
రేవంత్ ‘మోడల్ స్కూల్స్’ సంస్కరణా? కుట్రా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 'మోడల్ స్కూల్స్' కాన్సెప్ట్ ప్రారంభంలోనే మూలనపడే స్థితికి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోర్ సిటీని మినహాయించి రాష్ట్రంలోని 98 నియోజకవర్గాల్లో ఒక్కో అధునాతన మోడల్ స్కూల్ నిర్మిస్తామని, దీనికోసం బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 'ఆరుట్ల'లో ఒక్క స్కూల్‌ను మాత్రమే ప్రారంభించి, మరో మూడింటికి పనులు ప్రారంభించినప్పటికీ మిగిలిన 94 స్కూళ్ల పరిస్థితి మాత్రం అవసరమైన భూమి లభించక, నిధులులేక ‘కాన్సెప్ట్’ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇప్పటికే ఉన్న వేలాది స్కూళ్ళను బాగుచేయటం మానేసి కొత్తగా మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తామన్న రేవంత్ ప్రకటనపై సర్వత్రా వ్యతిరేకత పెరిగిపోతోంది. మోడల్ స్కూళ్ళ విధానంపై ఉపాధ్యాయ సంఘాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అల్లాడుతుంటే, మోడల్ స్కూళ్లకోసం వందల కోట్లరూపాయలు ఖర్చుచేస్తామన్న ప్రకటనపై టీచర్లు మండిపడుతున్నారు. మారుమూల గ్రామాలు, తండాల్లోని పిల్లలు తమ స్థానిక పాఠశాలలకే అలవాటుపడి ఉంటారని, ఆ స్కూళ్లను బాగు చేయడానికి అయ్యే ఖర్చు ఈ మోడల్ స్కూళ్ల వ్యయం కంటే చాలా తక్కువని చెబుతున్న్నారు.
ఈ విధానంపై ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నేత పల్లె నాగరాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం వంద కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నీ బాగుపడతాయని పదేపదే చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట విస్మరించి, వందల కోట్లు వృధా చేస్తూ మోడల్ స్కూళ్ల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడల్ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకురావడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కేంద్రంతెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వ ప్రాపకం కోసమే పరోక్షంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నారని ఆరోపించారు.సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి దీన్ని ఒక సంస్కరణగా చూడాలని అన్నారు.

