
బీఆర్ఎస్‌కు క్రెడిబులిటీ ఇంకా ఉందా ?(వీడియో)
ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు జనాల్లో గుర్తింపు ఉంది అన్నారు
తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత అందరికీ వచ్చిన అనుమానం ఇదే. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్ళింది. అక్కడ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతు కల్వకుంట్ల కవిత పేరు ఎత్తకుండా టీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ తో తమకు 22 ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. తెలంగాణను తెచ్చినపార్టీగా ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు జనాల్లో గుర్తింపు ఉంది అన్నారు. అలాంటి టీఆర్ఎస్ ను ఇఫుడు ఇంకెవరో వచ్చి టీఆర్ఎస్ పేరును తీసుకుంటాము అంటే తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అనేది తమ క్రెడిబులిటీ అని గట్టిగా ప్రకటించారు. ఆరేళ్ళ పాటు ఫ్రీజ్ అయిన పేరుని, ఉద్దేశ్యపూర్వకంగా తమకు నష్టం చేయాలని ఎవరైనా అనుకుంటే చూస్తు ఊరుకుంటామా ? అని హెచ్చరించారు.
కేటీఆర్ మాటల్లోనే విరుద్ధమైన ప్రకటనలు కనబడుతోంది. టీఆర్ఎస్ పెట్టింది కేసీఆర్ అనటంలో సందేహంలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణను తెచ్చింది కూడా టీఆర్ఎస్సే అనటంలో సందేహాలు లేవు. అలాంటి టీఆర్ఎస్ ను వద్దనుకున్నది ఎవరు ? ఇదే కేసీఆర్ కదా తెలంగాణను పాలించింది చాలు దేశాన్ని ఏలాలన్న ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చింది ? అంటే టీఆర్ఎస్ ను స్వయంగా కేసీఆరే వదులుకున్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే ఒక రాజకీయపార్టీ పార్టీ పేరును మార్చుకున్నపుడు పాత పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు ఏళ్ళపాటు ఎవరికీ కేటాయించకుండా ఫ్రీజ్ చేసి ఉంచుతుంది.
ఎందుకంటే సదరు పార్టీ మళ్ళీ కొత్తపేరు నుండి పాత పేరుకే మారాలని అనుకునే అవకాశం ఉంది కాబట్టి పాతపేరును కమిషన్ ఆరు ఏళ్ళపాటు ఎవరికీ కేటాయించకుండా ఫ్రీజ్ చేస్తుంది. అంటే ఇపుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)అనే పేరును కమిషన్ ఫ్రీజింగ్ లో పెట్టింది.
బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు రావటంతో బయటకు వచ్చేసిన కవిత వేరుకుంపటి పెట్టుకున్నారు. కొత్తపార్టీ ఏర్పాటుచేసిన కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అని పెట్టుకున్నారు. తన పార్టీ పేరును సంక్షిప్తంగా టీఆర్ఎస్ అని పిలుచుకుంటున్న కవిత అసలు ఉద్దేశ్యం ఏమిటంటే జనాలకు పాత టీఆర్ఎస్ పేరు, సెంటిమెంట్ గుర్తుకురావాలనే. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది జనాలకు బీఆర్ఎస్ తో కన్నా పాత టీఆర్ఎస్ పేరుతోనే అనుబంధం ఎక్కువగా ఉందని 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలామంది కేసీఆర్, కేటీఆర్ కు చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ పేరు మార్చటం కూడా ఓటమి కారణాల్లో ఒకటని చాలామంది నేతలు చెప్పారు.
అందుకనే కవిత కొత్తపార్టీ పేరులో టీఆర్ఎస్ అన్న పదాలే ఉండకూడదని బీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా నిర్ణయించుకున్నట్లుంది. అందుకనే కమిషన్ ముందు కవిత పార్టీ టీఆర్ఎస్ పేరుపై వెయ్యికిపైగా అభ్యంతరాలను కారుపార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అభ్యంతరాల కారణంగా కమిషన్ కవితకు టీఆర్ఎస్ అనే సంక్షిప్త పేరును ఇవ్వటం కుదరదని చెప్పేసింది. ఇదే పేరు కావాలని పట్టుబడుతున్న కవిత న్యాయపోరాటంలో పరిస్ధితులు అనుకూలించటంలేదు. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకునేది లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా కవితకు చెప్పేసింది.
సరే, ఇపుడు కేటీఆర్ తాజా వ్యాఖ్యలను చూస్తే టీఆర్ఎస్ అనే క్రెడిబులిటీని వదులుకున్నదే కేసీఆర్. టీఆర్ఎస్ ను వద్దనుకునే కదా కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చింది. తాము వద్దనుకున్న పార్టీ పేరును ఇంకెవరైనా తీసుకుంటే కేటీఆర్ కు వచ్చిన సమస్య ఏమిటో అర్ధంకావటంలేదు. ఇక్కడ అర్ధం అవుతున్నది ఏమిటంటే టీఆర్ఎస్ అనే పేరు తమకు లేకపోయినా పర్వాలేదు కాని మరొకరికి అందులోను కవితకు అస్సలు దక్కకూడదు అన్న ఆలోచనే కనబడుతోంది.

