పట్టణాల్లో కాంగ్రెస్, బీర్ఎస్, బీజేపీ బలమెంతో తేలిపోతుందా ?
x
Three parties gearing up for Municipal elections

పట్టణాల్లో కాంగ్రెస్, బీర్ఎస్, బీజేపీ బలమెంతో తేలిపోతుందా ?

ఫలితాల్లో మిగిలిన అన్నీ పార్టీలకన్నా ముందుండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి


పట్టణప్రాంతాల్లో ఏపార్టీకి ఎంతబలముందో తేలిపోయే ఎన్నికలు కాబట్టే మూడు ప్రధానపార్టీలు మెజారిటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండురోజుల తర్వాత 13వ తేదీన కౌంటింగ్ జరిగి ఫలితాలు వెల్లడవుతాయి. దాంతో ఆరోజు పట్టణ ప్రాంతాల్లో ఏ పార్టీకి గట్టి పట్టుంది అన్న విషయం తేలిపోతుంది. ఫలితాల్లో మిగిలిన అన్నీ పార్టీలకన్నా ముందుండాలని మూడుపార్టీలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి.

అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఈమధ్యనే జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ పంచాయతీల్లో గెలిచారు. రెండోస్ధానంలో బీఆర్ఎస్ నిలబడగా మూడో ప్లేసులో బీజేపీ అట్టడుగున ఉండిపోయింది. పంచాయతీ ఎన్నికలంటే పార్టీల రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీలకు సమస్యలేదు. కాని మున్సిపల్ ఎన్నికలు అలాకాదు. పార్టీల బ్యానర్ మీదే అభ్యర్ధులు పోటీపడతారు. కాబట్టే గెలిచిన అభ్యర్ధుల సంఖ్యను బట్టి ఏ పార్టీకి పట్టణప్రాంతాల్లో గట్టిపట్టుంది అన్న విషయం తెలిసిపోతుంది.

అందుకనే మ్యాగ్జిమమ్ మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు మూడుపార్టీలు గట్టిగా పోరాడుతుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే అన్నీ మున్సిపాలిటీల్లో పరిశీలకులను నియమించాయి. మంత్రులందరికీ తలా కొన్ని మున్సిపాలిటీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేటాయించారు. మున్సిపాలిటీల్లోని వార్డుల్లోను, కార్పొరేషన్లైతే డివిజన్లలో పోటీచేయాల్సిన అభ్యర్ధుల ఎంపిక మొదలు, ప్రచారం, ఎలక్షనీరింగ్, గెలుపు వరకు ప్రతి బాధ్యతను మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీల మీదే రేవంత్ మోపారు. తాను అనుకున్నట్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, క్యాడర్ పనిచేస్తున్నదా లేదా అని పర్యవేక్షించేందుకు పార్టీపరంగా ప్రత్యేక వ్యవస్ధను కూడా పరిశీలకుల పేరిట రేవంత్ ఏర్పాటుచేశారు. ప్రచారంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ విధంగా జరుగుతోంది అన్న విషయాలను పర్యవేక్షించి రేవంత్ కు ప్రతిరోజు రిపోర్టు అందించటమే పరిశీలకుల పని.

డోర్ టు డోర్ ప్రచారమే కీలకం

ప్రచారంలో ముఖ్యంగా డోర్ టు డోర్ ప్రచారంపైనే రేవంత్ ఎక్కువగా దృష్టిపెట్టమని అందరినీ ఆదేశించారు. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా పార్టీ ప్రచారం డోర్ టు డోర్ జరిగిన విషయం తెలిసిందే. మంత్రులు, అభ్యర్ధి, సీనియర్ నేతలు ప్రచారం కోసం ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం మళ్ళీ 6-10 మధ్య ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన చేశారు. మద్యలో రోడ్డుషోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగులో, కులసంఘాల నేతలతో సమావేశాలు, ప్రచారం చేశారు. ఇపుడు కూడా అదేపద్దతిలో ప్రతిరోజు ప్రతి మున్సిపాలిటీలో ప్రచారం జరగాల్సిందే అని రేవంత్ గట్టిగా చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అభ్యర్ధులను గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.

ఇక బీఆర్ఎస్ విషయంచూస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జిల్లాలవారీగా ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశాలు పూర్తిచేశారు. ప్రతి మున్సిపాలిటీలో పరిస్ధితులపై అధ్యయనంచేసేందుకు పరిశీలకులను నియమించారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వచ్చేది అనుమానమే కాబట్టి కేటీఆర్, కీలక నేత తన్నీరు హరీష్ రావే పార్టీవిజయాన్ని మోయాల్సుంటుంది. బీఆర్ఎస్ నేతలు, అభ్యర్ధులు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ఇంతేకాకుండా ప్రభుత్వ అవినీతి, అవకతవకలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని కూడా కేటీఆర్, హరీష్ డిసైడ్ అయ్యారు. టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేసు తదితరాల పేరుతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులుపెట్టి వేధిస్తోందనే ఆరోపణలను జనాల్లోకి తీసుకెళ్ళే యోచనలో ఉన్నారు కారుపార్టీ నేతలు.

కనీసం సగం గెలవాలి

చివరగా బీజేపీ విషయం చూస్తే ఈ పార్టీ కూడా జనాల్లో ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నికలు జరగబోయే మున్సిపలిటీలు, కార్పొరేషన్లలో కనీసం సగం గెలుచుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై మంగళవారం రాత్రి శంషాబాద్ లోని ఒక మీటింగ్ హాలులో పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామంచంద్రరావు, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. మీటింగులో తీర్మానం ప్రకారం పార్టీ 58 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లలో గెలవాలన్నట్లుగా తీర్మానం జరిగింది. మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతో జరుగుతున్నదే అన్నవిషయాన్ని ప్రజలకు వివరించబోతున్నారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లకు సంబంధించిందే కాబట్టి మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న సమస్యలు, ప్రభుత్వంలో అవినీతి, అవకతవకలపైన ప్రచారంలో ఎక్కువగా ఫోకస్ పెట్టాలని బీజేపీ కీలకనేతలు డిసైడ్ చేశారు.

ఈవిధంగా మూడుపార్టీలూ ప్రత్యర్ధిపార్టీలను దెబ్బకొట్టేందుకు అస్త్రాలను రెడీచేసుకున్నాయి. అయితే పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపికే కీలకం అవబోతోంది. పార్టీలు ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నా అభ్యర్ధుల వ్యక్తిగతం, ఇమేజి కూడా ఓట్లుపడేందుకు కీలకమనే చెప్పాలి. ఎందుకంటే వార్డు కౌన్సిలర్ అయినా, డివిజన్ కార్పొరేటర్ అయినా ప్రతిరోజు జనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి పోటీచేయబోతున్న అభ్యర్ధులు తమతో ఎలాగ ఉంటున్నారు అన్న విషయానికే ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ‘మనకు ప్రతిరోజు కనిపిస్తునే ఉంటాడు’, ‘పిలిస్తే పలుకుతుంటాడు’ లాంటి అనేక అంశాలు ఓట్లేయటంలో కీలకంగా మారుతుంది. కాబట్టి అభ్యర్ధుల ఎంపికను మూడుపార్టీలు ఎలాగ చేస్తాయి అన్నదే ఆసక్తిగా మారుతుంది.

Read More
Next Story