
వెయ్యిరోజుల రేవంత్ పాలన ప్రజల్ని మెప్పించిందా ?
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీతో 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ‘ప్రత్యేక ప్రగతి నివేదిక’ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చాక 72 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. 1.68 లక్షల కోట్లు వ్యవసాయ పెట్టుబడి, రూ. 2 లక్షల కోట్ల వరకు రుణమాఫీ, వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పింది. అలాగే అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడ్డామని, తమపాలనలో లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని ఘనంగా చాటుకున్నది. ప్రభుత్వం ఈ నివేదికలతో తమ విజయాల గురించి చెప్పుకుంటుంటే బిఆర్ఎస్ వీటిని పూర్తిగా ఖండిస్తూ "1000 రోజుల మోసం" పేరిట సెప్టెంబర్ 2,3 న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజం?
దీని గురించి రీటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ రావు ప్రభుత్వం 72 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమే కానీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మాట ఏమైందని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే, వేల ఉద్యోగాలు ఇవ్వడం విజయం అవ్వదన్నారు. విద్యాశాఖ రేవంత్ దగ్గరే ఉండి కూడా వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటం గురించి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంకన్నా కొన్ని అంశాల్లో మెరుగు అయినప్పటికీ, విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదని అన్నారు.
యాక్టివిస్ట్ పి.కృష్ణకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వెయ్యిరోజుల పాలనలో విజయం సాధించిందని అన్నారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిన చోట కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం, మహిళాసంఘాలకి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా పేదలకి ఇళ్ళ హామీ కూడా కొంతమేరకు నెరవేర్చిందని అన్నారు.

