ఇక బిజెపి టార్గెట్ తెలంగాణ ..మోడీ పర్యటన కారణమిదేనా ?
x

ఇక బిజెపి టార్గెట్ తెలంగాణ ..మోడీ పర్యటన కారణమిదేనా ?

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే నని చెప్పుకునేందుకు బీజేపీ పెద్దగా కృషి చేస్తున్నట్లు లేదు...


ఈమద్యనే జరిగిన ఎన్నికల్లో రెండురాష్ట్రాల్లో బీజేపీ విజయంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదుపరి టార్గెట్ తెలంగాణనేనా ? మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వయం బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 8 రాష్ట్రాల్లో సొంతంగాను మరో 7 రాష్ట్రాల్లో కూటమిలోను బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరాధిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి. ఎంత కష్టపడుతున్నా దక్షిణాదిలో కర్నాటక తప్ప మరో రాష్ట్రం బీజేపీకి చిక్కటంలేదు. ముఖ్యంగా తమిళనాడు, కేరళలో అధికారం బీజేపీకి ఎండమావిలాగే అయిపోయింది. తాజా ఎన్నికల ఫలితాలతో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. కొద్దోగొప్పో సొంతంగా బలమున్నది తెలంగాణలో మాత్రమే. పార్టీ తరపున తెలంగాణలో 8మంది ఎంపీలు, 8 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికలు 2028 నాటికి పార్టీని బలోపేతం చేస్తే అధికారం దక్కించుకోవచ్చని కమలనాదులు ఆశతో ఉన్నారు.

అయితే ఆ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయేట్లున్నాయి. కారణం ఏమిటంటే పార్టీకి క్షేత్రస్ధాయిలో జనబలమే కాదు చివరకు క్యాడర్ బలంకూడా లేదు. అలాగే ఎంపీలు, ఎంఎల్ఏల మధ్య సఖ్యతలేదు. 16 మంది ప్రజాప్రతినిధుల్లో మెజారిటి తీరు ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా సాగుతోంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి ఎంఎల్ఏలు, ఎంపీలు 16మంది కూర్చుని మాట్లాడుకున్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు కలిసి సమిష్టిగా చేపట్టిన కార్యక్రమం ఒక్కటికి కూడా లేదంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే వీళ్ళల్లో చాలామందికి ఒకరంటే మరొకరికి గిట్టదు. ప్రజాప్రతినిధులు సమిష్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంచేయటంలేదని పార్టీకి రాజీనామాచేసిన బీజేపీ, గోషామహల్ నియోజకవర్గం ఎంఎల్ఏ రాజాసింగ్ అనేకసార్లు తన అసంతృప్తిని వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ‘‘ఇతర రాష్ట్రాల్లో గెలిస్తే స్వీట్లు పంచుకుంటున్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వచ్చే మార్గం చూడకపోవటం సిగ్గుచేటు’’ అని రాజాసింగ్ దెప్పి పొడిచిన విషయం తెలిసిందే.

జరుగుతున్న ప్రచారాన్ని బట్టి పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిల్లో సఖ్యతలేదు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎవరితోను కలవటంలేదు. ఎంపీల మధ్య సఖ్యత లేకపోవటానికి కారణం రాష్ట్ర అధ్యక్ష పదవే. రాష్ట్ర అధ్యక్షపదవి కోసం ఈటల, అర్వింద్, రఘునందన్ రావు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకున్నారు. ఈనేపధ్యంలోనే వీళ్ళమధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. రఘునందన్ తప్ప మిగిలిన ఇద్దరు బీసీ నేతలు కూడా. అలాగే వీళ్ళతో బండికి కూడా మంచి సంబంధాలు లేవు. ఎంఎల్ఏగా ఈటల ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం హుజూరాబాద్ లో బండి పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. హుజూరాబాద్ కేంద్రంగా ఈటల-బండి మధ్య బహిరంగంగానే పెద్ద గొడవలయ్యాయి.

రామచంద్రరావు స్టాప్ గ్యాపేనా ?

