
కవిత సీఎం అయిపోయినట్లేనా ?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రిని తానే అన్నంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడారు
కల్వకుంట్ల కవిత మాటలు, చెప్పిన సమాధానాలు విన్నతర్వాత చాలామందికి ఇదేసందేహం మొదలైంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రిని తానే అన్నంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడారు. శనివారం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ లో కవిత మాట్లాడుతు తమ ప్రభుత్వం ఏర్పడగానే చేయబోయే కార్యక్రమాల జాబితాను వివరించారు. సర్వోదయ తెలంగాణ సాధనే టాప్ ప్రయారిటీగా చెప్పారు. సర్వోదయ తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ అని వివరించారు.
టీఆర్ఎస్ ను ప్రకటించిన ఏప్రిల్ 25వ తేదీన ఐదు అంశాలను ప్రకటించి వాటికి పాంచజన్యం అని పేరు పెట్టారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, మహిళా సాధికారత, యువకులకు ఉపాధి, రైతుల సంక్షేమాన్ని కలిపి కవిత పాంచజన్యంగా అభివర్ణించారు. అదేవిషయాన్ని మీడియా ప్రతినిధులు ‘‘ఇప్పటికే అప్పుల్లో ఉన్న ప్రభుత్వంలో పాంచజన్యాన్ని ఎలాగ అమలుచేస్తారు’’ అని అడిగారు. దానికి కవిత బదులిస్తు ‘‘వివిధ పద్దతుల్లో ఏడాదికి రు 1.80 లక్షల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది’’ అని చెప్పారు. ఆదాయంలో నుండి లక్ష కోట్ల రూపాయలను పాంచజన్యంకు వ్యయంచేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి టాప్ ప్రయారిటి ఇస్తుందన్నారు. ‘‘అమ్మతనం ఉంటే లక్ష కోట్ల రూపాయలను ప్రజలకోసం ఈజీగా ఖర్చుచేయచ్చు’’ అని తెలిపారు. బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్మతనం లోపించటం వల్లే సమస్యలు పెరిగిపోయాయని ఎద్దేవాచేశారు.
అయితే ఇక్కడ కవిత మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంగురించి చెప్పారే కాని ఖర్చుల గురించి చెప్పలేదు. ఉద్యోగుల జీత, బత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకే ఏడాదికి ప్రభుత్వం సుమారుగా రు. 70 వేల కోట్లు ఖర్చుచేస్తోంది. ఇక అమలవుతున్న సంక్షేమ పథకాల ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాల ఖర్చులు, తెచ్చిన అప్పులకు అసలు+దానిమీద కట్టాల్సిన వడ్డీలు లెక్కలు వేసుకుంటే ప్రభుత్వం మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. ప్రతి నెలా అప్పులు తీసుకుంటే తప్ప నడవలేని ప్రభుత్వం దగ్గర పాంచజన్యం హామీల అమలుకు లక్ష కోట్ల రూపాయలు ఇంకెక్కడ ఉంటుంది ? తమపార్టీ ఎవరితోను పొత్తు పెట్టుకోదని చెప్పారు. భావసరూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు సాధ్యమేనని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ధర్మ సమాజ్ లాంటి పార్టీలతో సమయం వచ్చినపుడు పొత్తులగురించి ఆలోచిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించటానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పారు. అందుకనే కవిత సీఎం అయిపోతున్నట్లు లేదా ఆల్ మోస్ట్ అయిపోయినట్లే అన్నట్లుగా మాట్లాడారు.
ఎందుకంత అయోమయం ?
