
రేవంత్ హైబ్రీడ్ పాలసీపై కిషన్ ఘాటు వ్యాఖ్యలు..!
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
డిలిమిటేషన్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కన్నా ఎంఐఎం ఎక్కువైపోయిందన్నట్లు వ్యాఖ్యానించారు. అందుకనే హైబ్రిడ్ పద్దతి పేరుతో రేవంత్.. ఎంఐఎం ఫార్ములా చెప్తున్నారని దుయ్యబట్టారు. డిలిమిటేషన్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేసే పద్దతే కేంద్రం అనుసరిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిలిమిటేషన్ కోసం కేంద్రం హైబ్రిడ్ పద్దతిని అనుసరించాలంటూ ఒక కీలక సూచన కూడా చేశారు. అయితే తాజాగా రేవంత్ చెప్పిన హైబ్రిడ్ పద్దతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చెప్తున్నది హైబ్రిడ్ ఫార్ములా కాదని, అసదుద్దీన్ ఫార్ములా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఈ అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారని చెప్పారు. నార్త్, సౌత్ మధ్య విభేదాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అయితే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రెవెన్యూ ఎక్కువగా వస్తుందని అక్కడే అసెంబ్లీ సీట్లు పెంచుతారా అని ఆయన ప్రశ్నించారు.
డబ్బు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా అని కూడా సందేహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లపై మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో తమ సీట్లు తగ్గిపోతాయనే భయంతోనే ఆ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా అసదుద్దీన్ తన ఫార్ములాను చెప్పించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు.
కొత్త నాయకత్వం వస్తే తమ స్థానాలు దెబ్బతింటాయనే భయంతో విపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లు ఒకే నిష్పత్తిలో పెరుగుతున్నాయని ఆయన వివరించారు. ఏపీలో 25 నుంచి 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి సీట్లు పెరుగుతున్నాయని తెలిపారు. దక్షిణాదిలో పెరిగినట్టే ఉత్తరాదిలో కూడా సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా రాజ్యాంగ సవరణ సాధ్యం కాదని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని పార్టీలతో చర్చల సమయంలో అంగీకరించి, పార్లమెంట్‌లోకి వచ్చాక అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

