కేసీఆర్ మెడకు ‘టీఆర్ఎస్సే’ బిగుసుకుంటుందా ?
x
Kavitha and KCR

కేసీఆర్ మెడకు ‘టీఆర్ఎస్సే’ బిగుసుకుంటుందా ?

ఇంతకాలం ఇతర అభ్యర్ధుల గుర్తుల పైనే పోరాటం చేసిన కేసీఆర్ ఇకనుండి టీఆర్ఎస్ అనే పేరుతో కూడా ఫైట్ చేయక తప్పేట్లు లేదు


ఇంతకాలం ఇతర అభ్యర్ధుల గుర్తుల పైనే పోరాటం చేసిన కేసీఆర్ ఇకనుండి టీఆర్ఎస్ అనే పేరుతో కూడా ఫైట్ చేయక తప్పేట్లు లేదు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు అనేకమంది పోటీ చేస్తుంటారు. వీరికి జీపు, ట్రాక్టర్, చపాతీ రోలర్, వ్యాన్ లాంటి అనేక గుర్తులను ఎన్నికల కమిషన్ అభ్యర్ధులకు కేటాయిస్తుంటుంది. మామూలుగా రోడ్లపైన చూస్తే కారుకు జీపు, వ్యాన్, ట్రాక్టర్ లకు అసలు పోలికే ఉండదు. ఎందుకంటే ఒకదానికి మరొకదానితో అసలు సంబంధమే ఉండదు. కాని ఇవే గుర్తులను బ్యాలెట్ పేపర్లు లేదా ఈవీఎంల్లో చూసినపుడు ఓటర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముంది.

ఎన్నికల సమయంలో ఓటర్లు ఈవీఎంల్లోని కారుగుర్తుకు ఓట్లేయబోయి జీపు, వ్యాన్, ట్రాక్టర్ గుర్తులకు ఓట్లేయటం వల్ల పార్టీ నష్టపోయిందని కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రత్యర్ధి అభ్యర్ధులకు పైన చెప్పిన గుర్తులను కేటాయించకూడదని ఎన్నికల కమిషన్ దగ్గర పెద్ద పోరాటమే చేశారు. అయినా కమిషన్ వీళ్ళ వాదనను కొట్టిపడేసింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు, చిన్నపార్టీల తరపున పోటీచేసే అభ్యర్ధులకు వాళ్ళు కోరుకున్న గుర్తులను అవకాశాన్ని బట్టి ఇస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయటంతో చేసేది లేక మౌనంగా ఉండిపోయారు. పైన చెప్పిన గుర్తుల వల్ల కారుపార్టీ అభ్యర్ధులు నష్టపోయారు అనేందుకు 2023 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లోని ఓటమిని ఉదాహరణగా చూపించారు.

నారాయణపేట్, డోర్నకల్, మెదక్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ లాంటి మరికొన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ఓడిపోయిన ఓట్ల తేడాకన్నా పైనచెప్పిన గుర్తులపైన పోటీచేసిన అభ్యర్ధులకు పడిన ఓట్లు ఎక్కువ. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్ధి 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే స్వతంత్ర అభ్యర్ధికి పడిన ఓట్లు సుమారు 2 వేలు. కారుగుర్తును పోలిన ఇతర గుర్తుల వల్ల బీఆర్ఎస్ నష్టపోకూడన్న కేసీఆర్ పోరాటం ఫలించలేదు.

అలాంటిది భవిష్యత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కారును పోలిన గుర్తులతోనే కాదు ఏకంగా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతో ఏర్పాటైన పార్టీతో కూడా పెద్ద పోరాటమే చేయాల్సొచ్చేట్లుంది. ఇపుడు కేసీఆర్ పరిస్ధితి ఎలాగుందంటే ‘మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లు’గా తయారైంది. ఒకవైపు కారును పోలిన గుర్తులతో పోరాడుతునే మరోవైపు టీఆర్ఎస్ అనే పేరుపైన కూడా పోరాడక తప్పేట్లులేదు. గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు ఇప్పటికీ బీఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ అంటేనే సెంటిమెంట్ ఎక్కువ.

తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్రంలోని జనాలందరు బాగా కనెక్టయ్యారు. జనాలు టీఆర్ఎస్ అంటే తమది, తమకోసం కొట్లాడిన పార్టీ అని ఓన్ చేసుకున్నారు. అలాంటి టీఆర్ఎస్‌ను జనాల సెంటిమెంటును పట్టించుకోకుండా, ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణలో తానుచేయాల్సింది ఏమీలేదనుకుని జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పి ప్రధానమంత్రి అయిపోవాలన్న బలమైన కోరికతో పార్టీని జాతీయ స్ధాయిలో విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. పార్టీని జాతీయస్ధాయిలో విస్తరించటం మాట దేవుడెరుగు తెలంగాణలోనే బోర్లాపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం అటుంచితే 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కసీటులో కూడా పార్టీ గెలవలేదు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తీరిగ్గా పార్టీ పేరు మార్పే ఓటమికి దారితీసిందన్న నేతల ప్రకటనలకు కేటీఆర్ కూడా ఔననక తప్పలేదు. అందుకనే బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్‌గా రివర్స్‌చేసే విషయాన్ని అధినేత ఆలోచిస్తున్నట్లు స్వయంగా కేటీఆరే ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే కవిత ఏర్పాటుచేసిన కొత్తపార్టీ తెలంగాణ రక్షణ సేనకు ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. దాంతో కవిత కొత్తపార్టీ పేరు టీఆర్ఎస్ అయ్యింది. నిజానికి కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి వేరు, ఇపుడు కవిత ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ తెలంగాణ రక్షణ సేన వేరు. అయితే రెండుపార్టీల పేర్లను జనాలు మాట్లాడుకునేటపుడు సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే అంటారు. ఇదే కేసీఆర్ కు పెద్ద సమస్యగా మారుతుందనే విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.

ఎలాగంటే గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటి జనాలకు బీఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ అన్న పేరే మనస్సుల్లో నిలిచిపోయింది. గడచిన ఎన్నికల్లో ఈవీఎంల్లో టీఆర్ఎస్ ప్లేసులో బీఆర్ఎస్ కనబడినా కాంగ్రెస్ వైపే జనాలు మొగ్గారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల్లో బీఆర్ఎస్ తో పాటు క్రమపట్టికలో టీఆర్ఎస్ కూడా కనబడితే జనాలు బీఆర్ఎస్ ను కాదని టీఆర్ఎస్ కే ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన కారుపార్టీ నేతల్లో పెరిగిపోతోంది. అందుకనే కవిత పార్టీ పేరులో టీఆర్ఎస్ అని ఉండకూడదని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ దగ్గర అభ్యంతరాలు వ్యక్తంచేశారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే వీళ్ళ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదని సమాచారం. అందుకనే రాబోయే ఎన్నికల నుండి కేసీఆర్ కారును పోలిన గుర్తులతో పాటు టీఆర్ఎస్ పార్టీ మీద కూడా బీఆర్ఎస్ పెద్ద పోరాటం చేయక తప్పేట్లులేదు. ఒకపుడు తానే పెంచి పెద్దచేసి తర్వాత వదిలేసిన టీఆర్ఎస్ అన్న పేరు భవిష్యత్తులో కేసీఆర్ మెడకు ఉచ్చులాగ బిగుసుకుంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story