
మీనాక్షికి బంపర్ లాటరీ తగలబోతోందా ? (వీడియో)
సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ లో మిస్సయిన రాజ్యసభ ఎంపీ అవకాశం తెలంగాణ నుండి తగలబోతోందా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు తొందరలోనే బంపర్ లాటరీ తగలబోతోందా ? సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ లో మిస్సయిన రాజ్యసభ ఎంపీ అవకాశం తెలంగాణ నుండి తగలబోతోందా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసిన మీనాక్షికి తీవ్ర నిరస ఎదురైన విషయం తెలిసిందే. తన నామినేషన్ పత్రాల్లో తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసు వివరాలను చెప్పలేదని బీజేపీ మంత్రి ఫిర్యాదు చేశారు. దాంతో రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్‌పత్రాలను తిరస్కరించటం దేశవ్యాప్తంగా సంచలనమైంది.
మీనాక్షిపైన తెలంగాణలో క్రిమినల్ కేసు దాఖలైందని బీజేపీ నేతలు అంటుంటే మీనాక్షిపైన తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసు దాఖలు కాలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు చెబుతున్నారు. ఈవివాదంలో జోక్యంచేసుకోవటానికి సుప్రింకోర్టు కూడా నిరాకరించింది. సరే, ఎవరి వాదన ఎలాగున్నా మీనాక్షికి రాజ్యసభ ఎంపీ ఛాన్స్ మిస్సయ్యిందన్నది వాస్తవం.
అయితే ఇక్కడే అసలు కథ మొదలైందని పార్టీ వర్గాల సమాచారం. ఎలాగంటే ఈమధ్యనే ముఖ్యమంత్రి రెండురోజులు ఢిల్లీలో క్యాంపువేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయినపుడు మీనాక్షి విషయం చర్చకు వచ్చిందని పార్టీనేతలు చెబుతున్నారు. రాహుల్‌తో పాటు అగ్రనేతలందరికీ అత్యంత సన్నిహితురాలైన మీనాక్షికి తెలంగాణనుండి అవకాశం ఇచ్చే విషయమై రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో మిస్సయిన అవకాశాన్ని తాను తెలంగాణ నుండి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ ప్రతిపాదించారని పార్టీవర్గాల సమాచారం. ఎలాగంటే ఇపుడు తెలంగాణలో కాంగ్రెస్ తరపున అనీల్ కుమార్ యాదవ్, రేణుకా చౌధరి, అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరిలో అనీల్, రేణుక ఎంపీలై దాదాపు ఏడాదిన్నర అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింఘ్వీ, వేం ఎంపీలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఇద్దరిలో రేవంత్‌కు వేం అత్యంత సన్నిహితుడు. ప్రభుత్వ సలహదారుగా ఉన్న వేంను రేవంత్ రాజ్యసభ ఎంపీని చేశారు. మీనాక్షి కోసం వేంతో తన పదవికి రాజీనామా చేయించటానికి సిద్ధంగా ఉన్నట్లు అగ్రనేతలకు రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అగ్రనేతలు గనుక ఈవిషయంలో పాజిటివ్ గా స్పందిస్తే వెంటనే వేం ఎంపీ పదవికి రాజీనామా చేయటం, ఉపఎన్నిక జరగటం, మీనాక్షి తెలంగాణ నుండి ఎంపీ అయిపోవటం ఖాయం. పార్టీ నేతలమధ్య విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈవిషయం అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

