తెలంగాణలో పవన్‌ది ‘టెస్ట్ డ్రైవే’నా ?
x

తెలంగాణలో పవన్‌ది ‘టెస్ట్ డ్రైవే’నా ?

తొందరలోనే తెలంగాణలో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు తరపున పవన్ టెస్ట్ డ్రైవ్ లాగ తెలంగాణలో కాలుమోపారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి


జనసేన అధినేత, ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ ది తెలంగాణలో టెస్ట్ డ్రైవ్ అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో మంగళవారం ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ పెట్టబోతున్నట్లు పవన్ చేసిన ప్రకటన తర్వాతే తెలంగాణలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీనే సరిగ్గా జనసేన ఆధ్వర్యంలో నవ నిర్మాణ సంకల్ప సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమిటో అర్ధంకావటంలేదు. గచ్చీబౌలిలోని ఒక ఫంక్షన్ హాలులో సభ నిర్వహణను పోలీసులు అడ్డుకోవటంతో జనసేన అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలుచేసింది. పార్టీ దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటీషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

అంతకుముందు ఉదయం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్ధూపం దగ్గర నివాళులర్పించే సమయంలో కాంగ్రెస్-జనసేన నేతలు, కార్యకర్తల మధ్య పెద్ద తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. పవన్ నుండి ప్రకటన వెలువడగానే తెలంగాణలో సభ పెట్టేందుకు లేదని, రాజకీయాలు చేసేందుకు లేదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఏపీ పార్టీగా ముద్రపడిన జనసేన, తెలంగాణ, వైసీపీలకు తెలంగాణలో మనుగడ లేదని ఇప్పటికే స్పష్టమైంది.

అయితే తొందరలోనే తెలంగాణలో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు తరపున పవన్ టెస్ట్ డ్రైవ్ లాగ తెలంగాణలో కాలుమోపారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఏదిచేసినా నేరుగా చేయరని అందరికీ తెలిసిందే. టీడీపీ తెలంగాణలో అడుగుపెడితే పరిస్ధితులు ఎలాగుంటాయో అంచనా వేసేందుకు చంద్రబాబే జనసేన అధినేతతో ఇలాంటి సభ పెట్టించి ఉంటారనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎంతుందో అంచనా వేయటంలో భాగంగానే పవన్ను ముందుపెట్టి చంద్రబాబు తెరవెనుక రాజకీయం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

Read More
Next Story