వీళ్ళమధ్య గొడవలను సర్దుబాటు చేయలేకపోయిన జాతీయ నాయకత్వం చివరకు అధ్యక్షపదవిని న్యాయవాది, మాజీ ఎంఎల్సీ, సీనియర్ నేతయిన నారపరాజు రామచంద్రరావుకు కట్టబెట్టింది. అయితే రామచంద్రరావు మృదుస్వభావి కావటంతో రామచంద్రరావు ఎవరినీ కట్టడిచేసే స్ధితిలో లేరు. అధ్యక్షుడి మాటను ఎవరూ వినటంలేదని పార్టీలోనే టాక్ వినబడుతోంది. అలాగే అసెంబ్లీని తీసుకుంటే 2018-23 మధ్య బీజేపీ శాసనసభాధ్యక్ష పదవి కోసం రాజాసింగ్, రఘునందనరావు, ఈటల తదితరుల మధ్య పెద్ద వివాదమే రేగింది. శాసనసభాధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేని నాయకత్వం చివరకు ఖాళీగానే ఉంచేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈటల, రఘునందన్ ఎంపీలుగా గెలవటంతో పదవికి పోటీతగ్గింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8మంది ఎంఎల్ఏల్లో శాసనసభాధ్యక్ష పదవిని పార్టీ నాయకత్వం కాంగ్రెస్ లోనుండి బీజేపీలో చేరి నిర్మల్ లో పోటీచేసి గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డికి కట్టబెట్టింది. కాంగ్రెస్ లో నుండి వచ్చిన ఎంఎల్ఏకి శాసనసభాధ్యక్షపదవి అప్పగించటంతో మిగిలిన ఏడుగురు ఎంఎల్ఏలు మండిపోతున్నారు. తర్వాత కాలంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తంమీద బీజేపీలోని ఎంపీలు, ఎంఎల్ఏల మధ్య సఖ్యతలేదు అనటానికి పై ఉదాహరణలే నిదర్శనమనే ప్రచారం జరుగుతోంది. మూడు ఎంఎల్సీలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేనందువల్ల బీజేపీ రెండుచోట్ల గెలిచింది. బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పోటీచేయలేదన్న రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతల ఆరోపణలు అందరికీ తెలిసిందే.

నిజానికి బీజేపీ అధికారంలోకి రావటానికి తెలంగాణలో రాజకీయ శూన్యత ఏమీలేదు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ ఒకవైపు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరోవైపున్నాయి. ఈ రెండింటికి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా కనబడటంలేదు. ఎంతసేపు మీడియాలో ఆరోపణలు చేయటం తప్ప క్షేత్రస్ధాయిలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమీలేవు. బీజేపీ నేతలు ఆందోళనలు చేయాలంటే రైతు సమస్యలు, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ అంశం, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అందించటంలో జాప్యం లాంటి ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. కాని ఏ విషయంలోను బీజేపీ నేతలు పెద్దగా రోడ్డుమీదకు వచ్చిందిలేదు.

మోదీ, షా నే బాధ్యత తీసుకోవాలా ?

తెలంగాణలో బీజేపీని మోదీ, అమిత్ షా లే అధికారంలోకి తీసుకొస్తారనే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి. కంటోన్మెంట్ లో ఓడిన పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా విజయాలు సాధించలేదు. తొందరలోనే జరగబోయే పరిషత్, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏమిచేస్తుందో చూడాలి. నేతల మధ్య సఖ్యత కూడా లేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని అంటే ఎవరూ నమ్మటంలేదు. ఇపుడు అందరికళ్ళు ఈనెల 10వ తేదీన నగరానికి రాబోతున్న మోదీ పర్యటనపైనే ఉంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల మద్య సఖ్యతలేదన్న విషయం మోదీకి బాగా తెలుసు. ఎలాగంటే, ఆమధ్య ఢిల్లీలో ప్రత్యేకించి తెలంగాణ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించటంలో పార్టీ విఫలమైందని స్వయంగా మోదీయే అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు అన్నీ అవకాశాలున్నా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉపయోగించుకోలేకపోతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

అప్పటికి ఇఫ్పటికి ప్రజా ప్రతినిధుల్లో మార్పువచ్చినట్లు ఏమీ కనబడలేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారానికి రమ్మని రామచంద్రరావు అడిగితే నిజామాబాద్ ఎంపీ రాలేదు. తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చాలు అభ్యర్ధికి జూబ్లీహిల్స్ లో ఓట్లుపడతాయని స్వయంగా ధర్మపురే నిజామాబాద్ మీడియాతో చెప్పారు. బండి సంజయ్ కూడా చివరి మూడురోజులు మాత్రమే ప్రచారంచేశారు. ప్రజాప్రతినిధులంతా ఎవరికి తోచిన దారిలో వారు వెళుతున్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడి ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల మధ్య సఖ్యత లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత మోదీ, అమిత్ షాకే వదిలేసినట్లు అనుమానంగా ఉంది.

