మంత్రి కొండా సురేఖకు అవమానం
శిలాఫలకంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంఎల్ఏ పేర్లున్నాయి కాని మరో మంత్రి కొండా సురేఖ పేరు మాయమైపోయింది
దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు అవమానం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కేశముద్రంలో జరిగిన అభివృద్ధికార్యక్రమాలు సోమవారం జరిగాయి. ఆ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన శిలాఫలకంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంఎల్ఏ పేర్లున్నాయి కాని మరో మంత్రి కొండా సురేఖ పేరు మాయమైపోయింది.
కార్యక్రమానికి వస్తున్న మంత్రుల పేర్లలో భారీ ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు కూడా వెలిశాయి. వీటిల్లో కూడా సురేఖ పేరు లేదా బొమ్మ కూడా కనబడలేదు. ఈవిషయం ఇపుడు పార్టీలో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఇటు పార్టలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా కొండా సురేఖ కేంద్రంగా పెద్ద వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. రేవంత్ మీద మంత్రి కూతురు కొండా సుస్మిత పటేల్ పదిహేను రోజుల క్రితం నోటికొచ్చినట్లు మాట్లాడింది.
కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధంలేదని మంత్రి చెప్పటం వివాదానికి ఆజ్యం పోసినట్లయ్యింది. కూతురు మాటలతో తనకు సంబంధంలేదని మంత్రి చెప్పారే కాని కనీసం ఖండించను కూడా లేదు. కొందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు సమావేశమై సురేఖను మంత్రివర్గంలో నుండి తప్పించాలని డిమాండ్లు మొదలుపెట్టారు. క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రిపై వేటు వేయాల్సిందే అని సిఫారసు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం.
అప్పటినుండి దేవాదాయ, అటవీ శాఖల్లో జరుగుతున్న డెవలప్మెంట్లు మంత్రికి సంబంధంలేకుండానే జరిగిపోతున్నాయి. మంత్రి రివ్యూ సమావేశాలకు ఉన్నతాధికారులు మొక్కుబడిగా హాజరవుతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే తన సొంత జిల్లాలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకంలో సురేఖ పేరు లేకపోవటం, బ్యానర్లు, పోస్టర్లలో కూడా మంత్రి బొమ్మతో పాటు పేరు కూడా మాయమైపోవటం దేనికి సంకేతం ? అనే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది.

