దక్షిణాదిలో రేవంత్  హీరో అయిపోయాడా ?
x

దక్షిణాదిలో రేవంత్ హీరో అయిపోయాడా ?

కేరళ ఎన్నికల ప్రచారంతో పాటు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా డీలిమిటేషన్ విధానాన్ని రేవంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు


ఒక్కసారిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిపోయింది. 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగులో బిల్లు వీగిపోయింది. బిల్లు పాస్ అవటానికి అవసరమైన ఓట్లను ఎన్డీయే పక్షం సాధించలేకపోవటంతో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందో పరిస్ధితిని అర్ధంచేసుకున్న ఎన్డీయే నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికల బిల్లులను ఉపసంహరించుకున్నది. మహిళా రిజర్వేషన్‌బిల్లు వీగిపోయిందని, మిగిలిన రెండుబిల్లులను అధికారపక్షం ఉపసంహరించుకున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.

స్పీకర్ ప్రకటనతో ప్రతిపక్షంలోని ఇండియా కూటమితో పాటు నాన్ ఎన్డీయే పార్టీల్లో ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది. ఇదే సమయంలో నరేంద్రమోదీ, అమిత్ షాతో పాటు ఎన్డీయే కేంద్రమంత్రుల్లో తీవ్ర అసహనం మొదలైంది. సరే, ఈ విషయాలు ఎలాగున్నా అప్పటినుండి ఒక్కసారిగా రేవంత్ ఇమేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే పునర్విభజన బిల్లును మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది రేవంత్ అన్నవిషయం తెలిసిందే. కేరళ ఎన్నికల ప్రచారంతో పాటు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా డీలిమిటేషన్ విధానాన్ని రేవంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు.

అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంతో పాటు మొన్నటి 15వ తేదీన జరిగిన ఇండియా కూటమి, నాన్ ఎన్డీయే పార్టీల సమావేశంలో కూడా నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేక స్వరాన్ని గట్టిగా వినిపించారు. అమిత్ షా చెప్పిన 50శాతం సీట్ల విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు ఏవిధంగా అన్యాయం జరుగుతుందో వివరించటమే కాకుండా తనదైన శైలిలో హైబ్రీడ్ విధానం వల్ల ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల మధ్య గ్యాప్ ఏ విధంగా తగ్గుతుందో గట్టిగా వివరించారు. దేశంలో ఎక్కడ పర్యటించినా తనదైన ఫార్ములాను చాలా ధాటిగా వివరించటంతో వ్యతిరేకులకు రేవంత్ సెంటర్ పాయింట్ అయిపోయాడు. దక్షిణాదిలో ముఖ్యమంత్రులు కర్నాటకలో సిద్ధరామయ్య, కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో ఎంకే స్టాలిన్ కూడా రేవంత్ కు మద్దతుగా నిలిచారు.

తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న కారణంగా విజయన్, స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనను రేవంత్ అంత గట్టిగా వ్యతిరేకించలేకపోయారు. ఇక వయసు కారణంగా రేవంత్ అంత ధాటిగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా డీలిమిటేష్ బిల్లుపై దేశమంతా తిరిగి తన వాదనను వినిపించలేకపోయారు. ఏదేమైనా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధి తదితరులు కూడా రేవంత్ అంత సమర్ధవంతంగా తమ వాదనలను వినిపించలేకపోయారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పుణ్యమాని రేవంత్ ఒక్కసారిగా దేశరాజకీయాల్లో బాగా పాపులర్ అయిపోయారు. దానికితోడు శుక్రవారం రాత్రి బిల్లు లోక్ సభలో వీగిపోవటంతో రేవంత్ కు దేశరాజకీయాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హీరో ఇమేజ్ పెరిగిపోయిందనే చెప్పాలి.

బిల్లును ఎందుకు ఉపసంహరించుకుంది ?

నిజానికి మూడు బిల్లులను లోక్ సభలో నెగ్గించుకునేందుకు నరేంద్రమోదీ, అమిత్ షా పెద్ద స్కెచ్చే వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తో పాటు చాలా ప్రతిపక్షాలు ఆమోదించాయి. కాబట్టి ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటానికి ఎలాంటి ఇబ్బందిలేదు. అయితే ఇక్కడే మోదీ, అమిత్ స్కెచ్ బయటపడింది. అదేమిటంటే ప్రతిపక్షాలు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చాయి కాబట్టి మొత్తం మూడు బిల్లులకు లింకు పెట్టి లోక్ సభలో అధికార పక్షం ప్రవేశపెట్టింది. మోదీ, అమిత్ షా ఆలోచన ఏమిటంటే మహిళా బిల్లు ఆమోదంపొందితే దానితో పాటు మిగిలిన రెండు బిల్లులు కూడా పాస్ అయిపోతాయని. మోదీ, అమిత్ వ్యూహాన్ని పసిగట్టిన ఇండియా కూటమి, నాన్ ఎన్డీయే పార్టీలు మొదటప్రవేశపెట్టిన మహిళా బిల్లును ఓడగొట్టాయి. దాంతో వేరేదారిలేక మిగిలిన రెండు బిల్లులను అధికారపక్షమే ఉపసంహరించుకున్నది.

మొదటినుండి కూడా మూడు బిల్లులను వేర్వేరుగానే చూడాలని ప్రతిపక్షాలు చెబుతున్నా మోదీ, అమిత్ షా ఏమాత్రం లెక్కచేయలేదు. మొదట్లో 2027 జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పిన మోదీ, అమిత్

షా సడెన్ గా జనాభా లెక్కల సేకరణతో నిమిత్తం లేకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల పేరుతో ఇపుడే బిల్లుల ఆమోదానికి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటుచేశారు. మొదట్లో అన్నీ రాష్ట్రాల్లోను 50శాతం సీట్లు పెరుగుతాయని చెప్పిన మోదీ, అమిత్ చివరకు ముసాయిదా బిల్లులో అసలా ఊసే లేకుండా చేశారు. అంటే తాము ఎలాగ అనుకుంటే బిల్లులను అలాగ నెగ్గించుకుంటామనే సంకేతాలను దేశానికి పంపారు.

ఈ విషయమే కాదు ఏ విషయంలో కూడా మోదీ, అమిత్ షాలు ప్రతిపక్షాలకు కనీసపాటి గౌరవం కూడా ఇవ్వటంలేదు. ప్రతి విషయంలోను ఒంటెత్తుపోకడలు స్పష్టంగా కనబడ్డాయి. రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేముందే అధికారపక్షం నుండి కొందరు నేతలు ప్రతిపక్షాలను కలిసి మద్దతు అడగటం రివాజు. మోదీ హయాంలో అలాంటి పద్దతులు పాటించటం మానేశారు. మోదీ, అమిత్ వైఖరి కారణంగానే ఇండియా కూటమే కాకుండా నాన్ ఎన్డీయే పక్షాల్లోని చాలాపార్టీలు ఇపుడు ఏకమై అధికారపక్షం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించాయి.

Read More
Next Story