
'ఎల్ నినో' సన్నద్దతలో ప్రభుత్వ నిర్లక్ష్యం
'ఎల్‌నినో కాంటింజెన్సీ ప్లాన్-2026'
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 'ఎల్‌నినో' తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 వేల గ్రామాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని వ్యవసాయ, నీటిపారుదల శాఖలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేశాయి. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోవడంతో వేలాది గ్రామాల్లో సాగునీటితో పాటు తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వ్యవసాయ, నీటిపారుదల, తాగునీటి సరఫరా విభాగాల సమన్వయంతో 'ఎల్‌నినో కాంటింజెన్సీ ప్లాన్-2026'ను రూపొందించి అమలు చేస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా అధిక నీరు అవసరమయ్యే వరి సాగు విస్తీర్ణాన్ని సాధారణంగా ఉండే 80 లక్షల ఎకరాల నుండి దాదాపు 39 లక్షల ఎకరాలకు ప్రభుత్వం తగ్గించింది. తక్కువ నీటితో పండే కందులు, మినుములు, పెసలు, పత్తి మరియు కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,604 రైతు వేదికలలో ‘సీడ్‌మేళా’ల ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాజెక్టులలోని నీటిలో మొదటి ప్రాధాన్యత తాగునీటికే కేటాయిస్తూ, బోరు బావుల పునరుద్ధరణ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుతో పాటు తాగునీటికి, పొలాలకు తగిన విద్యుత్ సరఫరా మరియు ప్రత్యామ్నాయ పంపులను సిద్ధం చేస్తున్నారు. అలాగే భూగర్భ జలాల పరిరక్షణకు అనువైన నీటి యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ విషయం గురించి పర్యావరణవేత్తలు బి.సుబ్బారావు,కె.పురుషోత్తం రెడ్డి ఫెడరల్ తో మాట్లాడారు.
బి.సుబ్బారావు వ్యాఖ్యలు:
“ఎల్ నినో హెచ్చరికలు గత 4-5 నెలలుగా వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు మొదలవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామ పంచాయతీ స్థాయిలో రైతులకుఅవగాన కార్యక్రమాలను ప్రారంభించి, ముఖ్యంగా తెలంగాణ మెట్ట ప్రాంత రైతులకు ముందే అవగాహన కల్పించే ఉంటే రైతులు ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేవారు.ప్రభుత్వం కేవలం చెరువుల్లో పూడికలు తీసి బాగు చేశామని చెప్తోందే తప్ప, సాగునీటి పంపిణీ నియంత్రణపై దృష్టి పెట్టడంలేదు. ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో 'ఫోర్ వాటర్ కాన్సెప్ట్' వాడుతున్నామని చెప్తున్నా అందులో చిత్తశుద్ధి, పంచాయతీ స్థాయిలో జవాబుదారీతనం కనిపించడం లేదు.నీటి యాజమాన్య బాధ్యతలను పంచాయతీలకే పూర్తిస్థాయిలో అప్పగించాలి. సమీకృత నీటి వనరుల యాజమాన్యాన్ని కేవలం పల్లెలకే కాకుండా హైదరాబాద్ వంటి నగరాల్లో శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేలా ప్లాన్ చేయాలి.అలాగే అధికారులు ఇచ్చే నివేదికలతో సరిపెట్టకుండా, ఈ రిపోర్టులను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజల్లో, రైతుల్లో చైతన్యం తీసుకురావాలి.”
కె.పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యలు:
సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ముందస్తు జాగ్రత్త సూత్రం ప్రకారం జీవో 111 ను కచ్చితంగా అమలు చేయాలి.ఉస్మాన్‌సాగర్ , హిమాయత్‌సాగర్ జలాశయాల రక్షణ, నీటి కాలుష్య నివారణ, మరియు ఆ పరిసర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలపై నియంత్రణల గురించి తెలియజేసే ప్రభుత్వ ఉత్తర్వు జీవో 111. జహీరాబాద్ నుండి వికారాబాద్ వెళ్ళే దారిలో గొట్టిగారిపల్లె అనే ఊరు ఉంది .అక్కడ టి.హనుమంతరావు చొరవతో ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ని అమలు చేసారు .ఇప్పటికీ ఎన్ని ఎల్ నినో లు వచ్చినా అక్కడ కరువు రాదు. భారత దేశంలో కరువు రాకుండా చేసిన మొదటి గ్రామం ఇదే .ఈ ఐడియాని రాజస్థాన్ తీసుకుంది కానీ ఇక్కడ తెలంగాణాలో మాత్రం మిగిలిన ప్రాంతాల్లో అమలు కావడం లేదు. గొట్టిగారిపల్లె మోడల్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం ఒక పరిష్కారం.”
ఎల్ నినో వల్ల సంభవిస్తున్న జల సంక్షోభం తాత్కాలిక సమస్య కాదని, వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 'కాంటింజెన్సీ ప్లాన్-2026' ద్వారా పంట మార్పిడి, విత్తనాల సరఫరా,తాగునీటి కేటాయింపులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, ఇది మాత్రమే సరిపోదని,సకాలంలో ముందస్తు అవగాహన, జవాబుదారీతనంతో కూడిన ప్రజాస్వామ్య జల యాజమాన్యం, నగరాల్లో నీటి పునర్వినియోగం , జీవో 111 వంటి ప్రకృతి పరిరక్షణ చట్టాల కఠిన అమలు అత్యంత ఆవశ్యకమని కూడా స్పష్టం చేసారు. అధికారుల నివేదికలకే పరిమితం కాకుండా నివేదికలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, క్షేత్రస్థాయి రైతులకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ శాశ్వత పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినప్పుడే తెలంగాణ ఎల్ నినో ని సమర్థవంతంగా ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు.
* * *

