x

మెట్రో రెండవ దశకు రెడ్ సిగ్నలేనా ?

హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టును టేకప్ చేయాలన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశ ఇప్పట్లో నెరవేరేట్లుగా కనబడటంలేదు


హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టును టేకప్ చేయాలన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశ ఇప్పట్లో నెరవేరేట్లుగా కనబడటంలేదు. మెట్రో మొదటిదశ అప్పులు, రెండోదశకు ఫైనాన్స్ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గటమే దీనికి కారణం. మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వనీ వైష్ణవ్ తర్వాత పట్టించుకోలేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

2వ దశ ప్రాజెక్టు కోసం రేవంత్ ఎంత తొందరపడుతుంటే కేంద్రప్రభుత్వం అంతగా వెనక్కు లాగుతోంది. మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం టేకేనోవర్ చేయాలంటే మొదటిదశ ప్రాజెక్టును ప్రారంభించిన ఎల్ అండ్ టీ సంస్ధకు సుమారు రు. 15 వేలు చెల్లించాలి. ఇందుకోసం సంస్ధ అప్పులు రు. 13,600 కోట్లు ప్రభుత్వం తీర్చి అదనంగా మరో రు. 2 వేల కోట్లను ప్రభుత్వం సంస్ధకు చెల్లించేట్లు అంగీకారం కుదిరింది. అప్పులు తీర్చేందుకు రాష్ట్రప్రభుత్వం-జపాన్ బ్యాంకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇండియన్ రైల్వే ఫానాన్స్ కార్పొరేషన్ గ్యారెంటీతో అప్పు మంజూరుచేయటానికి జపాన్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెండునెలల క్రితం కేంద్ర రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులు ఖట్టర్, అశ్వనీ వైష్ణవ్ తో రేవంత్ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. జపాన్ బ్యాంకుకు ఐఆర్ఎఫ్సీ గ్యారెంటీ ఇవ్వటానికి అంగీకరించింది. మొదటి, రెండోదశ ప్రాసెస్ స్పీడుగా జరగటం కోసం ఎస్బీఐ కాప్స్ కన్సల్టెంట్ గా ఉండటానికి అంగీకరించింది. పై రెండు ప్రాసెస్సులను ఆగస్టులోగా పూర్తిచేయటానికి ఎస్బీఐ కాప్స్ అంగీకరించింది. అయితే కన్సల్టెంట్ సంస్ధ పని ఇప్పటివరకు మొదలుకాలేదు. ఐఆర్ఎఫ్సీ కూడా గ్యారెంటీగా ఉండేందుకు అంగీకరించకపోవటంతో జపాన్ రుణం రద్దయిపోయింది.

గ్యారెంటీ ఇస్తామన్న ఐఆర్ఎఫ్సీ ఎందుకు వెనక్కుతగ్గింది ? కన్సల్టెంట్ ఎస్బీఐ కార్ప్స్ ఇంకా ఎందుకు పనిమొదలు పెట్టలేదు ? అన్న విషయాలు అర్ధంకావటంలేదు. ఇవన్నీ చూసిన తర్వాత మెట్రో రెండోదశకు రెడ్ సిగ్నల్ పడినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి

Read More
Next Story