తెలుగు ప్రచారంతో ఎంఎల్ఏగా గెలిచి మంత్రయిన ఎంఎల్ఏ కీర్తన సంపత్
x

తెలుగు ప్రచారంతో ఎంఎల్ఏగా గెలిచి మంత్రయిన ఎంఎల్ఏ కీర్తన సంపత్

తనఎన్నికల ప్రచారాన్ని కీర్తన ఎక్కువగా తెలుగులోనే చేశారు


ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి డబ్బులు ఖర్చుపెట్టకుండా కేవలం ప్రచారంలో సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి గెలిచిన తెలుగు తెలిసిన అమ్మాయి కీర్తన సంపత్. కీర్తన కెరీర్ మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. తమిళనాడులోని శివకాశిలో పుట్టిపెరిగి బయట ఎక్కడో ఉద్యోగాలు చేసి చివరకు మళ్ళీ శివకాశీకే చేరుకున్నది కీర్తన. ఎన్నికలకు నెలముందు టీవీకే చీఫ్ విజయ్ పిలిచి మరీ టికెట్ ఇచ్చాడు. తనకు బాగా పట్టున్న డిజిటల్ మీడియా ద్వారానే ప్రచారం చేసి గెలిచిన 30 ఏళ్ళ కీర్తన ఇపుడు విజయ్ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా అయిపోయారు.

అసలు విషయం ఏమిటంటే విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి అనే పట్టణం. ఆమె డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నది. పక్కనే ఉన్న శివకాశితో అనుబంధం బాగా ఎక్కువే. తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెసీ స్టాటిస్టిక్స్ పూర్తిచేశారు. డేటా అనలిస్టుగా ఆమెకున్నా నైపుణ్యాలే ఆమెకు పొలిటికల్ కన్టల్టెంట్ గా అవకాశాలు తెచ్చాయి. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ లో చేరారు. గోవా, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఐప్యాక్ బృందంలో పనిచేశారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ గెలుపుకు పనిచేశారు. తర్వాత ఏపీకి వచ్చి తెలుగుదేశంపార్టీ తరపున పనిచేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంటు సోషల్ మీడియా హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. టీడీపీతో పనిచేసినపుడే తెలుగుమీద గట్టిపట్టు సాధించారు. ఇపుడు కీర్తన తెలుగును అనర్ఘళంగా మాట్లాడుతున్నారు. అప్పుడు నేర్చుకున్న తెలుగే ఇపుడు కీర్తనకు ఓట్లను తెచ్చిపెట్టింది.

ఎలాగంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసిన కీర్తనలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. కారణం ఏమిటంటే పుట్టి పెరిగిన జిల్లా, ఊరికి ఏమీ చేయలేకపోతున్నాను అన్న బాధ పట్టి పీడించేది. అందుకనే ఉద్యోగాన్ని వదులుకుని దేశానికే వెలుగులు నింపుతున్న శివకాశికి చేరుకున్నది. అక్కడ ఒక ఆఫీసు పెట్టి స్ధానిక సమస్యలు, వాటి పరిష్కారంపై పనిచేయటం మొదలుపెట్టారు. ఎలాగూ డిజిటల్ మీడియాలో బాగా పట్టుంది కాబట్టి శివకాశిలోని సమస్యలను హైలైట్ చేస్తు జనాలందరి దృష్టిలో సమస్యలు పడేట్లు చేయగలిగారు. విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ కాల్వలపైన ప్రతిరోజు డిజిటల్ మీడియా వేదికగా పోరాటం చేశారు. ఆమెపోరాటానికి స్ధానికుల మద్దతు విపరీతంగా పెరిగిపోయింది.

సమస్యల పరిష్కారంకోసం పోరాటంలో ఎన్జీవో సంస్ధల సాయం కూడా కీర్తన తీసుకోవటంతో ఆమె పోరాటం తొందరలోనే జిల్లా అంతా వ్యాపించింది. ఆమెకు లక్షల్లో ఫాలోయర్లు పెరిగిపోయారు. ఆమె ఒత్తిడి ఫలితంగా కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. కీర్తన పోరాటం, లక్షల్లో ఫాలోయర్లు తదితరాలను గమనించిన టీవీకే చీఫ్ విజయ్ ఆమెను పిలిపించుకుని మాట్లాడాడు. ఆమె కూడా ఓకే చెప్పటంతో శివకాశి నియోజకవర్గానికి అభ్యర్ధిగా ప్రకటించేశాడు. ఆమెకు విజయ్ టికెట్ ప్రకటించటం ఎన్నికలకు సరిగ్గా నెలముందు మాత్రమే జరిగింది. టీవీకే అభ్యర్ధిగా కీర్తన కొత్త కానీ సమస్యల మీద పోరాడిన కీర్తనగా ఆమె అప్పటికే లక్షలాదిమందికి చిరపరిచితురాలు.

ఇక్కడే ఒకట్విస్టు ఏమిటంటే శివకాశీలో ఏమూలకు వెళ్ళినా తెలుగు వాళ్ళుంటారని అప్పటికే గమనించారు. అందుకనే తనఎన్నికల ప్రచారాన్ని కీర్తన ఎక్కువగా తెలుగులోనే చేశారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్ళినా తెలుగులోనే మాట్లాడారు. అవసరమైన చోట తమిళం లేదా తెలుగులో ప్రచారం చేయటం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఇంకేముంది తన సమీప ఐఎన్‌సీ పార్టీ అభ్యర్ధి అశోకన్ జీ మీద సుమారు 11 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఆమె విజయరహస్యం ఏమిటంటే ఇంటింటికి వెళ్ళి ప్రచారంచేయటం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవటంతో పాటు తెలుగులో చేసిన ప్రచారం అని కీర్తనే చెప్పారు. గెలిచిన తర్వాత టీవీకే పార్టీ తరపున మీడియాలో మాట్లాడిన అతికొద్ది మందిలో కీర్తన ఒకరైతే తెలుగు మీడియాతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడింది కీర్తన ఒక్కరే. ఇక్కడో పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే శివకాశీ నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పోటీచేసిన మొట్టమొదటి మహిళ కూడా కీర్తనే.

Read More
Next Story