
మోదీ ఉక్రోషం బయటపడుతోందా ?
రిజర్వేషన్ బిల్లును ఓడగొట్టిన కాంగ్రెస్, డీఎంకేలను మహిళలు ఎప్పటికీ క్షమించరనే శాపనార్ధాలు మొదలుపెట్టారు
శుక్రవారం లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన ఎఫెక్ట్ నరేంద్రమోదీపైన స్పష్టంగా కనబడుతోంది. బిల్లువీగిపోయిన దగ్గరనుండి ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీపై విరుచుకుపడుతున్నారు. రిజర్వేషన్ బిల్లును ఓడగొట్టిన కాంగ్రెస్, డీఎంకేలను మహిళలు ఎప్పటికీ క్షమించరనే శాపనార్ధాలు మొదలుపెట్టారు. శనివారం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టడం కాంగ్రెస్, డీఎంకేకు ఏమాత్రం ఇష్టంలేదని ఆరోపించారు. ఆదివారం పశ్చిమబెంగాల్ ప్రచారంలోకూడా ఇదేవిషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం చూస్తే మహిళా బిల్లు వీగిపోయిన ఎఫెక్ట్ మోదీపైన స్పష్టంగా కనబడుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును వీగిపోయేట్లు చేయటంద్వారా కాంగ్రెస్, డీఎంకేలు దేశంలోని మహిళలకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని మహిళలంతా గుర్తుంచుకోవాలని అన్నారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీలను శిక్షించే సమయం మహిళలకు వచ్చిందని మోదీ పిలుపిచ్చారు. ప్రతిపక్షాలు ఓడించింది బిల్లును కాదని మహిళా శక్తిని అని, కుటుంబపార్టీలు ఇతర మహిళలను ఎదగనీయవని ఏవేవో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎన్నికలన్నాక గెలుపోటములు చాలా సహజమే. కానీ మహిళాబిల్లు లోక్ సభ ఓటింగులో వీగిపోవటంలో మోదీ బాధ్యత కూడా చాలావుంది. ఎలాగంటే రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి ఎన్డీయేకి తగినంత మెజారిటి లేదన్న విషయం మోదీకి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా బిల్లు ఓటింగ్ దాకా పరిస్ధితిని ఎందుకు తెచ్చారు ? ఎందుకంటే వ్యూహాత్మకంగానే తెచ్చారని అర్ధమవుతోంది. మోదీ వ్యూహంలో రెండే అంశాలున్నాయి. మొదటిదేమో మహిళా సెంటిమెంటును బూచిగా చూపించి ప్రతిపక్షాలను ఇరుకునపెట్టి ఓటింగులో నెగ్గించుకోవటం. రెండో అంశం ఏమిటంటే బిల్లు ఓడిపోతుందని ముందే తెలిసి ఓడిన తర్వాత మహిళల ముందు ప్రతిపక్షాలను దోషులుగా చిత్రీకరించటం. దోషులుగా చిత్రీకరించటంలో ఉపయోగం ఏమిటంటే తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్లను గంపగుత్తగా బీజేపీ, ఎన్డీయే అభ్యర్ధులకు వేయించుకోవటమే.
విచిత్రం ఏమిటంటే ఓటమి తర్వాత శనివారం రాత్రి మోదీ మాట్లాడుతు మహిళా బిల్లు ఆమోదం క్రెడిట్ ను ప్రతిపక్షాలనే తీసుకోమని చెప్పినా వినలేదని ఆరోపించటం. బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టిన తర్వాత క్రెడిట్ ప్రతిపక్షాలకు ఎలాగ దక్కుతుంది ? నిజంగానే మోదీలో చిత్తశుద్ది ఉంటే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ప్రతిపక్షాలకు ఇచ్చేట్లుగా ముందుగానే మాట్లాడుండాలి. రెండు కూటముల మధ్య చర్చలు సఫలమై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేటు మెంబర్ బిల్లో లేకపోతే ఇంకేదైనా పద్దతిలో ప్రతిపక్షాలు బిల్లును ప్రవేశపెట్టినపుడు అధికారపక్షం ఆమోదం తెలిపితే అప్పుడు క్రెడిట్ ప్రతిపక్షంకు దక్కే ఛాన్సుంది. నిజానికి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం అధికారపక్షానికే కాని ప్రతిపక్షాలకు ఉండదు. ఏదైనా కీలకమైన అంశంమీద ప్రతిపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతాయి. అయితే మహిళలకు 33శాతం రిజర్వేషన్ అంశంపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందా ? అన్నదే ప్రశ్న.
2023లో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని అప్పట్లో ప్రతిపక్షాలు ఎంతడిమాండ్ చేసినా మోదీ ఏమాత్రం ఖాతరుచేయలేదు. పోనీ ఇపుడు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, జమిలిఎన్నికల బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టమని ప్రతిపక్షాలు ఎంతచెప్పినా మోదీ వినిపించుకోలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ముందుపెట్టి దానితోనే డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు మోదీ ప్లాన్ చేశారు. అందుకనే ఎలాంటి మొహమాటంలేకుండా ఇండియా కూటమి, నాన్ ఎన్డీయే పార్టీలు ఏకమై మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడిగొట్టాయి. బిల్లు వీగిపోయిందన్న ఉక్రోషమే మోదీలో స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో కనబడుతోంది. మరి మహిళా ఓటర్లు ఏమిచేస్తారనేది సస్పెన్సుగా మారింది.