ఈ నేపధ్యంలోనే ప్రధాని హైదరాబాద్ వస్తున్నారు. పేరుకు మోదీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తున్నట్లు చెబుతున్నా అది పూర్తి రాజకీయ పర్యటన అనే అనుకోవాలి. ప్రధాని క్యాడర్ ని ఉత్తేజ పరుస్తుంది అనటంలో సందేహంలేదు. అయితే మోదీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టును కంటిన్యు చేసేంత సీన్ నేతలకు ఉందా అన్నదే అనుమానం. జనాల్లోకి పార్టీ వెళ్ళటం కాదు ముందు పార్టీలోని నేతలంతా ఏకతాటిపైకి ఎప్పుడు వస్తారన్నదే తెలీటంలేదు. జనాల్లోకి పార్టీని తీసుకెళ్ళే బాధ్యత ఎంపీలు, ఎమ్మేల్యాలదే అనటంలో సందేహంలేదు. మోదీ పర్యటన తర్వాత తెలంగాణకు కేంద్ర నాయకులు, పరిశీలకుల పర్యటలు కూడా రెగ్యులర్ గా మొదలుకావచ్చు. మరి మోదీ పర్యటన తెలంగాణ పార్టీని ఉత్తేజ పరుస్తుందా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

త్రిముఖ పోటీ తప్పదు: కూరపాటి

బీజేపీ బలోపేతమైన జాతీయపార్టీగా ఎదిగింది అని కాకతీయ యూనివర్సిటి, పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్ధను మ్యానేజ్ చేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘బలహీన పార్టీలు బీజేపీ ముందు నిలబడలేకపోతున్నాయి’’ అని గుర్తుచేశారు. ‘‘బీఆర్ఎస్ ప్రజా వ్యవస్ధలను కుప్పకూల్చేసి, అవినీతిలో కూరుకుపోవటంతోనే జనాలు కాంగ్రెస్ కు ఓట్లేశారు’’ అని చెప్పారు. ‘‘సంక్షేమపథకాలు అమలుచేసినా అనర్హులకు కూడా దక్కాయి అనే అసంతృప్తి జనాల్లో పెరిగిపోవటంతో మార్పు కావాలన్న ఆలోచనతోనే జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు’’ అన్నారు. ‘‘పార్టీ అధికారంలోకి రావటమే అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకోవటంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలుచేయలేకపోతోంది’’ అని అన్నారు. పాత టీడీపీ, పాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి ఇప్పటి కాంగ్రెస్ లో ఉన్నారని గుర్తుచేశారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ లో జరిగిన అవినీతిని బయటపెట్టగలిగి, నేతలంతా ఏకతాటిపైకి వస్తే జనాలు బీజేపీని కూడా ఆదరించే అవకాశముంది’’ అన్నారు. ‘‘లోపాలను సర్దుబాటుచేసుకుని బలోపేతమై నేతలంతా ఒక్కటైతే జనాలు మళ్ళీ కాంగ్రెస్ కు ఓట్లేసే అవకాశంలేకపోలేదు’’ అని కూరపాటి అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ ఇది జరగకపోతే బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చినా రావచ్చు’’ అని కూడా అన్నారు.

‘‘కాంగ్రెస్ బలోపేతం కాకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని అలాగే బీఆర్ఎస్ గనుక బలహీనమైపోతే ఆ ప్లేసును బీజేపీ అక్రమించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది’’ అని చెప్పారు. ‘‘ బీఆర్ఎస్ ను బలహీనపరిచి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ ఏకమైతే బీజేపీని నిలువరించే అవకాశం కూడా ఉంది’’ అన్నారు. ‘‘ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం త్రిముఖ పోటీ చాలా గట్టిగా జరుగుతుంది’’ అని కూరపాటి అభిప్రాయపడ్డారు.

2028లో అధికారంలోకి రాదు: చలసాని

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు చలసాని నరేంద్ర అభిప్రాయపడ్డారు. ‘‘8 మంది ఎంపీలు, 8మంది ఎంఎల్ఏలు గెలుచుకున్నపార్టీ తర్వాత పట్టును కోల్పోయింది’’ అన్నారు. ‘‘ఎంపీలు, ఎంఎల్ఏల మధ్య ఏ విషయంలో కూడా సఖ్యత కనబడటంలేదు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘అధికారంలోకి రావటానికి అవసరమైన కార్యాచరణను బీజేపీ చేయటంలేదు’’ అని చెప్పారు. ‘‘బీజేపీ నేతలు జనాల్లోకి వెళ్ళేందుకు క్షేత్రస్ధాయిలో ఉద్యమాలు చేయటంలేదు’’ అని తెలిపారు. ‘‘జనాలను ఆకట్టుకునేందుకు అవసరమైన మాస్ నేత బీజేపీలో లేరు’’ అని గుర్తుచేశారు. ‘‘ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి జనాలందరినీ కదిలించేట్లుగా ఉద్యమాలు బీజేపీ చేయటంలేదు’’ అని అన్నారు. ‘‘తెలంగాణలో అధికారంలోకి రావటానికి బీజేపీ నాయకత్వం చేస్తున్న చర్యలు ఏమిటని ఎంఎల్ఏ రాజాసింగ్ వేసిన ప్రశ్నను నరేంద్ర ప్రస్తావించారు. ‘‘2028 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేవీ కనబడటంలేదు’’ అని నరేంద్ర తెలిపారు.

Read More
Next Story