
తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ నమ్మకం కోల్పోయారా ?
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతల్లో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవటటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటున్న కమలంపార్టీ జాతీయ నాయకత్వం తాజా కమిటిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎందుకని చోటు కల్పించలేదు ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజా ప్రతినిదులు, సీనియర్ నేతలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నమ్మకం కోల్పోవటం వల్లే జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించలేదు. ఉన్న 8 మంది ఎంపీలు ఎప్పుడూ ఆధిపత్య గొడవలతోనే కాలం గడేస్తున్నారన్న విషయం మోదీ దృష్టికి వెళ్ళింది. పార్టీ తరపున 8 మంది ఎంపీలు, 8మంది ఎంఎల్ఏలున్నా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవని మోదీకి ఫిర్యాదులు వెళ్ళినట్లు సమాచారం. ఇదే విషయమై పోయిన ఏడాదిలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల భేటీలో మోదీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి-బండి సంజయ్ కు పడదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే బండి సంజయ్-మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగంగానే చాలాసార్లు గొడవపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్-ఈటల మధ్య సఖ్యత లేదు. పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును ఇటు ఎంపీలు అటు ఎంఎల్ఏలు ఎవరూ లెక్కచేయటంలేదు. గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ప్రతిరోజు రామచంద్రరావును బహిరంగంగానే విమర్శిస్తుంటారు. మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా, అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలను ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి అనేక కారణాలతో జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ స్ధానం కల్పించకపోవటమే కాకుండా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు ఏబీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ను పదవుల నుండి తప్పించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇదే విషయమై బిజెపి బిసీ లీడర్ సుందరయ్య మాట్లాడుతూ, తెలంగాణా మీద ఇంకా కేంద్రీకృతం చేయటానికే జాతీయ కమిటిలో చోటు కల్పించలేదని అన్నారు. తెలంగాణాలో వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రావడమే బిజెపి లక్ష్యమని, అందుకే ఇక్కడ ఉన్న నేతలందరు ఇక్కడే పనిచేయించేట్లుగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తోందని అన్నారు.
జర్నలిస్ట్ నరేంద్ర మాట్లాడుతూ, తెలంగాణా నాయకత్వం మీద అధిష్టానానికి పూర్తిగా నమ్మకం పోవడం వల్లే ఈ కమిటిలో ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్నారు. అధిష్టానం ఎన్నిసార్లు మందలించినా నాయకులు సఖ్యతతో పని చేయలేకపోవడం, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అందరూ కలిసి పని చేసేలా చేయలేకపోవడం కూడా అధిష్టాన అసంతృప్తికి కారణమని అన్నారు.