పార్టీ ప్రకటనలో అయోమయం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు ఉద్దేశ్యపూర్వకంగానే రకరకాల పేర్లను జనాల్లోకి ప్రచారంచేసినట్లు చెప్పారు. ఫైనల్ గా తమపార్టీకి ఎన్నికల కమిషన్ ‘తెలంగాణ రక్షణ సేన’ అన్న పేరును ఆమోదించినట్లు చెప్పారు. పార్టీ కోసం దరఖాస్తు చేసిన దగ్గర నుండి తమకు టీఆర్ఎస్ అనే పేరు రానీయకుండా చాలా కుట్రలు జరిగినట్లు ఆరోపించారు. అయితే కుట్రలు జరుగుతాన్న విషయాన్ని గ్రహించి ముందుజాగ్రత్తగా వ్యూహంతో టీఆర్ఎస్ అనే పేరును సాధించుకున్నట్లు చెప్పిన కవిత ‘టీఆర్ఎస్ నాకు రాసిపెట్టుందేమో’ అని అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వల్ల తెలంగాణకు చాలా నష్టాలు జరిగినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ వల్ల జరిగిన నష్టాలను కవిత ‘లాస్ట్ ఆపర్చునిటీ లాస్’ అని వర్ణించారు. జరగాల్సిన పనులు, చేయాల్సిన పనులు చేయకపోవటం వల్ల జరిగే నష్టాలను లాస్ట్ ఆపర్చునిటీస్ లాస్ అని అంటారని వివరించారు. ఈ పద్దతిలో కేసీఆర్ పాలనలో రైతులకు రు. 2.5 లక్షల కోట్లు నష్టం జరిగిందని మండిపడ్డారు. అలాగే గ్రూప్ వన్ పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించలేకపోవటం వల్ల యువత, విద్యార్ధులకు చాలా నష్టం జరిగిందన్నారు. క్వశ్చన్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించటంలో ఐటిశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఫెయిలయ్యారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ఇపుడు మాట్లాడుతున్న కవిత పార్టీలో ఉన్నపుడు ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ లో భాగంగా ఉన్నపుడు కూడా చెప్పినట్లు తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నపుడు కొంత డిసిప్లిన్ పాటించాల్సుంటుందని గుర్తుచేశారు. అప్పట్లో జరిగిన అవినీతి, తప్పులను నేరుగా కేసీఆర్ తోనే చాలాసార్లు చెప్పినట్లు వివరించారు. అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా కేసీఆర్ కు చెప్పాను అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి బాస్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడున్నానని అయితే ఇంకొంచెం గట్టిగా చెప్పుండాల్సిందని ఇపుడు చెప్పారు.
బీఆర్ఎస్ వద్దనుకుంది
వివరణ కూడా అడగకుండానే తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కవిత ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బహుశా తనను బీఆర్ఎస్ వద్దనుకోవటం వల్లే అలా ఏకపక్షంగా సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అనేక కేసులున్న రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళకు షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చి తనను మాత్రం సస్పెండ్ చేయటంలో అర్ధమేంటి అని అడిగారు. ప్రజాజీవితంలో ఉండాలని అనుకున్నాను కాబట్టే కొత్తపార్టీ పెట్టాల్సొచ్చిందని వివరించారు. ‘తెలంగాణ అభివృద్ధి విషయంలో కమిట్మెంట్ లేకపోతే అమరవీరుల స్ధూపానికి కట్టేసి నన్ను కొట్టండి’ అని కవిత ప్రకటించారు. తమపార్టీలోకి వేలాదిమంది ఏడాదిలో జాయిన్ అయ్యారని యూత్, విమెన్ ఎక్కువగా జాయిన్ అవుతున్నట్లు చెప్పారు. తమపార్టీకి అడ్డుగా ఎవరొచ్చినా విమర్శలు తప్పవని హెచ్చరించారు.
మహిళలకు రిజర్వేషన్ చట్టంతో సంబంధంలేకుండా తమపార్టీ 33శాతంకు తక్కువకాకుండా మహిళలకు సీట్లిస్తుందని ప్రకటించారు. అవకాశముంటే 50శాతం ఇస్తామని కూడా అన్నారు. తనకు బీజేపీ డీఎన్ఏతో సరిపోదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘తెలంగాణకు ఎవరు విలనో తనకు కూడా వాళ్ళే విలన్లని తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకించి విలన్లు అంటు ఎవరూ లేరు’’ అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తనకు గుండె దైర్యం ఎక్కువని నిప్పుల్లో నడిచొచ్చాను కాబట్టి ఎన్ని సమస్యలను అయినా లెక్కచేయనని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఫైనల్ గా జాతీయ రాజకీయాలు, పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ కు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతానని కల్వకుంట్ల కవిత స్పష్టంగా ప్రకటించారు.

