
కాంగ్రెస్ కి కష్టకాలం మొదలైందా?
కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాల నుండి వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది.సామాన్యుల నుండి విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సింగరేణి కార్మికులు,నిరుద్యోగుల వరకూ అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. ఇంకో వైపు తాజాగా రేవంత్ మంత్రివర్గంపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు కూడా వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు అంతర్గతంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, కాంగ్రెస్ కి కష్టకాలం మొదలైందేమోనని అనిపిస్తుంది.
ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల విషయంలో పెండింగ్ లో ఉన్న 10 వేల కోట్లు పక్కన పెడితే, ఈ సంవత్సరం ఆగస్ట్ 15 నుండి విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా ఏ చర్య తీసుకోలేదు. ఇప్పటికే దీని వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడటం, నిరసనలు చేయడం తెలిసిందే. ఇప్పుడు బీజేపి పార్టీ తెలంగాణా అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వం ఈ విషయంలో సత్వరం స్పందించకపోతే విద్యార్థులు సంతకాలు తీసుకుని ఉద్యమిస్తామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే తానూ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో ఈ విషయం మళ్ళి రాజుకుంది.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు కూడా కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించి ఫిట్‌మెంట్ ప్రకటించకపోవడం, పెండింగ్‌లో ఉన్న డిఏ లను విడుదల చేయకపోవడం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయకపోవడంతో వారంతా ఆందోళన బాట పట్టారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెల 10న హైదరాబాద్‌లో 'మహాధర్నా'కు పిలుపునివ్వడమే కాకుండా, సెప్టెంబర్ 1న 'పెన్షన్ ద్రోహ దినం'గా పాటించాలని నిర్ణయించడంతో ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంది. సింగరేణి కార్మికులు కూడా తాజాగా మూడు రోజులు వారసత్వ ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ధరణి’ బదులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భూభారతి’పైన విమర్శలు పెరిగిపోతూనే ఉన్నాయి.తాజాగా ‘22ఏ’ తో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సామాన్యులు కూడా అసంతృప్తి పెంచుకుంటూ ఉన్నారు. నిషేధిత జాబితాలో భూములు పెట్టి, తర్వాత కమిషన్ ద్వారా డబ్బు వసూలు చేస్తూ,సామాన్యులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు నిషేదిత జాబితాలో ఉన్న భూముల లిస్టు ఎందుకు ఆన్ లైన్ లో పెట్టలేదని హై కోర్ట్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరికి రేవంత్ రెడ్డి ఇల్లు ఈ లిస్టు లో ఉందని తెలిసాకే ప్రభుత్వం స్పందించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇవే కాకుండా రేవంత్ తన సోదరులకి నిబంధనలను అతిక్రమించి వేల కోట్ల టెండర్లు,కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెవెన్యు మినిస్టర్ కాదు రాబరి మినిస్టర్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం మీద, ఇంకో పక్క వ్యక్తిగత అవినీతి ఆరోపణలు ,మరోపక్క అంతర్గత నాయకుల విభేదాల మధ్య కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడింది. వచ్చే ఐదేళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఈ సమస్యలు పరిష్కరించాగాలరా? ఒక వైపు రాష్ట్రం అప్పులో ఉన్న సందర్భంలో, అటు విద్యార్థులు బకాయిలు, ఉద్యోగుల,పెన్షనర్ల డిమాండ్స్ నెరవేర్చగలరా అన్నది వేచి చూడాలి.

