సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్ కు రంగం సిద్ధమైందా ?
x

సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్ కు రంగం సిద్ధమైందా ?

మంత్రివర్గం నుండి కొండా సురేఖను, ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్ గా చిన్నారెడ్డిని వెంటనే తప్పించాల్సిందే అని క్రమశిక్షణా కమిటి సిఫారసు చేసినట్లు సమాచారం


మంత్రి కొండా సురేఖతో పాటు మాజీమంత్రి చిన్నారెడ్డి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని కాంగ్రెస్ పార్టీలోని క్రమశిక్షణ కమిటి మంగళవారం సిఫారసుచేసింది. తన రిపోర్టును మంగళవారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు కమిటి రిపోర్టును అందించింది. ఆ రిపోర్టుపై బొమ్మ తన సిఫారసులతో తెలంగాణ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు అందిస్తారు. మీనాక్షి కూడా తన సిఫారసుతో ఆ రిపోర్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు అందిస్తారు.

ఇదే విషయాన్ని క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లురవి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము సిఫారసు చేసిన చర్యలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నది ఏఐసీసీ అగ్రనేతలు చూసుకుంటారు అని మల్లు స్పష్టంగా చెప్పారు. ఇద్దరిపైన ఎలాంటి చర్యలకు సిఫారసు చేశారన్న ప్రశ్నకు రవి సమాధానం చెప్పటానికి నిరాకరించారు. క్రమశిక్షణ అన్నది పూర్తిగా పార్టీకి సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము రిపోర్టు అందించలేదని కూడా చెప్పారు.

అయితే మల్లురవి చెప్పకపోయినా మంత్రివర్గం నుండి కొండా సురేఖను, ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్ గా చిన్నారెడ్డిని వెంటనే తప్పించాల్సిందే అని క్రమశిక్షణా కమిటి సిఫారసు చేసినట్లు సమాచారం . ఈ విషయంపై పార్టీలోని నేతలమధ్య పెద్దఎత్తున చర్చలు జరుగుతోంది. ఇద్దరిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులు మరింతమంది వీళ్ళ పద్దతిలోనే నోటికొచ్చినట్లు మాట్లాడటం ఖాయమని కమిటి రిపోర్టులో స్పష్టంగా చెప్పింది. క్రమశిక్షణా రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఇపుడు ఈ ఇద్దరిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని కమిటి రిపోర్టులో స్పష్టంగా చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.

వారం రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ఒక సమావేశంలో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ మాట్లాడుతు రేవంత్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. దానిపై మంత్రి సురేఖను క్రమశిక్షణ కమిటి వివరణ అడిగినపుడు కూతురు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఎదురుదాడి చేశారు. పైగా తన కూతురు మాట్లాడిన మాటలకు తనకి నోటీసు ఇచ్చి వివరణ అడగటం ఏమిటని కమిటి సభ్యులనే నిలదీశారు. దాంతో పార్టీలోని ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు కూడా సురేఖపైన బాగా మండిపోతున్నారు.

సురేఖను తక్షణమే మంత్రివర్గంలో నుండి తప్పించాలని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు సుమారు 25 మంది తీర్మానంచేసి అధిష్ఠానానికి పంపిన విషయం తెలిసిందే. అప్పటినుండి మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయింది. అందుకనే సురేఖతో పాటు చిన్నారెడ్డి మీద చర్యలకు క్రమశిక్షణ కమిటి సిఫారసు చేసింది. మరి ఏఐసీసీ అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Read More
Next Story