
గ్రామాల ‘డిజిటల్ మ్యాపింగ్’ సాధ్యమేనా?
తెలంగాణ పల్లెల రూపురేఖలను మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సుమారు 12500 గ్రామాలను డిజిటల్ మ్యాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యింది. గ్రామాల్లోని సమస్త సమాచారం అంటే అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్లు, వివిధ పథకాల్లో లబ్దిదారులు, ఊరిలో ఉన్న ఇళ్ళు, గ్రామ జనాభా, చెరువులు, స్కూళ్ళు వ్యవసాయ విస్తీర్ణం, సాగులోని పంటల్లాంటి సమస్త సమాచారాన్ని నిక్షిప్తంచేయటం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించబోతోంది. 'సమగ్ర గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక' (GPCDP 2026-29)ను తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న యాప్ లో ప్రతి గ్రామానికి చెందిన 39 రకాల కీలక అంశాలను డిజిటలైజ్ చేయబోతోంది.
ఈ నూతన విధానం ద్వారా నిధుల దుర్వినియోగానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చని, ప్రజలు చెల్లించే ప్రతి పైసాకూ పక్కా లెక్క ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, మిషన్ భగీరథ, సెర్ప్, స్త్రీనిధి వంటి ఏడు కీలక శాఖలను ఒకే తాటిపైకి తెచ్చి, గ్రామవికాసానికి అవసరమైన బడ్జెట్‌ను సమగ్రంగా కేటాయించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం. తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణం, లింక్ రోడ్లు, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతతో పాటు ఊరి ప్రజల సమస్యలన్నిటిని తెలుసుకుని అవసరాలకు తగ్గట్లుగా నిధుల కేటాయింపు, వ్యయం తదితరాలన్నీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబోతోంది. నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా ఈడిజిటల్ ప్రక్రియను తీసుకురాబోతుంది ప్రభుత్వం.

