
ప్రజలను, జాగృతిని వదిలేసిన కవిత
ఇప్పటికే పాపులరైన టీఆర్ఎస్ పేరునే కవిత తెలివిగా కొత్తపార్టీ పేరును టీఆర్ఎస్ గా పెట్టుకున్నారు
కొద్దినెలలుగా ఊరిస్తున్న కల్వకుంట్ల కవిత పార్టీ పేరును శనివారం ప్రకటించారు. అయితే అందరు అనుకున్నట్లుగా తెలంగాణ ప్రజా జాగృతి(TPJ) అని కాకుండా టీఆర్ఎస్(TRS) అని ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే తండ్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. కవిత పార్టీ పేరులోని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. టీఆర్ఎస్ అక్షరాల్లో కేవలం తండ్రి ఏర్పాటుచేసిన పార్టీలోని టీఆర్ ను ఉన్నదున్నట్లు తీసుకుని చివరలో సమితికి బదులు సేన అని కొత్తగా పెట్టారు. ఎవరైనా పార్టీ పేరును సంక్షిప్తంగానే చెబుతారు కాని పూర్తి పేరును చెప్పారు. ఈ పద్దతిలో ఎవరైనా కవిత కొత్తపార్టీ పేరు గురించి మాట్లాడినపుడు టీఆర్ఎస్ అనే చెబుతారుకాని తెలంగాణ రాష్ట్ర సేన అని విడమరచి చెప్పారు. కవితకు కావాల్సింది కూడా ఇదే. ఇప్పటికే పాపులరైన టీఆర్ఎస్ పేరునే కవిత తెలివిగా కొత్తపార్టీ పేరును టీఆర్ఎస్ గా పెట్టుకున్నారు.
ఇదంతా బాగానే ఉందికాని మొదటినుండి ప్రచారంలో ఉన్న తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు ఏమైంది ? తన పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రచారంలోకి తెచ్చారు. ముందుగా ఈ పేరు కవిత లాయర్ ద్వారా ప్రచారంలోకి వచ్చింది. కవిత ఏర్పాటుచేయబోతున్న పార్టీ పేరు, జెండా, గుర్తు తదితరాలను రిజిస్టర్ చేయటంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జాప్యం చేస్తోందని కవిత తరపున లాయర్ కోర్టులో కేసు వేశారు. ఆ సందర్భంగా కోర్టులో జరిగిన విచారణలో కవిత లాయర్ మాట్లాడుతు కొత్తపార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పారు. అలాగే కవిత ఏర్పాటు చేయబోతున్న కొత్తపార్టీ పేరు మీడియా, సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.
అయితే ఈమధ్య ఒక సమావేశంలో కవిత మాట్లాడుతు టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా ఆ పేరును ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దాంతో కవిత ఏర్పాటు చేయబోతున్న కొత్తపార్టీ పేరు టీఆర్ఎస్సేనా అనే అనుమానాలు కూడా పెరిగిపోయాయి. ఇన్ని అనుమానాల మధ్య ఈరోజు కొత్తపార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించారు. వినటానికి, పలకటానికి టీఆర్ఎస్ ఒకటే అనిపించటంలో వింతేముంది ? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి పార్టీ పేరులోని ప్రజలను, జాగృతిని కవిత వదిలేశారు. ఎంతో పాపులరైన, కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ నే తన పార్టీ పేరుగా కవిత ప్రకటించుకున్నారు.
టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకోలేదు ?
తన కొత్తపార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అని కవిత ఎందుకు పెట్టుకోలేదు. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పార్టీ పేరును మరొకరు ఉపయోగించుకోవటం అంత వీజీకాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అంగీకరించదు. కేసీఆర్ మొదట తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి తర్వాత అంటే 2022, డిసెంబర్ 8వ తేదీన బీఆర్ఎస్ గా మార్చారు. కేసీఆర్ టీఆర్ఎస్ అనే పేరును వదిలేసినా మరొకరు ఎవరూ కొంతకాలంపాటు పెట్టుకునేందుకు లేదు. ఎందుకంటే కేసీఆర్ కొత్తపేరు బీఆర్ఎస్ కు బదులు పాత పేరు టీఆర్ఎస్ గా మళ్ళీ మార్చుకునేందుకు అవకాశముంది. అలా మార్చుకోవాలంటే ఆ పేరు ఇంకెవరి దగ్గరా ఉండకూడదు. కొత్త పార్టీ పేరును మళ్ళీ పాత పార్టీ పేరుగా మార్చుకునే మధ్య కాలాన్ని ఎన్నికల కమిషన్ ‘కూలింగ్ పీరియడ్’ అని అంటుంది. ఈ కూలింగ్ పీరియడ్ 6 ఏళ్ళు.
అంటే కొత్తపేరుతో పార్టీ అధినేత ఒక ఎన్నికలో పాల్గొనాలి. అదే సమయంలో తిరిగి పాత పేరునే పెట్టుకోవాలన్నా ఒక ఎన్నికల సమయం 5 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. అందుకనే కూలింగ్ పీరియడ్ ను ఎన్నికల కమిషన్ 6 ఏళ్ళుగా నిర్ణయించింది. కూలింగ్ పీరియడ్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును కవిత వాడుకోవాలంటే సుమారు మరో మూడేళ్ళు ఆగాల్సిందే. అంటే బీఆర్ఎస్ ఏర్పాటైన 2022, డిసెంబర్ 8వ తేదీ నుండి కూలింగ్ పీరియడ్ 2028, డిసెంబర్, 9వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కాని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మరొకరు ఉపయోగించుకునే అవకాశంలేదు. ఈ విషయాన్ని గమనించిన తర్వాతే కవిత ఉన్నదున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా అదే అర్ధమొచ్చేట్లుగా టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. దీని అర్ధం ఏమిటంటే మొదటినుండి ప్రచారమైన పార్టీ పేరులోని జాగృతిని, ప్రజలను(తెలంగాణ ప్రజా జాగృతి)ని వదిలేసినట్లే.
మాటకు ముందు మాట తర్వాత ప్రతిరోజు ప్రజలను, జాగృతి పేరును కలవరించే కవిత పార్టీ పేరునుండి ప్రజా జాగృతిని ఎందుకు వదిలేశారు అన్నది అర్ధంకావటంలేదు. తండ్రి కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న కవిత, చివరకు తండ్రి ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పేరును భ్రమించేట్లుగా తన కొత్తపార్టీ పేరును కూడా సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే పెట్టుకోవటం కాకతాళీయమా ? లేకపోతే ఏదన్నా వ్యూహం ఉన్నదా ? అన్నది తేలాలి.

