x

హైడ్రా విషయంలో తప్పంతా రేవంత్‌దేనా ?

మొదట్లోనే హైడ్రా దూకుడుకు రేవంత్ పగ్గాలు వేసుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చుండేది కాదనేది వాస్తవం


మూడురోజులుగా హైడ్రా పనితీరు, కమిషనర్ ఏవీ రంగనాథ్ వైఖరి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కోర్టు థిక్కారం కేసులో జస్టిస్ జూకంటి అనీల్ కుమార్ సీరియస్ అవటమే కాకుండా వెంటనే హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించటమే దీనికి కారణం. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి కమిషనర్ వైఖరి చాలాసార్లు వివాదాస్పదమైంది అనటంలో సందేహంలేదు.

ఎప్పుడో నిర్మించిన కొన్నిఅపార్టమెంట్లు చెరువులకు దగ్గరలో ఉన్నాయని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని హైడ్రా కూల్చేసింది. అయితే ప్రభుత్వ శాఖలనుండి అన్నీఅనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేశామని బిల్డర్లు చెప్పినా హైడ్రా పట్టించుకోకుండా కూల్చేసింది. నిర్మాణాలు, అనుమతులతో ఫ్లాట్లు కొనుగోలుదారులకు ఎలాంటి సంబంధంలేకపోయినా హైడ్రా చర్యల వల్ల భారీగా నష్టపోయింది మాత్రం కొనుగోలు చేసిన జనాలే. అప్పులు చేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని కొనుగోలు చేసిన ఫ్లాట్లను హైడ్రా రాత్రికి రాత్రే కూల్చేయటంతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఇదే సమయంలో చెరువులు, నాలాలను ఆక్రమించుకుని ఎకరాల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులు నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ల జోలికిమాత్రం హైడ్రా ఇప్పటివరకు వెళ్ళకపోవటంతో జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. మొదట్లోనే హైడ్రా దూకుడుకు రేవంత్ పగ్గాలు వేసుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చుండేది కాదనేది వాస్తవం. వందలాది చెరువులు, నాలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న బడాబాబుల నిర్మాణాలను కూడా కూల్చేసుంటే జనాల్లో హైడ్రాపై ఇపుడింత వ్యతిరేకత వచ్చుండేదికాదు. కోర్టుఆదేశాలను పాటించకుండా బాగా దూకుడుగా కమిషనర్ వ్యవహరించారు కాబట్టే కమిషనర్ విషయంలో హైకోర్టు ఇంత సీరియస్ అయ్యింది. కాబట్టే ఈ పరిస్ధితికి రేవంత్ దే పూర్తి బాధ్యత అని చెప్పక తప్పదు.

Read More
Next Story