Harish Rao comments on E-car Race
x
BRS MLA Harish Rao

సిట్ విచారణలో హరీష్ కు షాక్, అసలైన ట్విస్టు ఇదేనా ?

బాధితుడు ఎలాగంటే హరీష్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, దగ్గరి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయట


టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ నేతలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT)బాధితులుగా మాత్రమే విచారించిన సిట్ బృందం హరీష్(Harish Rao) ను బాధితుడు కమ్ సాక్షిగా పిలిపించి విచారించటమే ఆశ్చర్యంగా ఉంది. బాధితుడు కమ్ సాక్షి ఎలాగంటే కేసీఆర్(KCR) తొమ్మిదన్నర ఏళ్ళ పాలనలో మంత్రిగా హరీష్ కీలకంగా వ్యవహరించారు. అలాగే (Telephone Tapping)ట్యాపింగ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులకు హరీష్ అత్యంత సన్నిహితుడు. అందుకనే సాక్షిగా విచారించారు. ఇక బాధితుడు ఎలాగంటే హరీష్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, దగ్గరి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయట. ఈ విషయం సిట్ అధికారులు చెప్పగానే హరీష్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యిందని సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళితే సిట్ బృందం హరీష్ ను ఏడుగంటలు విచారించింది. ఈ ఏడుగంటల విచారణలో ట్యాపింగ్ లో కీలకపాత్రదారైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు, ట్యాపింగులో కీలకంగా వ్యవహరించిన మీడియా ప్రముఖుడు శ్రవణ్ రావుతో పాటు నలుగురు పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావుతో హరీష్ సంబందాలపై విచారించారు. చాలాప్రశ్నలకు తెలీదు..గుర్తులేదు అనే సమాధానాలిచ్చారు. అదే సమయంలో తనతోపాటు కుటుంబసభ్యుల ఫోన్లు, దగ్గరి అనుచరుల ఫోన్లు ట్యాప్ అయిన విషయం తెలుసా అని అధికారులు అడిగినపుడు హరీష్ నవ్వేసినట్లు సమాచారం. ‘‘తన ఫోన్, కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే నమ్మను’’ అని సమాధానం చెప్పినట్లు తెలిసింది.

హరీష్ అలా అనగానే అధికారులు కాల్ లిస్టుతో పాటు ట్యాపింగ్ అయినట్లు కొన్ని ఆధారాలను హరీష్ ముందుంచారు. వాటిని చూడగానే హరీష్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లు తెలిసింది. ఒకపుడు బీఆర్ఎస్ లో కీలకంగా ఉండి తర్వాత పార్టీనుండి గెంటివేతకు గురై ఇపుడు బీజేపీలో ప్రజాప్రతినిధిగా ఉన్న నేతతో హరీష్ ఫోన్ కాల్స్, చాటింగుల వివరాలన్నింటినీ సిట్ అధికారులు చూపించినట్లు తెలిసింది. తామిద్దరి మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సిట్ అధికారులు చూపించగానే తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందా అనేట్లుగా హరీష్ ముఖకవళికలు మారిపోయినట్లు అధికారులు గుర్తించారు.

కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయా ?

తనతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు కూడా అప్పట్లో ట్యాప్ అయ్యాయన్న విషయాన్ని హరీష్ జీర్ణించుకోలేకపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తర్వాత పార్టీకి సంబంధించిన అనేక విషయాలను కూడా విచారణలో అధికారులు హరీష్ ను ప్రశ్నించారు. 2018, 2023 ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీల నేతలకు సంబంధించిన వ్యూహాలు బీఆర్ఎస్ కు ఎలాగ తెలిసాయనే కోణంలో కూడా హరీష్ ను అధికారులు చాలాసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. ఏదేమైనా సిట్ అధికారులు చూపించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలతో తనతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు కూడా అప్పట్లో ట్యాప్ అయ్యాయి అనే నిజం హరీష్ కు జీర్ణమవటం కష్టమే. అయినా సొంత కూతురు కవిత, ఆమె భర్త ద్యావనపల్లి అనీల్ కుమార్ ఫోన్లే ట్యాప్ చేయించినపుడు మేనల్లుడు హరీష్ ఫోన్ ట్యాప్ చేయించటంలో ఆశ్చర్యమేముంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనతో పాటు భర్త అనీల్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కవిత బహిరంగంగా ఆరోపించిన విషయం గుర్తుండేవుంటుంది.

పార్టీ నాయకత్వం విషయంలో కొడుకు కేటీఆర్ భవిష్యత్తుకు హరీష్ పెద్ద థ్రెట్ గా హరీష్ మారిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీలోని మెజారిటి నేతల మద్దతు కేటీఆర్ కన్నా హరీష్ కే ఎక్కువుంది. అందుకనే పార్టీకి అధ్యక్షుడిగా చేయలేకపోయిన కేసీఆర్ చివరకు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపెట్టాల్సొచ్చింది. పార్టీకి అవసరమైనపుడు హరీష్ ను దగ్గరకు తీసుకుని అవసరంలేనపుడు దూరంగా పెట్టేయటం కేసీఆర్ కు అలవాటే అని పార్టీలోనే టాక్ ఉంది.

చాలారోజులు ఫోన్ వాడలేదు : బండి

హరీష్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న విషయమై బీజేపీ కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు తన ఫోన్ ట్యాపయ్యిందన్న విషయం హరీష్ కు అనుమానం వచ్చింది అన్నారు. ఆ అనుమానంతోనే చాలారోజులు హరీష్ అసలు మొబైల్ ఫోనే వాడని విషయం తనకు తెలుసన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని గతంలో హరీషే చెప్పాడని బండి గుర్తుచేశారు. తన ఫోన్ ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారని మండిపడ్డారు. ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్, కేటీఆర్ తో పాటు అందరిపైనా రేవంత్ ప్రభుత్వం వెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని బండి డిమాండ్ చేశారు.

అందరి ఫోన్లను ట్యాప్ చేయించారు: కూరపాటి

హరీష్ కు ట్యాపింగ్ లో కీలకమైన అధికారులతో దగ్గరి సంబంధాలున్నాయి అని ప్రొఫెసర్ కూరపాటి తెలిపారు. ‘‘ట్యాపింగ్ లో తన అవసరాలకోసం హరీష్ కూడా అప్పట్లో అధికారులను ఉపయోగించుకున్నాడు’’ అని కాకతీయ యూనివర్సిటి, పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. ‘‘హరీష్ మీద కూడా కేసీఆర్, కేటీఆర్ కు నమ్మకంలేదు కాబట్టే అతని ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘అవసరానికి హరీష్ ను వాడుకోవటమే కాని మొదటినుండి కేసీఆర్ కు తనపైన నమ్మకంలేదు’’ అని చెప్పారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో 30మంది కాంగ్రెస్ అభ్యర్ధులకు హరీష్ నిధులు అందించాడనే ప్రచారం అందరికీ తెలిసిందే’’ అని కూరపాటి గుర్తుచేశారు. ‘‘కొడుకును అందలం ఎక్కించటమే లక్ష్యంతో కూతురు కవిత ఫోన్ తో పాటు హరీష్ ఫోన్ కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు’’ అని చెప్పారు. ‘‘తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో అనుమానం ఉన్న అందరి ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారు’’ అని మండిపడ్డారు. ‘‘కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలు చెప్పటంలో బాగా ఆరితేరిపోయింది’’ అని ఎద్దేవాచేశారు. ‘‘వాళ్ళుచేసిన తప్పుడు పనులు బయటపడగానే అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించటం’’ మామూలే అని మండిపడ్డారు.

Read More
Next Story