
'హైడ్రా' సమాంతర ప్రభుత్వమా? హైకోర్ట్ ఫైర్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూముల్లో హైడ్రా చేపట్టిన కాంపౌండ్ వాల్ కూల్చివేతల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సర్వే నంబర్లు 194/1, 211లలోని లేఅవుట్ ప్లాట్లకు సంబంధించి గతంలోనే కోర్టు స్టే ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జులై 18న హైడ్రా అధికారులు తమ కాంపౌండ్ వాల్స్‌ను కూల్చివేశారని బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత తహసీల్దార్లు కోర్టుకు హాజరై, తాము హైడ్రాకు కూల్చివేతలు చేపట్టాలని ఎలాంటి అనుమతులు లేదా ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఈ సమాధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం (జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్), సరైన పరిశీలన , ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. "మీరేమైనా సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా?" అని అధికారులను నిలదీస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు తుది ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పేర్కొంటూ, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
జిల్లా పరిధిలో అధికారుల ఆదేశాలు లేకుండా హైడ్రా ఇప్పటివరకు చేపట్టిన 30 నుంచి 40 అనధికారిక కూల్చివేతలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ విషయాన్ని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని తేల్చిచెబుతూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

