వామపక్షాల మద్దతే రేవంత్‌కు దిక్కా ?
x

వామపక్షాల మద్దతే రేవంత్‌కు దిక్కా ?


సర్ ప్రక్రియలో సుమారు 92 లక్షల ఓట్లు గల్లంతవుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెంచేస్తోంది. గల్లంతవుతున్న ఓట్లను తిరిగి రాబట్టుకోవటంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వామపక్షాల మద్దతుకోరటం గమనార్హం. ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతు సర్ లో గల్లంతయ్యే ఓట్లను తిరిగి రాబట్టుకోవటంలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి పోరాటాలు చేయాలని పిలుపిచ్చాడు. సర్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుండి మొత్తం వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ నేతలు, క్యాడరే చూసుకున్నారు. అయితే ఓట్లు గల్లంతు కాకుండా కాపాడుకోవటంలో కాంగ్రెస్ విఫలమైందని రేవంత్ కు అర్ధమైనట్లుంది. అందుకనే ఇపుడు రేవంత్ సడెన్ గా వామపక్షాల మద్దతు అడిగాడు.


'సర్' పేరుతో జరుగుతున్న ఓట్లకోతపై కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు. గతంనుంచీ వామపక్షాలు ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వాటికి చట్టబద్ధమైన పరిష్కారాలు అందించిందని గుర్తుచేశారు. ‘కనీస వేతన చట్టం’, ‘ఉపాధి హామీ పథకం’, ‘ఆహార భద్రత చట్టం’, ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ వంటి నిర్ణయాల వెనుక వామపక్షాల పోరాటాలే ప్రధాన కారణమని గుర్తు చేసారు. రాష్ట్రంలో ఏకంగా కోటి ఓట్లను తొలగించేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. తనసొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే ఏకంగా 81 వేల ఓట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఓట్లన్నీ ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు, కూలీలవే అన్నారు.


మిగిలిన పార్టీల జెండాలను సామాన్యప్రజలు రాజకీయ జెండాలుగా చూస్తే వామపక్ష జెండాలను మాత్రమే తమను కాపాడే జెండాలుగా నమ్ముతారని అన్నారు. కేంద్రం వల్ల నష్టపోతున్న ఈ పేద ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కమ్యూనిస్టులు ముందుండి పోరాడాలన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా చేయకపోయినా వామపక్ష పార్టీల పోరాటాలే కాంగ్రెస్ కి కలిసి వస్తున్నాయని అన్నారు.


Read More
Next Story