
కవితలో ధీమా పెంచుతున్న విజయ్ గెలుపు
తెలంగాణలో కూడా కొత్త పార్టీకే ప్రజలు పట్టం కడతారని కవిత ధీమా.
తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఇళయతళపతి పార్టీ టీవీకే విజయం తెలంగాణలో కవితకు ఎనలేని ధీమాను అందిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపును ఉద్దేశించి తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో విజయ్ విజయం దేశానికి ఒక సంకేతం పంపుతోందంటూ ఆమె తన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ ద్వారా తెలంగాణలో కూడా కొత్త పార్టీకే ప్రజలు పట్టం కడతారన్న ధీమాను కవిత వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఉన్న వాళ్లతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారి పోయాం, భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి “కొత్త రాజకీయ శక్తులు” అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు’’ అని కవిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అదే ట్రెండ్‌ను తెలంగాణ ప్రజలు కూడా అనుసరిస్తారని, రెండేళ్లలో రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు పార్టీలు, వారి అధికారి దాహార్తులకు విసిగిపోయి ఉన్నారని, తమకే ఓటు వేస్తారన్న ధీమాను కవిత తన పోస్ట్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
దానికి తోడు ఇప్పటికే పలుసార్లు కవిత.. తనను తాను కాబోయే సీఎం అని చెప్పుకున్నారు. తమకు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నాయని, ఆలోపు కాలికి బలపం కట్టుకుని ప్రజల్లో పర్యటిస్తామని కవిత ఇటీవల ప్రకటించారు. ప్రజల కష్టాలను లేవనెత్తుతామని, అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలను తీర్చే దిశగా అడుగులు వేస్తామని కూడా కవిత చెప్పారు. దాంతో పాటుగానే తమ ప్రభుత్వం వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని కూడా ఇప్పటి నుంచే హామీలిస్తున్నారు. తన గెలుపు తథ్యమని తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయని కవిత తన పోస్ట్ ద్వారా పరోక్షంగా హింట్ ఇస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

