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసిన బాపురావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్ పై పోటీ చేసి 26వేల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 2018వ సంవత్సరంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాపురావుపై 6 వేల ఓట్ల ఆధిక్యంతో రెండో సారి విజయం సాధించారు.
కమలం గూటిలో చేరి...
2023 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావును కాదని అనిల్ జాదవ్ ను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో అసంతృప్తి చెందిన బాపురావు కమలం గూటిలో చేరారు. బీజీపీ కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో 2023 నవంబరు 1వతేదీన బీజేపీలో చేరారు.
2024లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
బీజేపీలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ ఇవ్వక పోవడంతో రాథోడ్ బాపురావు బీజేపీని వీడారు.మళ్లీ అసంతృప్తితో కమలం గూడికి గుడ్ బై చెప్పిన బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని మళ్లీ అసంతృప్తితో ఆ పార్టీని వీడారు. ఇలా రాజకీయాల్లో నిత్యం అసంతృప్తి వాదిగా పేరొందిన బాపురావు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు వచ్చారు. మళ్లీ తాజాగా ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరనున్నట్లు బాపురావు ఆదివారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాపురావు రాథోడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ కు శనివారం రాత్రి రాజీనామా లేఖ పంపించినట్లు మాజీ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖను బాపురావు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నపుడు తనకు మద్ధతు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఝతలు తెలిపారు. రాజీనామా లేఖ కాపీని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ కు కూడా పంపించారు.
బోథ్ నుంచి తెలంగాణ జాగృతి జైత్రయాత్ర సాగిస్తాం : రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశానని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను ఆదివారం కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరి బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి జైత్రయాత్ర ప్రారంభిస్తానని బాపురావు పేర్కొన్నారు. తాను అధికార కాంగ్రెస్ పార్టీలో రెండేళ్లుగా ఉన్నా, ఆ పార్టీ గిరిజనుల అభ్యున్నతికి ఎలాంటి పథకాలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురు లంబాడాలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించినా మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
తెలంగాణ జాగృతి బలోపేతం అవుతుంది : కల్వకుంట్ల కవిత
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ఏకీకరణ జరుగుతుందని, పలువురు ఉద్యమకారులు తెలంగాణ జాగృతిలో చేరుతున్నారని కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తాము జాగృతిని ముందుకు తీసుకువెళతామని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ బలోపేతం అవుతుందని కవిత ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు : నరేష్ జాదవ్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు
మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినందువల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాథోడ్ బాపురావు రాజీనామా విషయాన్ని తాను టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ కు తెలియ పర్చానని చెప్పారు.బాపురావు రాజీనామా వల్ల బోథ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవరూ ఆయనతో వెళ్లలేదన్నారు. బాపురావు పదేళ్లుగా బోథ్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. బాపురావు తమ కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కరే వచ్చారని, వెళ్లేటపుడు కూడా ఒక్కరే వెళ్లారని చెప్పారు. బాపురావు నిత్య అసంతృప్తివాది అని, ఆయన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారని, చివరిగా జాగృతిలో చేరారని నరేష్ వ్యాఖ్యానించారు.
తనను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోక పోవడంతోనే తాను ఆ పార్టీని వీడానని చెప్పారు. కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే కొత్తపార్టీలో పనిచేస్తానని బాపురావు ప్రకటించారు.
1000 మంది కార్యకర్తలను జాగృతిలో చేర్పిస్తాం
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇచ్చోడ కేంద్రంగా త్వరలో తెలంగాణ జాగృతి జైత్రయాత్ర ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ కొత్త పార్టీ నాయకురావు కల్వకుంట్ల కవితను ఇచ్చోడకు పిలిచి ఆమె సమక్షంలో వెయ్యిమంది కార్యకర్తలను జాగృతిలో చేర్పిస్తామని ఆయన చెప్పారు. ఆదివారం 25 మంది కార్యకర్తలతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాథోడ్ బాపురావు కల్వకుంట్ల కవితను కలిసి ఆ పార్టీలో చేరారు.
తాము పోరాడి సాధించుకున్న తెలంగాణను పరిరక్షించుకొని అభివృద్ధి చేసుకునేందుకే తాను తెలంగాణ జాగృతిలో చేరానని బాపురావు వివరించారు.
మొత్తానికి రాథోడ్ బాపురావు తాజా నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తరచూ పార్టీలు మారుతూ అసంతృప్తి రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ఆయన, ఇప్పుడు తెలంగాణ జాగృతి వేదికగా తన రాజకీయ భవిష్యత్తును ఎలా మలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మార్పు స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో, బాపురావుకు కొత్త రాజకీయ అవకాశాలు తెరుస్తుందో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అంశంగా ఉంది.