
కేసీఆర్ తీరు నాకు ఎంతో నచ్చింది: జీవన్
కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర పరిస్థితులపైనే జగిత్యాల సభ ఉంటుందన్న జీవన్ రెడ్డి.
తన పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాన రాజీకయంగా ఎంత విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. కానీ ఊపిరి ఆగినా పర్లేదన్నట్లు పనిచేసిన కాంగ్రెస్ మాత్రం తనను కాదనుకుందని, ఈ విషయంలో కేసీఆర్ వైఖరితో తాను ఎంతో సంతోషంగా ఉన్నాని చెప్పారు. ఈ సందర్భంగానే జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ సభ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుందని తెలిపారు.
‘‘కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న తర్వాత కొన్ని రోజులు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాను’’ అని జీవన్ రెడ్డి వెల్లడించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. సోమవారం జరగనున్న సభ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర పరిస్థితులపైన జరగనుందని చెప్పారు. ఈ సభ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంతో రైతాంగానికి మేలు..
ఈ సందర్భంగానే తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం వల్ల పెద్ద మొత్తంలో మేలు జరుగుతుందని జీవన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు. తాను తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కోసం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, కాళేశ్వరంతో మేలు భారీగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మించాలన్నా కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఎన్‌డీఎస్ఎఫ్ రిపోర్టు ఇచ్చి ఏడాది అవుతుందని, ఇంత కాలం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గుడ్డి గుర్రం పల్లు తోముతున్నారా అంటూ చురకలంటించారు. ఈ సందర్భంగానే ప్రాజెక్ట్ పునరుద్దరణ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు.

