జైపూర్ పవర్ డీల్ అసలు కథేంటి?
x

జైపూర్ పవర్ డీల్ అసలు కథేంటి?

అసలు ఒప్పందం ఏంటి? నిజంగా మొత్తం కరెంట్ రాజస్థాన్‌కే వెళ్తుందా? హరీశ్‌రావు ఆరోపణల్లో నిజమెంత?


మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వనరులతో తయారయ్యే విద్యుత్‌ను తెలంగాణ అవసరాలకు కాకుండా రాజస్థాన్‌కు ఎందుకు ఇవ్వాలన్నది ఆయన ప్రశ్న.

అయితే.. అసలు ఒప్పందం ఏంటి? నిజంగా మొత్తం కరెంట్ రాజస్థాన్‌కే వెళ్తుందా? హరీశ్‌రావు ఆరోపణల్లో నిజమెంత? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్‌కు సంబంధించిన కొత్త విద్యుత్ ప్రాజెక్టు విషయంలోనే రాజస్థాన్‌కు చెందిన Rajasthan Rajya Vidyut Utpadan Nigam Limited — RVUNLతో భాగస్వామ్యం తెరపైకి వచ్చింది.

ఒప్పందంలో అసలు ఏముంది?

2025లో SCCL, RVUNL మధ్య పవర్ ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రారంభ ప్రతిపాదనల్లో మొత్తం 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన వచ్చింది. అందులో 800 మెగావాట్లు తెలంగాణలో, మరో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు సంబంధించిన అవసరాల కోసం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఆ తర్వాతి దశలో ప్రాజెక్టు నిర్మాణ రూపకల్పనలో మార్పులు వచ్చాయి.

రాజస్థాన్ క్యాబినెట్ ఆమోద వివరాల ప్రకారం.. జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్‌కు ₹9,600 కోట్లు, రాజస్థాన్‌లో 1,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ₹6,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. అంటే ఇది కేవలం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కాదు.. థర్మల్, సోలార్ ప్రాజెక్టులతో కూడిన జాయింట్ వెంచర్.

JVలో వాటాల ప్రకారంSCCL (సింగరేణి): 74%RVUNL (రాజస్థాన్ ప్రభుత్వం): 26%

హరీశ్‌రావు ఆరోపణలేంటి?

ఇక్కడే రాజకీయ వివాదం మొదలైంది. తెలంగాణకు చెందిన బొగ్గు. తెలంగాణ భూమి. తెలంగాణ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి. దాన్ని రాజస్థాన్‌కు ఎందుకు ఇవ్వాలని హరీశ్‌రావు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రైతులు, పరిశ్రమలకు విద్యుత్ అవసరం ఉన్నప్పుడు కొత్తగా ఉత్పత్తి అయ్యే 800 మెగావాట్లను తెలంగాణకే ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సింగరేణి సంస్థ తన డబ్బును రాజస్థాన్‌లోని సోలార్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

అంటే హరీశ్‌రావు ప్రధానంగా రెండు విషయాలను టార్గెట్ చేస్తున్నారు.

1. తెలంగాణలో ఉత్పత్తయ్యే విద్యుత్ వినియోగం.

2. సింగరేణి పెట్టుబడుల ప్రయోజనం.

హ‌రీష్ రావు ఏం చెబుతున్నారంటే, “జైపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ మొత్తం రాజస్థాన్‌కు వెళ్తుంది.”

ఇది పూర్తిగా సరైన వాదన కాదు. ఎందుకంటే ప్రారంభ ప్రతిపాదనల్లో 1,600 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టులో 800 మెగావాట్లు తెలంగాణకు, 800 మెగావాట్లు రాజస్థాన్‌కు సంబంధించినవిగా పేర్కొన్నారు. తర్వాతి రాజస్థాన్ క్యాబినెట్ ఆమోద వివరాల్లో మాత్రం 800 మెగావాట్ల థర్మల్ యూనిట్‌తో పాటు రాజస్థాన్‌లో 1,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల మోడల్ కనిపిస్తోంది. అందువల్ల “తెలంగాణ ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను రాజస్థాన్‌కు తరలిస్తున్నారు” అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది.

అసలు వివాదం ఏంటి?

ఈ వివాదాన్ని మూడు కోణాల్లో చూడాలి.

1. తెలంగాణ వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తెలంగాణకే ప్రాధాన్యత ఉండాలా?

2. సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఎంత?

3. ఈ జాయింట్ వెంచర్ ద్వారా తెలంగాణకు వచ్చే ఆర్థిక లాభం, రాజస్థాన్‌కు వెళ్లే విద్యుత్ ప్రయోజనం కంటే ఎలా ఉంటుంది?

ఇవి రాజకీయ ఆరోపణల కంటే.. ఒప్పందంలోని పూర్తి నిబంధనలు, పెట్టుబడి నిర్మాణం, పవర్ ఆఫ్‌టేక్ వివరాలను బట్టి తేలాల్సిన అంశాలు.

మొత్తంగా చూస్తే.. ఇది “తెలంగాణ మొత్తం కరెంట్‌ను రాజస్థాన్‌కు తరలించే డీల్”గా చెప్పలేం.

హరీశ్‌రావు చేస్తున్నది ప్రధానంగా తెలంగాణ ప్రయోజనాల కోణంలో ఈ ఒప్పందాన్ని ప్రశ్నించడం.ఇక ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఇవ్వాల్సిన క్లారిటీ ఒక్కటే. ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు ఎంత విద్యుత్? ఎంత పెట్టుబడి? ఎంత ఆదాయం? ఆ లెక్కలు స్పష్టంగా బయటకొస్తే.. జైపూర్ పవర్ డీల్‌పై పూర్తి చిత్రం మరింత క్లియర్ అవుతుంది.

“సింగరేణికి ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు కొత్త కాదు. కర్ణాటకతో బొగ్గు సరఫరా ఒప్పందాలు, NTPCతో పవర్–కోల్ ప్రాజెక్టులపై JV ప్రయత్నాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత రాజస్థాన్ ఒప్పందం ప్రత్యేకత ఏంటంటే.. SCCL 74% వాటాతో, మరో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థతో కలిసి థర్మల్–సోలార్ ప్రాజెక్టుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.”

Read More
Next Story