పాంచజన్యం పూరించిన కవిత
x

పాంచజన్యం పూరించిన కవిత

తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించిన పాంచజన్యం వెనుక ఉన్న అసలు అర్థాన్ని కవిత వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి సహా ఐదు కీలక హామీలపై ఆమె స్పష్టతనిచ్చారు.


తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రకటించిన ‘పాంచజన్యం’ అంటే ఏమిటి? ప్రజలకు ఆ పార్టీ ఇచ్చే ఐదు భరోసాలు ఏంటి? అనే అంశాలపై కవిత స్పష్టతనిచ్చారు. శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై యుద్ధం ప్రకటించేందుకే శ్రీకృష్ణుడి పాంచజన్యం తరహాలో ఈ ఐదు అంశాలను ఎంచుకున్నట్లు వివరించారు.

ఉచిత విద్యే ప్రథమ లక్ష్యం

పాంచజన్యంలో మొదటి అంశం విద్య. ప్రస్తుతం సామాన్యులు తమ సంపాదనలో 60 శాతం పిల్లల చదువులకే ఖర్చు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ స్కూళ్లలో సైతం ఉచిత విద్యను అందిస్తామని, విద్యార్థి ఎంత వరకు చదవాలనుకుంటే అంత వరకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.

వైద్యంపై భరోసా

రెండోది వైద్యం. ఆరోగ్యశ్రీ పరిమితి పెరిగినా ఆసుపత్రి బిల్లులు సామాన్యుడికి భారంగా మారాయని కవిత విమర్శించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్న తరుణంలో, రోగికి ఎంత ఖర్చయినా సరే పూర్తి ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సేన ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

రైతు సంక్షేమం - ఉపాధి కల్పన

వ్యవసాయం, ఉపాధికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని కవిత చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వంలో మద్దతు ధరతో పాటు వేగవంతమైన కొనుగోళ్లు ఉంటాయన్నారు. ఇక ఉపాధి విషయంలో.. యువత ఆలోచనలకు ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుందని వివరించారు. 18 నుండి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి, ముఖ్యంగా మహిళలకు 2 లక్షల నుండి 20 కోట్ల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు.

అమ్మతనంతో సామాజిక న్యాయం

చివరిగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు, ఓసీల్లోని పేదలు మరియు వృద్ధులకు న్యాయం చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాల్లో ‘అమ్మతనం’ లోపించిందని, తాము ఆ మమకారంతోనే పాలన సాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఐదు సూత్రాలతోనే తెలంగాణ భవిష్యత్తును మారుస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More
Next Story