
వెయ్యి జన్మలెత్తినా నేను చావను: రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్
జగిత్యాల సభలో కాంగ్రెస్ విమర్శలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి, మిషన్ భగీరథపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చనిపోవాలని కొందరు కోరుకుంటున్నారని, కానీ ప్రజల దీవెనలు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పాల్గొన్న ఆయన, ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని కేసీఆర్ వివరించారు. భూగర్భ జలాలు పెంచేందుకు మిషన్ కాకతీయ చేపడితే, రైతులు ఉద్యమంలా పాల్గొన్నారని గుర్తు చేశారు.
మాటలు చెప్పే సర్కార్ మాది కాదు
కేవలం మాటలు చెప్పడం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు చేసి చూపించామన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని గతంలో అసెంబ్లీలో సవాల్ చేశానని, చెప్పినట్లుగానే మిషన్ భగీరథను పూర్తి చేశానని తెలిపారు. ఐదేళ్లు నీళ్లు పుష్కలంగా వచ్చాయని, కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు అందాలంటే అధికారులు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు.
తన మరణాన్ని కోరుకునే వారికి ఒక పిల్లి కథ ద్వారా కేసీఆర్ చురకలు అంటించారు. ఉట్టి పడాలని పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడదని ఎద్దేవా చేశారు. తాను వెయ్యి జన్మలెత్తినా చావనని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వయసుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయని చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు గర్వంగా, సంతోషంగా బతికే వరకు తాను విశ్రమించనని ప్రకటించారు. చివరి శ్వాస వరకు రాష్ట్ర సేవకే అంకితమవుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. నాయకులు ఉత్సాహంతో యువకుల్లా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి పర్యటిస్తారని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు సూచించాయని వెల్లడించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి దక్కుతుందని చెప్పారు.
జీవన్‌కి ధైర్యం ఎక్కువ
జీవన్ రెడ్డి ధైర్యవంతుడైన నాయకుడని కేసీఆర్ అభివర్ణించారు. ఆయనతో తమకు సుదీర్ఘ స్నేహం ఉందని, పార్టీలు వేరు అయినా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ఆయనకు పదవులు కొత్తకాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే తెలంగాణ సాధనలో ఎదురైన కష్టాలను కేసీఆర్ గుర్తుచేశారు. ఆ కాలంలో తెలంగాణ కోసం మాట్లాడడమే కష్టమైందని, విద్యుత్ చార్జీల పెంపుపై జరిగిన నిరసనల సమయంలో జరిగిన ఘటనలు తనను కదిలించాయని తెలిపారు. అవమానాలను తట్టుకుని చివరకు రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపినట్లు కేసీఆర్ వివరించారు. రైతులకు భారీగా నిధులు ఖర్చు చేసినట్లు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు వంటి పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ఉద్యోగులకు PRC, బీడీ కార్మికులకు పింఛన్లు అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హామీలు అమలు కాలేదని, రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూరియా కొరత, నీటి సమస్యలు, రియల్ ఎస్టేట్ మందగమనం వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడ్డారు.
హైడ్రాకు ఫుల్‌స్టాప్ పెట్టడం ఖాయం
హైడ్రా విధానాన్ని రద్దు చేస్తామని, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చరాదని సూచించారు. అభివృద్ధి ప్రజల ప్రయోజనాలకే ఉండాలని చెప్పారు. ప్రాజెక్టుల అమలులో సమతుల్యత అవసరమని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

