
నోటీసులతో మా నోళ్లు మూయించలేరు: హరీష్ రావు
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు వరకు కాంగ్రెస్‌ను విడిచిపెట్టేదే లేదన్న మాజీ మంత్రి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశాడు. నోటీసులతో తమ నోళ్లు మూయించలేరన్నారు. మొన్న తనకు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చారని అంతకు మించి ఇంకేమీ లేదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గాలి బుడగలాంటి కేసని, దానిని భూతంలా చూపి భయ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం కాంగ్రెస్ ఈ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రకమైన ఎన్నిక ఉన్నా.. ఎవరో ఒకరు ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వాలని రేవంత్ ప్లాన్ చేశాడని, అలా చేయడం ద్వారా ప్రజల దృష్టిని తమ వైఫల్యాలపై నుంచి తప్పించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లడం కూడా ఒకేసారి అవుతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
సమాధానం లేకనే
‘‘బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంతు నోటీసుల డ్రామా. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు. రేవంతు బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ . రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చారు.రేవంత్ గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం. దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే’’ అని అన్నారు హరీష్ రావు.
సమాధానం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే
‘‘మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మేం ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి నిన్ను నిలదీస్తున్నాం. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే.. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి నువ్వు సిద్దంగా ఉండు..నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నిన్ను, నీ పార్టీని వదిలిపెట్టం’’ అని హెచ్చరించారు.
అంతే కాదు, మీ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని, నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.


